ఫిలించాంబర్ కొత్త అధ్యక్షుడి ముందు పెను సవాళ్లు
ఎన్నికల ముందు ప్రామిస్ చేసిన రాజు గారు..ఎన్నికల తర్వాత మర్చిపోరు కదా!
ప్రతిష్ఠాత్మక తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలు ముగిసాయి. కొత్త అధ్యక్షుడిగా నిర్మాత దిల్ రాజు ఎన్నికయ్యారు. ఆయన ప్యానెల్ ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించగా ప్రస్తుతం 2023-25 సీజన్ కి కొత్త కార్యవర్గం బాధ్యతలు చేపట్టనుంది. అయితే సినీపరిశ్రమలో పోగుబడి ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు రాజు గారు ఎలాంటి ప్రాక్టికల్ స్టెప్ తీసుకోనున్నారో అంటూ నాలుగు సెక్టార్లు సహా ఇతర శాఖల్లోను విస్త్రతంగా చర్చ సాగుతోంది.
ఎన్నికల ముందు ప్రామిస్ చేసిన రాజు గారు..ఎన్నికల తర్వాత మర్చిపోరు కదా! యాక్టివ్ గిల్డ్ అధినేతగా బిజీ నిర్మాతగా ఆయన షెడ్యూల్స్ పాలన కు ఎంతవరకూ సహకరిస్తాయి? అంటూ ఒక సెక్షన్ ప్రశ్నను రైజ్ చేసింది. అయితే తాను ఎన్నికల్లో నెగ్గితే పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని .. ప్రస్తుతం తెలుగు సినిమా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిందని దీని ని మరో స్థాయికి చేరుస్తానని దిల్ రాజు శపథం చేసారు. చిన్న సినిమాల కు తనవంతు సహకారం అందిస్తానని కూడా అన్నారు.
అయితే పరిశ్రమలో ఇవి మాత్రమే సమస్యలు కాదు. ఇంకా ఎన్నో సమస్యలున్నాయి. పంపిణీరంగంతో పాటు ఎగ్జిబిషన్ రంగం లో బోలెడన్ని చికాకులు ఉన్నాయి. చిన్న నిర్మాతల కు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఉన్నాయి. మరోవైపు ఫెడరేషన్ - కార్మికుల భత్యాల కు సంబంధించిన కొంత పరిష్కారం గతం లో లభించినా కానీ.. ఇప్పటికీ కార్మికుల్లో ఆందోళనలు అలానే ఉన్నాయి. స్టార్ల పారితోషికాలు- బడ్జెట్ల పెరుగుదల సహా చాలా విషయాల్లో చిక్కులున్నాయి. అలాగే 'నిర్మాతల పేదరికం- సంక్షేమం- సొంత ఇల్లు' అన్న టాపిక్ కూడా చాలా కాలంగా నలుగుతోంది.
ఇక డిస్ట్రిబ్యూటర్లకు ప్రభుత్వంతో సమస్య ఉందని ప్రచారం ఉంది. టికెట్ రేట్లు సహా సినీపరిశ్రమ మూకుమ్మడి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించే చొరవను కూడా ఫిలించాంబర్ అధ్యక్షుడు తీసుకోవాల్సి ఉంటుంది. మరి వీటన్నిటికీ కొత్త అధ్యక్షుడు దిల్ రాజు ఎలాంటి ప్రణాళికను కలిగి ఉన్నారు? అన్నది వేచి చూడాలి.
పరిశ్రమకు ఆయువు పట్టు లాంటి ఫిలించాంబర్ నే గుప్పిట పట్టారు. ఇక పై దిల్ రాజు ఏం చేసినా చెల్లుతుంది.. పరిశ్రమలో ఆయన హవా పరిపూర్ణంగా కొనసాగుతుంది.. అంటూ కొన్ని వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు నిర్మాతల మండలి వేరు.. నిర్మాతల గిల్డ్ వేరుగా ఉన్నాయి. అయినా నిర్మాతల మధ్య సయోధ్యను కుదర్చడం వివాదాలు లేకుండా పరిష్కరించడం తప్పనిసరి.
తదుపరి రాజకీయాల్లో ఎంపీ గాను పోటీ చేసినా (ఆయనే అన్నారు కదా) ఆశ్చర్యపోనవసరం లేదు..! అంటూ ఈ సందర్భంలో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సినీపరిశ్రమ లో అన్ని సవాళ్లను ఎదుర్కొని చివరికి పరిష్కారాలు చూపించాల్సి ఉంటుంది. ఇండస్ట్రీకి సేవ చేస్తూనే రాజు గారు రాజకీయాల్లోకి వెళతారనే పలువురు ఊహిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన తన విక్టరీని ఆస్వాధిస్తున్నారు.