'నిరీక్షణ' దర్శకుడు ప్రసాద్ ఇకలేరు
సినీ దర్శకుడు ఎన్ ఎస్ ఆర్ ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణవార్త కుటుంబ సభ్యులు ఇండస్ట్రీ వర్గాల వారు నిర్థారించారు
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఒక్కొక్కరు మృతి చెందుతూ ఉంటే ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకుంటున్నాయి. ఒక మరణ వార్త నుండి తేరుకోక ముందే మరో మరణ వార్త వినాల్సి వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు సినీ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సినీ దర్శకుడు ఎన్ ఎస్ ఆర్ ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణవార్త కుటుంబ సభ్యులు ఇండస్ట్రీ వర్గాల వారు నిర్థారించారు. 49 ఏళ్ల వయసులో దర్శకుడు ప్రసాద్ మృతి చెందడం పట్ల ఆయన తో వర్క్ చేసిన సినీ నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
డి రామానాయుడు నిర్మాణంలో వచ్చిన నిరీక్షణ సినిమా తో ఎన్ ఎస్ ఆర్ ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా లో ఆర్యన్ రాజేష్ హీరోగా నటించాడు. ఇండస్ట్రీలో చాలా మంది ఈయన్ను సీతారామ్ అంటూ పిలిచే వారు. గతంలో చాలా సినిమాలకు అసోసియేట్ గా కూడా ఈయన వ్యవహరించాడు.
శ్రీకాంత్ తో శత్రువు సినిమాను, నవదీప్ తో నటుడు సినిమాలను రూపొందించాడు. ఆయన దర్శకత్వంలో రూపొందిన రెక్కీ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. చాలా సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన ప్రసాద్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం. ప్రసాద్ అకాల మరణానికి కారణం ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు.