దిల్జీత్ దోసాంజ్ కాన్సెర్ట్‌లో కల్కి నటి సందడి
ప్రముఖ గాయకుడు దిల్జీత్ దోసాంజ్ సంగీత కచేరీలో తారా తోరణం సందడి ప్రముఖంగా చర్చకు వస్తోంది.
ప్రముఖ గాయకుడు దిల్జీత్ దోసాంజ్ సంగీత కచేరీలో తారా తోరణం సందడి ప్రముఖంగా చర్చకు వస్తోంది. దిల్జిత్ దోసాంజ్ ఎనర్జిటిక్ కచేరీలు ఎల్లపుడూ పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. అతను భారతదేశంలోని ప్రముఖ పాప్ సంచలనాలలో ఒకడు. దోసాంజ్ షోలకు అగ్రశ్రేణి ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. తాజాగా ఈ జాబితాలో దీపికా పదుకొణె కూడా చేరింది.
దీపికా పదుకొణె దిల్జిత్ దోసాంజ్ సంగీత కచేరీని ఆస్వాధిస్తున్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారాయి. తన స్వస్థలమైన బెంగళూరులో దిల్జిత్ దోసాంజ్ కచేరీని ఆస్వాధిస్తూ కనిపించింది. డీపీ అక్కడ డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఒక వీడియో క్లిప్‌లో వేదికపై దిల్జిత్‌ను దీపిక కౌగిలించుకోవడం అభిమానులను ఆనందపరిచింది. వేదిక వద్ద అభిమానులు ఆమెను తిరిగి చూసి థ్రిల్ అయ్యారు.
దీపికా పదుకొణె ఇటీవల పండంటి ఆడబిడ్డను కన్న సంగతి తెలిసిందే. తన బిడ్డ పుట్టినప్పటి నుండి దీపిక బహిరంగంగా కనిపించడం లేదు. పూర్తిగా ప్రైవసీని ఆస్వాధిస్తోంది. అభిమానులు దీపిక అప్ డేట్లు, ఫోటోషూట్ల గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ రేర్ గా మాత్రమే వాటిని షేర్ చేస్తోంది.
దీపిక ప్రస్తుతం నటనకు బ్రేక్ ఇచ్చింది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఎప్పుడు సినిమాల్లోకి రానుంది? అనేది తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తన కిడ్ ఎదిగే వయసు గనుక కొంతకాలం వేచి చూశాక మాత్రమే నటిగా రీఎంట్రీ ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే దీపిక స్వయంగా దీనిపై స్పందించాల్సి ఉంటుంది. ప్రభాస్ తో కల్కి 2898 ఏడిలో కూడా నటించాల్సి ఉంది.