ఆడియో రైట్స్‌లో దేవర నం.2
హై-ఎండ్ యాక్షన్ డ్రామాగా పేరొందిన ఈ పాన్-ఇండియా చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అతడు నటిస్తున్న తాజా చిత్రం `దేవర` కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హై-ఎండ్ యాక్షన్ డ్రామాగా పేరొందిన ఈ పాన్-ఇండియా చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ కథానాయికగా పరిచయం అవుతోంది.
ఈ సినిమాకి పాన్ ఇండియా స్థాయిలో బజ్ నెలకొందని కథనాలొస్తున్నాయి. ఇంతకుముందు ఈ సినిమా డిజిటల్ రైట్స్ డీల్ భారీ ధరకు క్లోజ్ అయినట్లు వార్తలు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులను దాదాపు 150 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆడియో రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయినట్లు వార్తలు వస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీ ఆడియోపై భారీ అంచనాలున్నాయి. పాపులర్ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఆడియో హక్కులు 27 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలిసింది. ఇది ఇటీవలి కాలంలో తెలుగు చిత్రానికి అత్యధికం.
`పుష్ప: ది రూల్` తర్వాత ఆడియో హక్కుల్లో దేవర రెండవ స్థానంలో ఉంది. పుష్ప 1 మ్యూజిక్ ఆల్బమ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన క్రమంలో సంగీత హక్కులు రూ. 45 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పుడు పుష్ప 2 కోసం భారీ మొత్తాలను కోట్ చేసేందుకు ఆస్కారం ఉందని తెలిసింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించి రిలీజ్ కి తేనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత తారక్ కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ తో భారీ పాన్ ఇండియా సినిమాలో నటించనున్నారు.