ఈ మాత్రం తెలివి కాంగ్రెస్‌కు లేదు.. పాపం!!
రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులే కాదు.. ఒకింత బుద్ధికి కూడా పదును పెట్టాలి. సమయానికి అనుకూలంగా వ్యవహరించాలి
రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులే కాదు.. ఒకింత బుద్ధికి కూడా పదును పెట్టాలి. సమయానికి అనుకూలంగా వ్యవహరించాలి. తెలివిని ప్రదర్శించాలి. అప్పుడు ఎవరికీ నెప్పిలేకుండా.. తమ రాజకీయాలు తాము చేసుకునే వెసులు బాటు ఉంటుంది. ఇలాంటి వ్యూహాన్ని ప్రధాని మోడీ తాజాగా అమలు చేశారు. ఎన్నికల పోలింగ్ జరుగుతున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని ఓటర్లను ఉద్దేశించి ఆయన చాలా తెలివిగా ప్రచారం చేశారు.
వాస్తవానికి ఎన్నికల ప్రచారం పోలింగ్‌కు 48 గంటల ముందు ముగిసింది. దీంతో మైకులు మూగబోయాయి. నాయకులు ఎక్కడివారు అక్కడకు జారుకున్నారు. ఇక, ఈ రోజు(శుక్రవారం) ఉదయం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. అయితే.. ఇంతలోనే అన్ని టీవీల్లోనూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 'సందేశం' పేరుతో ప్రసారాలు జోరందుకున్నాయి. వీటిని బీజేపీ నాయకులు సోషల్ మీడియాలోనూ వైరల్ చేశారు.
ఈ సందేశంలో మోడీ.. ఎక్కడా తన పార్టీ పేరును ప్రస్తావించకపోయినా.. ఓటర్లను ప్రభావితం చేసేలా మాత్రం మాట్లాడారనేది నిపుణుల మాట. 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్న మధ్యప్రదేశ్‌లో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో 70 స్థానాలకు జరుగుతున్న రెండో దశ పోలింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని.. అందరూ తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశ పోలింగ్ 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. మధ్యప్రదేశ్ లో ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. ఈ కీలక సమయంలో నాయకులు ఎవరూ టీవీ స్క్రీన్‌లపై కనిపించి ప్రచారం చేసేందుకు వీలు లేదని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయి. కానీ, ప్రధాని హోదాలో.. సామాజిక బాధ్యత చాటున ప్రధాని మోడీ సందేశం పేరుతో ప్రచారానికి దిగారనేది విమర్శకుల మాట. ఈ మాత్రం తెలివి.. కాంగ్రెస్‌కు లేకుండా పోయిందనేది వారి వ్యాఖ్య.