ఇవేం టైటిల్స్ అండీ బాబూ!

ఒకప్పుడు ప్రతీ తెలుగు సినిమాలకు అచ్చమైన చక్కటి 'తెలుగు టైటిల్స్' మాత్రమే కనిపించేవి.

Update: 2024-07-25 05:54 GMT

ఒకప్పుడు ప్రతీ తెలుగు సినిమాలకు అచ్చమైన చక్కటి 'తెలుగు టైటిల్స్' మాత్రమే కనిపించేవి. మన దర్శక నిర్మాతలు ఆయా హీరోలను బట్టి, కథకు సరిపోయే పేర్లు పెట్టేవారు. కానీ ఇండస్ట్రీ ఆధునిక పోకడల వెనుక పరుగులు తీయడం మొదలుపెట్టిన తర్వాత, ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నేటి తరాన్ని ఆకర్షించడం కోసం ఇంగ్లీష్-హిందీ పదాలతో.. ఇంగ్లీష్-తెలుగు వర్డ్స్ కలిసిన టింగ్లిష్ టైటిల్స్ ను పెట్టడం స్టార్ట్ చేసారు. ఇక్కడి వరకూ ఓకే కానీ, ఈ మధ్య కాలంలో డబ్బింగ్ సినిమాల టైటిల్స్ మాత్రం మరీ వింతగా విడ్డూరంగా ఉంటున్నాయి.

గతంలో తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల నుంచి ఏ సినిమానైనా తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చెయ్యాలనుకుంటే.. మన ప్రేక్షకులను ఆకట్టుకోడానికి నేటివిటీకి దగ్గరగా ఉండేలా తెలుగు టైటిల్ ను ఖరారు చేసేవారు. కానీ ఇటీవల కాలంలో డబ్బింగ్ చిత్రాలకు తెలుగు అర్థం వచ్చే టైటిల్స్ పెట్టడం లేదు. పాన్ ఇండియా పేరుతో ఒరిజినల్ వెర్షన్ టైటిల్ నే తెలుగులోకి తీసుకొస్తున్నారు. వాటి అర్థాలు ఏంటో తెలియక టాలీవుడ్ ఆడియన్స్ జుట్టు పీక్కొనే పరిస్థితి కల్పిస్తున్నారు. టైటిల్స్ తోనే సగం ఇంట్రెస్ట్ తగ్గిపోయేలా చేస్తున్నారు.

ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయన్’ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కాబోతోంది. తెలుగులోనూ అదే టైటిల్ తో రాబోతోంది. వచ్చే నెలలో విక్రమ్ నటిస్తున్న 'తంగాలన్' మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఆ తర్వాత సూర్య 'కంగువ'.. రజనీకాంత్ 'వేట్టయాన్‌' అంటూ వస్తున్నారు. శివకార్తికేయన్ 'అమరన్'.. అజిత్ కుమార్ 'విదాముయార్చి' సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా అవే పేర్లతో తెలుగులోకి రాబోతున్నాయి. వీటిల్లో చాలా టైటిల్స్ కు అసలు అర్థాలే తెలియడం లేదు.

వేట్టయాన్‌ సినిమాకి 'వేటగాడు' అని, అమరన్ చిత్రానికి 'అమరుడు' అనే టైటిల్స్ పెట్టొచ్చు. కానీ మేకర్స్ అలా చేయడం లేదు. వాటిని తెలుగులో రిలీజ్ చేస్తున్న సంస్థలు కూడా ఆ దిశగా ఆలోచించడం లేదు. ఇంతకముందు వలిమై, తునివు, ఈటీ, పొన్నియన్ సెల్వన్ అంటూ తమిళ పేర్లతోనే సినిమాలను రిలీజ్ చేశారు. తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తూ, తెలుగు టైటిల్స్ పెట్టకపోవడం అంటే అది మన భాషను చిన్నచూపు చూడటమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అదే సమయంలో మన టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఇతర భాషల హీరోలతో చేస్తున్న సినిమాలకు 'కుబేర', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' 'లక్కీ భాస్కర్' అంటూ యూనివర్సల్ టైటిల్స్ పెడుతున్నారు. విజయ్ నటిస్తున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'.. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వస్తున్న 'థగ్ లైఫ్'.. రజనీకాంత్, లోకేష్ కనగారాజ్ ల 'కూలీ' సినిమాలు ఇదే కోవకు చెందుతాయి. నాని నటిస్తున్న 'సరిపోదా శనివారం' మూవీని ఇతర భాషల్లో 'సూర్యాస్ సాటర్ డే' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. శంకర్ లాంటి కొందరు దర్శకులు మాత్రం భాషకు తగ్గట్టుగా టైటిల్స్ పెడుతుంటారు. 'ఇండియన్ 2' చిత్రాన్ని 'భారతీయుడు 2' గా తెలుగు ప్రేక్షకులకి అందించారు. దిల్ రాజు తమిళ్ లో తీసిన 'వారీసు' సినిమాని 'వారసుడు' పేరుతో రిలీజ్ చేశారు.

ఇదే విధంగా మిగతా ఫిలిం మేకర్స్ కూడా ఆలోచించి, డబ్బింగ్ చిత్రాలకు తెలుగు టైటిల్స్ పెడితే బాగుంటుందని భాషాభిమానులు అభిప్రాయ పడుతున్నారు. వాడుక భాషలో ఉన్న ఇంగ్లీష్ పదాలను, నామవాచకాలను టైటిల్స్ గా పెడితే ఏదోలే అని సరిపెట్టుకోవచ్చు కానీ, మరీ ఇతర భాషల్లోని క్రియానామాలను కూడా యాజ్ టీజ్ గా తెలుగులోకి తీసుకురావడం మంచిది కాదని విమర్శిస్తున్నారు. ఇప్పటి నుంచైనా మేకర్స్ ఆ దిశగా ఆలోచించి తెలుగులోకి డబ్ అయ్యే సినిమాలకు 'తెలుగు టైటిల్స్' పెడతారేమో చూడాలి.

Tags:    

Similar News