ఆ ‘కళాఖండం’ సృష్టికర్త ఆలీనే
ఇండిపెండెన్స్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య రిలీజైన చిత్రాల్లో డబుల్ ఇస్మార్ట్ ఒకటి.
ఇండిపెండెన్స్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య రిలీజైన చిత్రాల్లో డబుల్ ఇస్మార్ట్ ఒకటి. ఐదేళ్ల కిందట సూపర్ హిట్ అయిన ‘ఇస్మార్ట్ శంకర్’కు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రం అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది. సినిమాలో కొన్ని మెరుపులున్నాయి. మాస్ ప్రేక్షకులను అలరించే ఎపిసోడ్స్ కొన్ని పడ్డాయి. రామ్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్.. పాటల వరకు ఓకే అనిపించింది.
కానీ కథ అనుకున్నంత రసవత్తరంగా లేకపోవడం, హై మూమెంట్స్ కనిపించకపోవడం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’తో పోలిస్తే ఈ సినిమాకు ఆకర్షణ పెంచడానికి దర్శకుడు పూరి జగన్నాథ్ కొన్ని ఆకర్షణలు జోడించాడు. సినిమా స్థాయి పెంచాలని చూశాడు. అందులో భాగంగానే విలన్ పాత్రకు బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్‌ను తీసుకున్నాడు. అలాగే ఆలీతో కామెడీ ట్రాక్ చేయించాడు. కానీ ఈ అడిషన్స్ పెద్దగా ఫలితాన్నివ్వలేదు. విలన్ పాత్ర సాధారణంగా అనిపించింది. ఇక ఆలీ ట్రాక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఒకప్పుడు పూరి సినిమాల్లో కథతో సంబంధం లేకుండా సెపరేట్‌గా ఆలీతో కామెడీ ట్రాక్స్ ఉండేవి. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, దేశముదురు, చిరుత.. లాంటి చిత్రాలకు ఆలీ కామెడీ ట్రాక్ ఎంత ప్లస్ అయిందో తెలిసిందే. ఐతే వాటిలో కొన్ని పాత్రల్లో బూతు టచ్ ఉండేది. డబుల్ మీనింగ్ డైలాగులు, హావభావాలతో ఆలీ మాస్‌ను ఎట్రాక్ట్ చేయడానికి ట్రై చేసేవాడు. ఐతే ‘డబుల్ ఇస్మార్ట్’కు వచ్చేసరికి బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు శ్రుతిమించిపోయి ఈ కామెడీ ట్రాక్ జుగుప్సాకరంగా తయారైంది.
అమేజాన్ అడవుల నుంచి వచ్చిన అడివి మనిషి బోకా పాత్రలో ఆలీ చేష్టలు.. హావభావాలు.. డైలాగుల గురించి ఇక్కడ రాయలేని స్థాయిలో చీప్‌గా తయారయ్యాయి. ఆలీ కామెడీలో బూతు టచ్ ఉండడం కొత్త కాదు కానీ.. ఇందులోని కామెడీ ట్రాక్ మాత్రం ప్రేక్షకులు చీదరించుకునే స్థాయిలో ఉంది. సంబంధిత క్లిప్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సక్సెస్ కోసం ఇమరీ ఇంత దిగజారాాలా అని పూరిని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఐతే వాస్తవం ఏంటంటే.. ఈ పాత్రను సృష్టించింది ఆలీయేనట. స్వయంగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆలీనే వెల్లడించడం గమనార్హం. ఈ సన్నివేశాలను కూడా ఆలీనే డైరెక్ట్ చేశాడని కూడా చెప్పుకుంటున్నారు.