డీప్‌ఫేక్‌.. ఎవరినీ వదిలిపెట్టడం లేదు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సినీ రాజకీయ ప్రముఖులకు సంబంధించిన ఫేక్‌ వీడియోలు తయారు చేసి, వాటిని ఇంటర్నెట్ లో వైరల్‌ చేయటం పెద్ద తలనొప్పిగా మారిపోతోంది.

Update: 2024-03-13 07:04 GMT

టెక్నాలజీ వల్ల ఎంత ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో, అన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి. మంచి కోసం ఉపయోగించినంత వరకూ ఎలాంటి ఇబ్బందీ లేదు కానీ, చెడు కోసం వాడితేనే సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇప్పుడు 'డీప్‌ ఫేక్‌' టెక్నాలజీ సెలెబ్రీటీలకు శాపంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సినీ రాజకీయ ప్రముఖులకు సంబంధించిన ఫేక్‌ వీడియోలు తయారు చేసి, వాటిని ఇంటర్నెట్ లో వైరల్‌ చేయటం పెద్ద తలనొప్పిగా మారిపోతోంది.

ఇటీవల కాలంలో అనేకమంది సినిమా హీరోయిన్లు, మహిళా రాజకీయవేత్తలు, మహిళా క్రీడాకారులకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. రష్మిక మందన్న, కాజోల్‌, అలియా భట్, కత్రినా కైఫ్ లతో పాటు మరికొందరు హీరోయిన్లు కూడా డీప్‌ఫేక్ బారినపడ్డారు. AI టెక్నాలజీతో ఇతరుల బాడీలకు వీరి ముఖాలు తగిలించి, అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మరోసారి డీప్‌ ఫేక్‌ బారిన పడింది.

రష్మికకు సంబంధించిన ఓ డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అందులో రష్మిక ఎక్స్పోజింగ్ చేస్తూ డ్యాన్స్‌ చేస్తోంది. ఇది గతంలో కన్నా చాలా అసభ్యకరమైన రీతిలో ఉంది. గాగ్రాలో అందాలు ఆరబోస్తున్న ఓ యువతి ముఖానికి రష్మిక ఫేస్ ను జత చేసి ఈ వీడియో ఎడిట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇది చూసిన ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. ఇలాంటి ఫేక్‌ వీడియోలు సృష్టించొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నిజానికి ఇంతకముందు రష్మిక మంధన్న ఫేక్‌ వీడియో వైరల్‌ అయినప్పుడు, డీప్‌ఫేక్‌ పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఈ విషయంలో సినీ, రాజకీయ ప్రముఖులు ఆందోళనలు వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి టాలీవుడ్ హీరోలు అక్కినేని నాగచైతన్య, విజయ్ దేవరకొండ వరకూ చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. ఫేక్ వీడియోలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ నేపథ్యంలో డీప్ ఫేక్ వీడియోల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌ గా తీసుకుంది. మార్ఫింగ్ వీడియోలకు సంబంధించిన నిబంధనలను గుర్తు చేస్తూ, ఫేక్‌ వీడియోలు క్రియేట్‌ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. డీప్‌ ఫేక్‌ వీడియోల క్రియేషన్‌, సర్క్యులేషన్‌కు సంబంధించిన పెనాల్టీలు, నిబంధనలు గుర్తు చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ మంత్రిత్వ శాఖ సోషల్‌ మీడియా సంస్థలకు అడ్వయిజరీని పంపించింది. ఈ క్రమంలో రష్మిక ఫేక్ వీడియో చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయినా సరే డీప్ ఫేక్ కు బ్రేక్స్ కు పడటం లేదు. సరికొత్త టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ, సెలబ్రెటీల ఫేక్‌ వీడియోలు చేస్తూనే ఉన్నారు. సినిమా వాళ్ళ దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకూ.. ఎవరినీ డీప్ ఫేక్ వదిలిపెట్టడం లేదు. రోజూ ఎవరో ఒకరి ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలలో దర్శనమిస్తూనే ఉంది. సాంకేతిక సాయంతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురి చేసే వారికి అడ్డుకట్ట వేయడానికి, రానున్న రోజుల్లో ఇలాంటివి జరగకుండా చూడటానికి ప్రభుత్వం ఏమైనా కటిన చర్యలు తీసుకుంటుందేమో చూడాలి.

Tags:    

Similar News