'గేమ్ ఛేంజర్' ఫ్యాన్స్ మృతి పై దిల్ రాజు వివరణ.. పవన్ ఆర్థిక సాయం
రామ్ చరణ్ తో పాటు సినిమా యూనిట్ సభ్యులు కూడా అదే కోరుకున్నారు. కానీ ఇలాంటి విషాదం చోటు చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు.
రాజమహేంద్రవరం 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణంలో ఉన్న ఆరవ మణికంఠ (23) మరియు తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కాకినాడ జిల్లాకు చెందిన వీరు సాయంత్రం జరిగిన ఈవెంట్‌లో పాల్గొని రాత్రి ఇళ్లకు వెళుతుండగా, దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం అందరినీ కలచివేసింది.
ఈవెంట్ సమయంలో అప్పటికే పవన్ కళ్యాణ్ అందరూ క్షేమంగా వెళ్లాలని కోరారు. రామ్ చరణ్ తో పాటు సినిమా యూనిట్ సభ్యులు కూడా అదే కోరుకున్నారు. కానీ ఇలాంటి విషాదం చోటు చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న నిర్మాత దిల్ రాజు తక్షణమే స్పందించారు. "ఈ ఈవెంట్ మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది, కానీ తిరుగు ప్రయాణంలో జరిగిన ఈ దుర్ఘటన మా హృదయాలను కలిచివేసింది. వారి కుటుంబాలకు మేము అండగా ఉంటాం" అని అన్నారు.
బాధితుల కుటుంబాలకు చెరో రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. "ఇలాంటి ఘటనలు జరిగి కుటుంబాలకు కలిగే నష్టం ఎవ్వరూ భర్తీ చేయలేరు" అని అన్నారు. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ వేడుకకు హాజరైన తరువాత తమ ఇళ్లకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
ఈ ప్రమాదానికి ఏడీబీ రోడ్డుపై ఉన్న దుర్భర పరిస్థితులే ప్రధాన కారణమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఈ రహదారి పునర్నిర్మాణం మరియు మరమ్మతులపై ఏమాత్రం దృష్టి పెట్టలేదని ఆయన విమర్శించారు. కనీస స్థాయి నిర్వహణ కూడా లేని ఈ రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోందని, పాతికేళ్లుగా ఈ రోడ్డు పాడుబడిపోయిన పరిస్థితుల్లో ఉందని చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్, బాధిత కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు.
అలాగే, ప్రభుత్వం నుంచి కూడా బాధితులకు తగిన పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఘటనను తక్షణమే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని రహదారి పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. అయిదు నియోజకవర్గాల ప్రజలు ఈ రహదారిని ప్రధాన మార్గంగా ఉపయోగిస్తుండటంతో, మరింత జాగ్రత్తగా రహదారి పనులు చేపట్టాలని సూచించారు. తాను ఇకపై ఏడీబీ రోడ్డును పర్యటనల కోసం తప్పనిసరిగా ఉపయోగిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు.