అంతా పూర్తి 'సంక్రాంతికి వస్తున్నాం'

ఈ సినిమాను నిర్మిస్తున్న దిల్‌ రాజు విడుదల విషయంలో మొదట కాస్త వెనుక ముందు ఆడడం జరిగిందట.

Update: 2024-11-18 05:51 GMT

వెంకటేష్‌ హీరోగా ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం అరకులో జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కానున్నట్లు సమాచారం అందుతోంది. మరో వైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో ఇంత ఫాస్ట్‌గా ఒక స్టార్‌ హీరో సినిమా పూర్తి కావడం ఇదే ప్రధమం అంటూ సినీ వర్గాల వారు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాను నిర్మిస్తున్న దిల్‌ రాజు విడుదల విషయంలో మొదట కాస్త వెనుక ముందు ఆడడం జరిగిందట. దిల్ రాజు బ్యానర్‌లోనే రూపొందుతున్న గేమ్‌ ఛేంజర్‌ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు, రెండు సినిమాలకు థియేటర్లను సర్దుబాటు చేయడం కష్టం అవుతుందనే ఉద్దేశ్యంతో వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాను కాస్త ఆలస్యంగా విడుదల చేయాలని భావించాడట. కానీ దర్శకుడు అనిల్‌ రావిపూడి మాత్రం టైటిల్‌ కి తగ్గట్లుగా సంక్రాంతికి వస్తేనే బాగుంటుంది అంటూ పట్టుబట్టి మరీ దిల్ రాజును ఒప్పించాడనే వార్తలు వస్తున్నాయి.

దిల్‌ రాజు అయిష్టంగానే సంక్రాంతికి వస్తున్నాం సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి ఓకే చెప్పాడట. అనిల్ రావిపూడి సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. వెంకటేష్ కి కమర్షియల్‌ హిట్ పడి చాలా కాలం అయింది. గత సంక్రాంతికి సైంధవ్‌ సినిమాతో వచ్చిన వెంకటేష్ డిజాస్టర్‌ను చవిచూశారు. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే సినిమాను అనిల్‌ రావిపూడి ఒక మంచి వినోదాత్మక సినిమాగా రూపొందించడం జరుగుతుందట. అనిల్ రావిపూడి కెరీర్ ఆరంభం నుంచి ప్రతి సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్న విషయం తెల్సిందే.

అనిల్ రావిపూడి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ అరకులో చేస్తూనే మరో వైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను సైతం మానిటరింగ్‌ చేస్తున్నారట. రీ రికార్డింగ్‌ సైతం మొదలు అయింది. త్వరలో షూటింగ్‌ను ముగించి వెంకటేష్‌, ఐశ్వర్య రాజేష్‌ పాత్రలకు డబ్బింగ్‌ చెప్పిస్తే సినిమా రెడీ అయినట్లే. డిసెంబర్‌ రెండో వారం లేదా మూడో వారంకు సినిమా మొదటి కాపీ ని రెడీ చేసి ప్రమోషన్స్‌ కి వెళ్లాలి అని దర్శకుడు అనిల్‌ రావిపూడి భావిస్తున్నాడు. చాలా విభిన్నమైన ప్రమోషన్స్‌ చేయడం ద్వారా జనాల్లోకి సినిమాను తీసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం రమణ గోకులతో పాట పాడించడం వల్ల ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. వంద కోట్లకు పైగా ఈ సినిమా రాబడుతుంది అనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News