బంగారం వ్యాపారంలో మోసం.. స్టార్ హీరోయిన్‌పై విచార‌ణ‌

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కుంద్రా ఆమె భర్త రాజ్ కుంద్రా మరోసారి రాంగ్ రీజ‌న్‌తో వార్తల్లోకి వచ్చారు.

Update: 2024-06-14 03:43 GMT

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కుంద్రా ఆమె భర్త రాజ్ కుంద్రా మరోసారి రాంగ్ రీజ‌న్‌తో వార్తల్లోకి వచ్చారు. ఈ జంట చీటింగ్ చేసార‌ని కోర్టు నిర్ధారించింది. శిల్పా, రాజ్‌కుంద్రాల చీటింగ్‌పై విచారణ జరపాలని ముంబై సెషన్స్ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ జంట త‌న‌ను మోసం చేశారని కొఠారి అనే క‌స్ట‌మ‌ర్ కం వ్యాపారి ఆరోపించారు. దీంతో వారిద్దరిపై విచారణకు కోర్టు ఆదేశించింది. కోర్టులో దాఖలు చేసిన మోసం కేసు ప్రాథమికంగా గుర్తించదగిన నేరంగా పరిగణించిన‌ కోర్టు పై ఆదేశాలిచ్చింది.

శిల్పా శెట్టి - కుంద్రాల‌పై బులియన్ వ్యాపారి పృథ్వీరాజ్ సరేమల్ కొఠారీ పిటిష‌న్‌లోని ఆరోపణలపై దర్యాప్తు చేయాలని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)ని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్‌పీ మెహతా ఆదేశించారు. ఇది మాత్ర‌మే కాకుండా విచారణ తర్వాత ఆరోపణ సరైనదని రుజువైతే పోలీసులు ఈ కేసులో ఐపిసిలోని అవసరమైన అన్ని సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, శిల్పాశెట్టి ఆమె భర్తపై సరైన విచారణ జరపాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. నిందితులు ఏదైనా నేరానికి పాల్పడినట్లయితే ఇద్దరిపైనా పోలీసులు అవసరమైన చర్యలు తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది. శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వ్యవస్థాపకులని, కొఠారి తరపున కోర్టుకు హాజరైన న్యాయవాది కోర్టుకు వెల్ల‌డించారు. ఆయ‌న‌ మాట్లాడుతూ 2014లో ఈ జంట బంగారం అమ్మ‌కాల‌కు సంబంధించి ఒక పథకం ప్రారంభించారు. దీని కింద పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తులు బంగారానికి దరఖాస్తు చేస్తున్నప్పుడు ఏ ధ‌ర ఉందో.. పూర్తి చెల్లింపు చేసే మెచ్యూరిటీ తేదీలో అతనికి నిర్ణీత మొత్తంలో బంగారం మొద‌టి ధ‌ర‌కే ఇవ్వాల‌న్న‌ది స్కీమ్. కానీ ఇందులో మోసం జ‌రిగింద‌నేది కొఠారి పిటిష‌న్‌లో ఆరోప‌ణ‌.

బంగారం వ్యాపారితో డీల్ ఏంటి?

బాధిత బులియన్ వ్యాపారి తరపు న్యాయవాదులు మాట్లాడుతూ.. ఈ పథకం ప్ర‌కారం.. బంగారం సంబంధిత వ్య‌క్తికి డైరెక్ట్‌గా అందజేస్తామని, ఆ సమయంలో మార్కెట్‌లో ఎంత ధర ఉన్నా ఒప్పందం ప్ర‌కారం తీసుకున్న‌ త‌గ్గింపు ధ‌ర‌తోనే దానిని క‌స్ట‌మ‌ర్‌కి అందిస్తామ‌ని శెట్టి- కుంద్రా హామీలో స్పష్టం చేశారు. ఈ పథకానికి సంబంధించిన‌ ప‌త్రం హామీ ఉంది. శిల్పాశెట్టి- రాజ్‌ కుంద్రాల‌ను కొఠారీ క‌లిసారు. ఒప్పందం కుదుర్చుకున్నారు. సకాలంలో క‌స్ట‌మ‌ర్ కొఠారీకి బంగారం అందజేస్తామని స‌ద‌రు జంట‌ హామీ ఇచ్చారని పిటిష‌న్ లో ఆరోపించారు. ఆ ఇద్దరి హామీ మేరకు కొఠారి పథకంలో 90 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఈ ప‌థ‌కంలో భాగంగా అతడికి 2 ఏప్రిల్ 2019న 5 సంవత్సరాలు నిండిన తర్వాత 5000 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని ఇస్తామ‌ని వాగ్దానం చేశారు. మెచూరిటీ తేదీ నాటికి మార్కెట్ ధరతో సంబంధం లేకుండా అతడికి బంగారం అందుబాటులో ఉంచుతామ‌ని వారు అతడికి హామీ ఇచ్చారు.

అయితే ఐదు సంవత్సరాలు పూర్తయినా కానీ శిల్పాశెట్టి - రాజ్ కుంద్రా కంపెనీ వారి వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కొఠారీ వారి కంపెనీ నుండి బంగారం పొందలేదు. ప్ర‌స్తుతం కోర్టు ఈ కేసును విచారిస్తోంది. పోలీసుల‌కు ఆదేశాలిచ్చింది. నిజానికి శిల్పాశెట్టి - రాజ్ కుంద్రా వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా జంట‌ ప‌లు వివాదాల్లో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News