సునీల్ అక్కడ దూసుకుపోతున్నాడు
రజినీకాంత్ సినిమాలో స్క్రీన్ టైం బాగానే ఉన్న పాత్రలో మెరవడంతో సునీల్ తమిళ ప్రేక్షకుల్లో బాగానే పాపులారిటీ సంపాదించాడు.
తెలుగులో ఒకప్పుడు సునీల్ టాప్ కమెడియన్. అతడి ధాటికి బ్రహ్మానందం సైతం ఒక టైంలో డౌన్ అయ్యాడు. కొన్నేళ్ల పాటు నంబర్ వన్ కమెడియన్‌గా కొనసాగుతూ కొన్ని గంటలకు కాల్ షీట్ ఇస్తూ.. రోజుకు రెండు మూడు సినిమాల్లో నటిస్తూ తీరిక లేకుండా గడిపాడు సునీల్. డేట్లు సర్దుబాటు చేయలేక 'నువ్వు నేను'తో తనకు కమెడియన్‌గా బ్రేక్ ఇచ్చిన తేజ నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు సునీల్ ఒక దశలో.
కమెడియన్‌గా అంత బిజీగా ఉన్నవాడు.. ఆ తర్వాత హీరోగా మారి కామెడీ వేషాలకు దూరం అయ్యాడు. 'అందాల రాముడు', 'మర్యాదరామన్న', 'పూల రంగడు' చిత్రాలతో హీరోగా ఒక దశ వరకు అతడి కెరీర్ బాగానే సాగింది కానీ.. తర్వాత వరుస ఫ్లాపులు అతణ్ని వెనక్కి లాగేశాయి. ఒక దశలో ఇటు హీరో వేషాలూ సెట్ అవ్వక.. అటు కామెడీకీ పనికి రాక చాలా ఇబ్బంది పడ్డాడు సునీల్. ఐతే కొంచెం గ్యాప్ తర్వాత అతను బాగానే కుదురుకున్నాడు.
కామెడీ, క్యారెక్టర్, విలన్.. ఇలా అన్ని రకాల పాత్రలూ చేస్తూ దూసుకుపోతున్నాడు సునీల్ ఇప్పుడు. తెలుగులోనే కాదు.. అతను తమిళంలోనూ తనదైన ముద్ర వేస్తుండటం విశేషం. సునీల్‌కు పెద్ద పెద్ద సినిమాల్లో కీలక పాత్రలు దక్కుతున్నాయి. ఈ మధ్యే 'జైలర్' సినిమాలో బ్లాస్ట్ మోహన్ అనే పాత్రలో మెరిశాడు సునీల్. తమిళంలో ఈ పాత్ర బాగానే క్లిక్ అయింది.
రజినీకాంత్ సినిమాలో స్క్రీన్ టైం బాగానే ఉన్న పాత్రలో మెరవడంతో సునీల్ తమిళ ప్రేక్షకుల్లో బాగానే పాపులారిటీ సంపాదించాడు. అంతకంటే ముందు అతను శివ కార్తికేయన్ సినిమా 'మావీరన్'లో ఓ కీలక పాత్ర చేశాడు. ఆ పాత్ర బాగానే క్లిక్ అయింది.
లేటెస్ట్‌గా విశాల్ మూవీ 'మార్క్ ఆంటోనీ'లో సునీల్ చేసిన ఏకాంబరం పాత్రకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో విశాల్, ఎస్.జె.సూర్యల తర్వాత ఎక్కువ స్క్ర్రీన్ టైం, ప్రాధాన్యం ఉన్న పాత్ర అతడిదే. తమిళంలో ఈ సినిమా సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. వరుసగా పెద్ద సినిమాల్లో కీలక పాత్రలు చేస్తుండటంతో సునీల్ తమిళంలో బిజీ యాక్టర్ అయిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.