ఇంతకు మించిన అవార్డు ఏముంటుంది!
ఇటీవల భారత ప్రభుత్వం దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించిన సంగతి తెలిసిందే
ఇటీవల భారత ప్రభుత్వం దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు. ఇప్పటికే అవార్డు ప్రకటించిన నేపథ్యంలో చిరంజీవి అభిమానులు సహా పరిశ్రమ అంతా అభినందనలు తెలియజేసారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున సన్మానం కూడా అందుకున్నారు.
తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న చిరంజీవికి ఘనమైన స్వాగతం లభించింది. లాస్ ఏంజిల్స్‌లో తెలుగు అభిమానులు అంతా ఘనంగా సన్మానించారు. అమెరికాలోని మెగా ఫాన్స్ `మెగా ఫెలిసిటేషన్ ఈవెంట్` ను ఆదివారం లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో చిరంజీవిని ఘనంగా సత్కరించారు. పుష్ప గుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
`అవార్డు వచ్చినప్పుడు ఆనందంగా ఉంటుంది. ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ విషయంలో నాకన్నా ఎక్కువగా అభిమానులే ఆనందించారు. సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎంతో ప్రేమ చూపిస్తూ ఆదరిస్తు న్నారు. మీ నుంచి వచ్చే ఈ ప్రశంసలే నాలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. ఇది కదా అసలైన అవార్డు. ఇంతకు మించిన అవార్డు ఇంకేం ఉంటుంది` అని అన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరుపున కూడా మెగాస్టార్ ని ఘనంగా సత్కరించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
తెలుగు పరిశ్రమకు ఆయన అందించిన సేవల్ని మరోసారి గుర్తు చేసుకుంటూ ...పరిశ్రమకి గొప్ప గౌర వాన్ని తీసుకొచ్చిన మెగాస్టార్ ని సన్మానించుకోవడం ఓ పెద్ద పండుగలా పరిశ్రమ భావిస్తుంది. అంతకు ముందు అదే ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా వరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే వేదికపై బన్నీని సన్మానించే అవకాశాలు ఉన్నాయి.