సైమా అవార్డ్స్-2024: 'దసరా'కి అత్యధిక నామినేషన్స్!
సౌత్ లోని నాలుగు భాషల్లో ప్రతీ ఏడాది అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేసి ఈ అవార్డులను ప్రధానం చేస్తుంటారు.
దక్షిణ భారతదేశంలో 'సైమా అవార్డ్స్' (SIIMA - సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) ను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. సౌత్ లోని నాలుగు భాషల్లో ప్రతీ ఏడాది అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేసి ఈ అవార్డులను ప్రధానం చేస్తుంటారు. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా గ్రాండ్ గా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి కూడా దుబాయ్ వేదికగా ఈ వేడుక జరగనుంది. సెప్టెంబర్ 14, 15 తేదీలలో సైమా-2024 అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా అత్యధిక నామినేషన్లు పొందిన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలను వెల్లడించారు.
12వ సైమా అవార్డ్స్ లో తెలుగు నుంచి 'దసరా' సినిమాకి ఎక్కువ నామినేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సహా మొత్తం 11 నామినేషన్లు పొందింది. ఇక తమిళ్ లో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' మూవీ 11 విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. మలయాళంలో టోవినో థామస్, కుంచాకో బోబన్ ప్రధాన పాత్రల్లో నటించిన '2018' మూవీ.. కన్నడలో దర్శన్ చేసిన 'కాటేరా' చిత్రాలు 8 కేటగిరీలలో నామినేషన్స్ దక్కించుకున్నాయి.
నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'దసరా' సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ రూరల్ పీరియడ్ యాక్షన్ డ్రామాని తెరకెక్కించగా.. చెరుకూరి సుధాకర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో ఈ రా అండ్ రస్టిక్ మూవీ రూపొందింది. ఇందులో నాని మునుపెన్నడూ లేని విధంగా ఊర మాస్ రోల్ లో నటించి ఆకట్టుకున్నారు. కీర్తి, దీక్షిత్ శెట్టిలు తమ పాత్రల్లో అలరించారు. సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. అందుకే ఇప్పుడు ఈ సినిమా 'సైమా అవార్డ్స్ 2024' లో 11 విభాగాల్లో నామినేషన్స్ దక్కినట్లు తెలుస్తోంది. మరి వీటిల్లో ఎన్ని అవార్డులు గెలుచుకుంటుందో చూడాలి.
సైమా విషయానికొస్తే, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ నిర్మాత ఇందూరి విష్ణువర్ధన్ 2012లో ఈ అవార్డ్స్ ను స్థాపించారు. అడుసుమిల్లి బృందా ప్రసాద్ దీనికి చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతి సంవత్సరం తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో అత్యుత్తమ సినిమాలని గుర్తించి, వివిధ విభాగాలలో ఉత్తమ నటీనటులు సాంకేతిక నిపుణులకు అవార్డులు అందిస్తున్నారు. వీటిని ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా జ్యూరీ సభ్యులు విజేతలను నిర్ణయిస్తున్నారు.
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఎక్కువ శాతం విదేశాల్లోనే జరుగుతుంది. కోవిడ్ పాండమిక్ టైములో మాత్రం హైదరాబాద్, బెంగుళూరు వేదికగా ఈవెంట్ నిర్వహించారు. సెప్టెంబర్ రెండో వారంలో జరగనున్న 12వ ఎడిషన్ కు దుబాయ్ వేదిక కాబోతోంది. సైమా అవార్డ్స్-2024 కార్యక్రమానికి నెక్సా స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. త్వరలోనే అన్ని కేటగిరీలలో నామినేషన్స్ ప్రకటించి, ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు.