ఏడు ఆస్కార్‌లు కొల్లగొట్టాక నోలాన్ సైలెన్స్ వెనక
అతడు బరిలో దిగితే .. అవార్డుల మోతే! అతడు ఏదైనా ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తే పీక్స్ చూపిస్తాడు.
అతడు బరిలో దిగితే .. అవార్డుల మోతే! అతడు ఏదైనా ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తే పీక్స్ చూపిస్తాడు. అతడు సినిమాని ప్రారంభిస్తే దాని కాన్సెప్ట్ ఉత్కంఠ పెంచేస్తుంది. అది ఏ జానరో తెలుసుకోవాలన్న ఆత్రుత అందరిలోను ఉంటుంది. ప్రాజెక్ట్ గురించి విపరీతమైన చర్చ సాగుతుంది. సాంకేతికంగా వండర్స్ క్రియేట్ చేయడంలో అతడి యూనిక్ స్టైల్ ఎప్పుడూ విస్మయపరుస్తుంది. ఇప్పటివరకూ అతడు తెరకెక్కించిన వాటిలో మెజారిటీ సినిమాలకు ఆస్కార్‌లు దక్కాయి. ఇన్‌సెప్షన్, ఇంటర్‌స్టెల్లార్, డన్ కిర్క్, ఓపెన్ హీమర్ .. ఇలా ప్రతి సినిమా ఆస్కార్‌లు గెలుచుకున్నవే.
నోలాన్ తెరకెక్కించిన చివరి చిత్రం `ఓపెన్‌హైమర్` ఏడు ఆస్కార్ లు కొల్లగొట్టింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు సహా ఏడు ఆస్కార్స్ తో 2024లో మెరుపులు మెరిపించింది. ఈ చిత్రానికి మొత్తం ఏడు అవార్డులు వచ్చాయి. క్రిస్టోఫర్ నోలన్ ఉత్తమ దర్శకుడిగా, సిలియన్ మర్ఫీ ఉత్తమ నటుడిగా, రాబర్ట్ డౌనీ జూనియర్ ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారాలు గెలుచుకున్నారు. ఈ చిత్రం ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ , ఉత్తమ ఎడిటింగ్ అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ బయోపిక్ చిత్రం BAFTA ఫిల్మ్ అవార్డ్స్ 2024లో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ పాపులర్ నటుడు అవార్డులు సహా ఏడు పురస్కారాలతో ఆధిపత్యం చెలాయించింది. ఈ చిత్రం భారీ విజయం సాధించడమే కాదు, అనేక వేదికలపై ప్రశంసలను అందుకుంది. 30వ వార్షిక స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్స్‌లోను ఇది సత్తా చాటింది. ఉత్తమ నటుడుగా సిలియన్ మర్ఫీ, ఉత్తమ సహాయ నటుడుగా రాబర్ట్ డౌనీ జూనియర్ సహా మూడు పురస్కారాలు గెలుచుకుంది.
భౌతిక శాస్త్రవేత్త J. రాబర్ట్ ఒపెన్‌హైమర్‌గా సిలియన్ మర్ఫీ నటనకు గొప్ప పేరొచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అణు బాంబును అభివృద్ధి చేయడానికి మాన్‌హాటన్ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించిన రాబర్ట్ సిలియన్ మర్ఫీ అనే సైంటిస్ట్ కథ ఇది. అణుబాంబ్ తయారీ తో భవిష్యత్ లో తలెత్తే భయానక పరిస్థితుల గురించి ఊహించే సైంటిస్టు అంతర్మథనానికి సంబంధించిన కథాంశమిది.
ఓపెన్ హైమర్ థియేటర్లలో సంచలన విజయం సాధించింది. అటుపై సంచలనాల క్రిస్టోఫర్ నోలన్ తన తదుపరి చిత్రం కోసం పాపులర్ హాలీవుడ్ స్టార్ మాట్ డామన్‌తో కలిసి పనిచేయడానికి చర్చలు జరుపుతున్నట్లు డెడ్‌లైన్ తెలిపింది. నోలన్ తన తదుపరి చిత్రం కోసం మాట్ డామన్ తో అలాగే, యూనివర్సల్ పిక్చర్స్‌తో తిరిగి కలుస్తున్నాడని సమాచారం. 17 జూలై 2026న ఈ సినిమాని విడుదల చేయాలనేది ప్లాన్. అయితే యూనివర్సల్ స్టూడియోస్ ఇంకా ఎలాంటి వివరాలను బయటకు వెల్లడించలేదు. ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిటన్న వివరాలను కూడా గోప్యంగా ఉంచింది. 2025 ఆరంభంలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. కథానాయకుడు మాట్ డామన్ విషయానికొస్తే నోలన్ తో కలిసి అతడు గతంలోను పని చేసాడు. ఇప్పుడు మూడోసారి కూడా కలిసి పని చేస్తున్నారని డెడ్‌లైన్ పేర్కొంది.