స్టార్ హీరో ఆస్తి వేలం వాయిదా.. కాంగ్రెస్ డౌట్లు ఇవే
రికవరీ వేలంపై బోలెడంత చర్చ సాగుతుండగా ఇప్పుడు ఆకస్మికంగా బ్యాంకు ఇ-వేలాన్ని ఆపేయడంతో కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్ కి చెందిన జుహు ఆస్తి ఇ-వేలాన్ని ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. 55 కోట్ల బ్యాంకు అప్పునకు సంబంధించిన రికవరీ వేలంపై బోలెడంత చర్చ సాగుతుండగా ఇప్పుడు ఆకస్మికంగా బ్యాంకు ఇ-వేలాన్ని ఆపేయడంతో కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బ్యాంక్ ఒక వార్తాపత్రిక ప్రకటనను జారీ చేసింది. మిస్టర్ అజయ్ సింగ్ డియోల్ అలియాస్ మిస్టర్ సన్నీ డియోల్‌కు సంబంధించిన ఆస్తి అమ్మకం నోటీసు సాంకేతిక కారణాల వల్ల ఉపసంహరించుకోవడమైనదని ప్రకటించింది.
నిజానికి సన్నీ డియోల్ ముంబై ఆస్తిని వేలం వేయనున్న బ్యాంక్ రూ. 56 కోట్లకు పైగా రుణం, వేలం కోసం రిజర్వ్ ధర రూ. 51.4 కోట్లు అని బ్యాంక్ ప్రకటనగా సేల్ నోటీసును జారీ చేసింది. ఆస్తిని బ్యాంకు సింబాలిక్ గా స్వాధీనం చేసుకుంది. సెప్టెంబర్ 14న తనిఖీకి అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఆస్తిని ఇ-వేలం వేయడం గురించి ప్రచారం చేసిన ఒక రోజు తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. ఆగస్ట్ 25న జరగనున్న ఈ-వేలం ద్వారా రూ. 56 కోట్లను రికవరీ చేసేందుకు సన్నీకి చెందిన ఆస్తిని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్లాక్ చేసింది.
సన్నీడియోల్ ని డీఫాల్టర్ అని ప్రకటించింది బ్యాంకు. డిసెంబర్ 2022 నుండి ఈ అప్పుపై చెల్లింపులు నిలిచిపోయాయని..బ్యాంక్ పబ్లిక్ టెండర్‌లో పేర్కొంది. ఇప్పుడు ఇ-వేలం ఉపసంహరణ నోటీసు రావడంతో దీనిపై కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది. "బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్‌కు చెల్లించాల్సిన రూ. 56 కోట్లను చెల్లించనందున బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ జుహు నివాసాన్ని ఈ-వేలానికి పెట్టినట్లు నిన్న మధ్యాహ్నం దేశానికి తెలిసింది. 24 గంటలలోపే అంటే నేటి ఉదయానికి 'సాంకేతిక కారణాల' వల్ల బ్యాంక్ ఆఫ్ బరోడా వేలం నోటీసును ఉపసంహరించుకున్నట్లు దేశానికి తెలిసింది" అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అయితే దీనిపై బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఎలాంటి స్పందనా లేదు.
సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ (SARFAESI) చట్టం, 2002 కింద జారీ చేసిన బ్యాంక్ నోటీసులో రుణగ్రహీతగా అజయ్ సింగ్ ధర్మేంద్ర డియోల్ అలియాస్ సన్నీ డియోల్ అతడి సోదరుడు విజయ్ సింగ్ ధర్మేంద్ర డియోల్ అలియాస్ బాబీ డియోల్ ఉన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇ-వేలం నోటీసును ఉపసంహరించుకోవడంతో బిజెపి ఎంపి సన్నీ డియోల్‌కు భారీ ఉపశమనం దక్కిందని ఇప్పుడు పబ్లిక్ లో కామెంట్లు వినిపిస్తున్నాయి. అతడు భాజపా నాయకుడు అయినందునే ఆస్తి వేలాన్ని నిలిపివేశారా? అనేది కాంగ్రెస్ పాయింట్. మరి దీనికి అట్నుంచి సమాధానం రావాల్సి ఉంది.