టాలీవుడ్- బాలీవుడ్-హాలీవుడ్ స్టార్ల కలయికలో?
సిటాడెల్ హాలీవుడ్ ఫ్రాంఛైజీతో ముడిపడిన `హనీ బన్నీ` ఓటీటీలో నిరూపించాక చాలా సమీకరణాలు మారబోతున్నాయని అంచనా.
బాలీవుడ్ స్టార్లతో టాలీవుడ్ స్టార్ల కలయికలోనే కాదు... హాలీవుడ్ స్టార్లతో టాలీవుడ్ స్టార్ల కలయికలోను సినిమాలు, సిరీస్ లు వస్తున్నాయా? అంటే.. భవిష్యత్ లో అందుకు ఆస్కారం లేకపోలేదు. సిటాడెల్ హాలీవుడ్ ఫ్రాంఛైజీతో ముడిపడిన `హనీ బన్నీ` ఓటీటీలో నిరూపించాక చాలా సమీకరణాలు మారబోతున్నాయని అంచనా.
నిజానికి భారతీయ ప్రతిభ హాలీవుడ్ లో మెరుపులు మెరిపించడం కొత్త దారులకు తెర తీస్తోంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో సాహసోపేతమైన యాక్షన్ అడ్వెంచర్లలో నటించడం చాలా సమీకరణాలను మారుస్తోందని అంగీకరించాలి. యాంజెలినా జోలీ, స్కార్లెట్ జాన్సన్, గాల్ గాడోట్, సాండ్రా బుల్లక్, మిలా జోవిచ్ వంటి హాలీవుడ్ స్టార్లు యాక్షన్ సినిమాలతో అదరగొడితే, ఇప్పుడు భారతదేశం నుంచి ప్రియాంక కోప్రా అలాంటి ప్రతిభతో, యాక్షన్ క్వీన్ గా అలరించడం సిసలైన సంచలనం. ఇప్పుడు ఇదే కేటగిరీలో చేరింది సమంత రూత్ ప్రభు. హాలీవుడ్, బాలీవుడ్ స్టార్లకు ధీటుగా ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ యాక్షన్ సినిమాతో మెప్పించడం అనేది నిజంగా సవాల్ తో కూడుకున్నది.
భారీ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ `సిటాడెల్`లో నటించి ఔరా అనిపించిన పీసీకి ధీటుగా సమంత భారతీయ వెర్షన్ సిటాడెల్ - హనీ బన్నీలో యాక్షన్ సీక్వెన్సుల్లో అలరించింది. సిటాడెల్ కు అవెంజర్స్ ఎండ్ గేమ్ దర్శకులు, రస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించగా, సిటాడెల్ భారతీయ వెర్షన్ కి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. భారతీయ వెర్షన్ కి విమర్శకుల ప్రశంసలు కురిసాయి. ఇందులో వరుణ్ ధావన్ - సమంత నటనకు ప్రశంసలు కురిసాయి. గత కొన్ని రోజులుగా, రెండు సిరీస్‌లను చూసిన ప్రేక్షకులు ఈ రెండు ప్రపంచాలను ఒకే సిరీస్‌లో కలపడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారా! అంటూ ఆరాలు తీస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక చోప్రా సిటాడెల్ యూనివర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేయగా, రెండు సిరీస్‌లలోని పాత్రల నడుమ కనెక్షన్ ఆశ్చర్యపరుస్తోంది. దీనిపై పీసీ ఎమోషనల్ నోట్ రాసారు.
నేను పెళ్లి కాకముందే 2018 ప్రారంభంలో సిటాడెల్ ప్రయాణంలోకి వచ్చాను. చాలా కాలం క్రితం అనిపిస్తుంది! కానీ ఇలాంటి ప్రదర్శనలో అవకాశం దక్కడాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. వాస్తవానికి కథ చెప్పడం ద్వారా ప్రపంచాన్ని ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయడం ఎగ్జయిట్ చేస్తోంది. ఇది చాలా సంతోషకరమైనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన ఫిలింమేకర్స్ గ్లోబల్ కథను స్థానిక పాత్రలతో కనెక్ట్ చేస్తూనే అదే సమయంలో హాలీవుడ్ తో భారతీయ వెర్షన్ ను పరస్పరం అనుసంధానించే కథలను రూపొందించడం చాలా బాగుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన తారాగణం సాంకేతిక నిపుణులతో ఈ ప్రయాణంలో ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞురాలిని.. అని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు. పీసీ ఎగ్జయిట్ మెంట్ చూస్తుంటే `సిటాడెల్` అభిమానులు హాలీవుడ్ తో భారతీయ స్టార్లను అనుసంధానిస్తూ.. అన్ని సిటాడెల్ పాత్రలతో రాబోవు కొత్త సీజన్ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రియాంక చోప్రా- సమంత కలిసి ఒకే సిరీస్ లో కనిపిస్తే చూడాలని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. హనీ బన్నీ ఓటీటీలో గొప్ప ఆదరణ పొందడంతో ఇది సమంత అభిమానులను మరింతగా ఎగ్జయిట్ చేస్తోంది.