హిట్ కాంబినేషన్ క్లాష్.. రికార్డ్ రిపీటయ్యేనా?
మరోసారి 2024 ఆగష్టు 15న రవితేజ, రామ్ పోతినేని మరోసారి బాక్సాఫీస్ ఫైట్ కి రెడీ అయ్యారు.
టాలీవుడ్ లో ఒకే రోజు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. స్టార్స్ నుంచి టైర్ 2 హీరోల వరకు అందరూ ఇలా ఒకే రోజు తమ సినిమాలని రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ పోటీలో ఒక్కోసారి ఒక్కో హీరో విన్నర్ అవుతారు. కొన్నిసార్లు ఇద్దరు హీరోలు సక్సెస్ లు అందుకుంటారు. స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య మధ్య ఇలాంటి పోటీ గతంలో నడిచింది. అలాగే చాలా మంది హీరోల మధ్య ఈ కాంపిటేటివ్ ఫైటింగ్ ఉంటుంది.
మాస్ మహారాజ్ రవితేజ, ఉస్తాద్ రామ్ పోతినేని 2021లో సంక్రాంతి రేసులో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. రామ్ పోతినేని కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన క్రాక్ సినిమా రిలీజ్ చేశారు. వీటిలో రెడ్ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. క్రాక్ సినిమా అయితే రవితేజ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అలా ఇద్దరు పోటీపడి బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ లు అందుకున్నారు.
మరోసారి 2024 ఆగష్టు 15న రవితేజ, రామ్ పోతినేని మరోసారి బాక్సాఫీస్ ఫైట్ కి రెడీ అయ్యారు. రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కింది. రామ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ వస్తోంది. అందుకే దీనిపై హైప్ ఉంది. ఆగష్టు 15న ఈ చిత్రం ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది.
అదే మాస్ మహారాజ్ రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో థియేటర్స్ లోకి రాబోతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. మిరపకాయ్ లాంటి హిట్ తర్వాత హరీష్, రవితేజ కలయికలో వస్తోన్న సినిమా కావడంతో మిస్టర్ బచ్చన్ పై హైప్ ఉంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ ఫైట్ లో ఎవరు విన్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
2021 తరహాలో ఇద్దరు కూడా సక్సెస్ లు అందుకొని మళ్ళీ అప్పటి రికార్డ్ ని రిపీట్ చేసే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ రెండు చిత్రాలపైనా ప్రేక్షకులలో పాజిటివ్ వైబ్ ఉంది. ఇద్దరు హీరోలు వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ఈ చిత్రాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.