పూజ గదిలో బన్నీ ఫోటో! దుల్కర్ సల్మాన్
అందుకే కేరళలో ఎలాంటి విపత్తు తలెత్తినా టాలీవుడ్ నుంచి స్పందించే మొదటి హీరో బన్నీ అవుతాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాలీవుడ్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ హీరోల్లో బన్నీ అక్కడ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. అక్కడ భారీ అభిమాన గణం ఉన్న హీరో బన్నీ. ఆయన నటించిన ఏ తెలుగు సినిమా అయినా అక్కడ రిలీజ్ అవుతుంది. కోట్ల వసూళ్లు సాధిస్తుంది. అక్కడ అభిమానుల్లో ఇళ్లలోనే కాదు...వాళ్ల గుండెల్లోనూ బన్నీ ఉన్నాడు. అందుకే కేరళలో ఎలాంటి విపత్తు తలెత్తినా టాలీవుడ్ నుంచి స్పందించే మొదటి హీరో బన్నీ అవుతాడు.
మరి అలాంటి బన్నీ గురించి మాలీవుడ్ పరిశ్రమకు చెందిన దుల్కర్ సల్మాన్ చెబితే ఇంకెలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. తాజాగా కేరళలో బన్నీని ఎంతగా అభిమానిస్తారో ఆయన మాటల్లోనే...'అల్లు అర్జున్ నటన, డాన్సుకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మొదట్లో తెలుగు నేర్చుకోవడానికి తన సినిమాలే చూసేవాడిని. నా మొదటి సినిమా షూటింగ్ కోళీకోడ్ లోని లోతట్టు ప్రాంతంలో జరిగింది. అక్కడ ఓ ఇంటికెళ్తే పూజ గదిలో బన్నీ ఫోటో చూసి షాక్ అయ్యాను.
ఒక నటుడికి ఇలాంటి అభిమానం మించి ఇంకేం కావాలి అనిపిస్తుంది. అలవైకుంఠపురములో సినిమా చూసి మా పాప మరియమ్ కూడా బన్నీ పెద్ద ప్యాన్ అయింది. నాన్న నీకు అల్లు అర్జున్ తెలుసా? అని అడిగింది. తెలిస్తే బన్నీ దగ్గరకు తీసుకెళ్లు అంది. పుష్ప సినిమా కూడా బాగా నచ్చింది. ఇంట్లో తగ్గేదేలే అంటూ డైలాగులు చెబుతుంది. అర్జున్ ఇమిటేట్ చేస్తున్న మరియమ్మ కోరిక త్వరలోనే తీరుతుంది' అని అన్నారు.
అంటే బన్నీ దగ్గరకు మరియమ్ ని తీసుకెళ్తాడు అన్న మాట. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ మాలీవుడ్ సినిమాలకంటే తెలుగు సినిమాలే ఎక్కువ చేస్తున్నాడు. హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఏదో సమయంలో బన్నీని కుటుంబ సమేతంగా దుల్కర్ కలిసే అవకాశం ఉంది. ఇటీవలే బన్నీ నటించిన 'పుష్ప-2' కూడా రిలీజ్ అయి ఇండియాని షేక్ చేస్తోంది. కాబట్టి బన్నీని కలవడానికి ఇంతకన్నా మంచి సమయం ఏముంటుంది.