దిల్ రాజు సంక్రాంతి రిస్క్.. క్లిక్కయితే లాభమే

దీంతో ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వలేదట. సినిమా రిలీజ్ అయ్యాక డిజిటల్ హక్కులను దిల్ రాజు విక్రయించనున్నారని వినికిడి.

Update: 2024-09-22 15:30 GMT

సంక్రాంతి సీజన్ కు థియేటర్లలో తమ సినిమాలు రిలీజ్ చేయాలని మేకర్స్ ఎప్పుడూ భావిస్తుంటారు. అందుకోసం కొందరు ముందుగా డేట్ ఫిక్స్ చేసుకుంటారు. మరికొందరు పండగ దగ్గరలో ప్రకటిస్తారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుంచే పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. పలు స్టార్ హీరోల సినిమాలు.. పెద్ద పండుగ రిలీజ్ కు ఇప్పటికే కర్చీఫ్ లు వేశాయి. ఎలాగైనా సంక్రాంతికి సందడి చేయాలని చకచకా పనులు పూర్తి చేసుకుంటున్నాయి.

వాటిలో ఫస్ట్ వన్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ.. అందరి కన్నా ముందు సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. త్వరలో షూటింగ్ పూర్తి కానుంది. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తన NBK 109ను అప్పుడే రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. అదే సమయంలో విక్టరీ వెంకటేష్.. పొంగల్ స్పెషల్ గా సందడి చేసేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అనిల్ రావిపూడి శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు.

వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. వెంకీ, అనిల్ ప్రాజెక్టుకు 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పొంగల్ కు సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే పలుమార్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూవీ ఓటీటీ డీల్ ను కంప్లీట్ చేయాలని రీసెంట్ గా దిల్ రాజు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీలు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోను ఆయన సంప్రదించారట.

కానీ సినిమాను సమ్మర్ కు పోస్ట్ పోన్ చేయాలని.. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ నిర్వాహకులు ఒత్తిడి తీసుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్లుగా స్ట్రీమింగ్ చార్ట్ ఆధారంగా కొనుగోలు చేస్తున్న ఓటీటీల నిర్వాహకులు.. వెంకీ, అనిల్ మూవీని వేసవి కానుకగా రిలీజ్ చేయాలని సూచించారట. కానీ దిల్ రాజు అందుకు ఓకే చెప్పలేదని సమాచారం. తన ప్లాన్ ప్రకారమే.. సంక్రాంతికి వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తానని స్పష్టం చేశారని టాక్ వినిపిస్తోంది.

దీంతో ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వలేదట. సినిమా రిలీజ్ అయ్యాక డిజిటల్ హక్కులను దిల్ రాజు విక్రయించనున్నారని వినికిడి. అయితే దిల్ రాజు రిస్క్ తో కూడుకున్న నిర్ణయం తీసుకున్నారని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. అదే సమయంలో మూవీ హిట్ అయితే.. పెద్ద డీల్ కుదురుతుందని మరికొందరు అంటున్నారు. తన సినిమాపై నమ్మకంతోనే దిల్ రాజు.. సంక్రాంతికే రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి సంక్రాంతికి విడుదల అవ్వనున్న ఆ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో? ఎలాంటి డీల్ కుదుర్చుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News