ఎన్టీఆర్‌కి ఇదే కావాలి... రవికి ఫ్యాన్స్ విజ్ఞప్తి

వార్‌ 2 బీజీఎం నుంచి ఫ్యాన్స్‌లో పెద్దగా అంచనాలు లేవు. కానీ ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ నటించబోతున్న సినిమా బీజీఎంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Update: 2025-01-01 09:57 GMT

ఎన్టీఆర్‌ 'దేవర' సినిమాతో గత ఏడాది దసరా ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనిరుధ్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ఆయుధ పూజ పాటతో పాటు రెండు పాటలు సినిమా స్థాయిని పెంచాయి. సినిమాలోని పలు సన్నివేశాలు అనిరుధ్ మ్యాజిక్‌ చేసి మ్యూజిక్‌తో లేపాడు. అద్భుతమైన నేపథ్య సంగీతంకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. అలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మళ్లీ ఎన్టీఆర్ సినిమాకు ఎప్పుడూ వింటామని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వార్‌ 2 సినిమాలో ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు. ఆ సినిమా మ్యూజిక్‌ రెగ్యులర్‌ బాలీవుడ్‌ సినిమా మార్క్‌తో ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వార్‌ 2 బీజీఎం నుంచి ఫ్యాన్స్‌లో పెద్దగా అంచనాలు లేవు. కానీ ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ నటించబోతున్న సినిమా బీజీఎంపై అంచనాలు భారీగా ఉన్నాయి. కేజీఎఫ్‌, సలార్‌ సినిమాల మేకర్‌ ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ సినిమా రూపొందబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ఏడాదిలో ఎన్టీఆర్‌తో సినిమాను మొదలు పెట్టబోతున్న ప్రశాంత్ నీల్‌ ఇప్పటికే తమ కాంబో మూవీకి సంగీతాన్ని రవి బస్రూర్ అందించబోతున్నారు అంటూ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ఎన్టీఆర్‌ స్వయంగా వెళ్లి రవి బస్రూర్‌ స్టూడియోలో సందడి చేశారు. ఎన్టీఆర్‌పై తనకు ఉన్న అభిమానంతో ప్రత్యేకంగా ఒక మ్యూజిక్‌ను రూపొందించి వీడియోను విడుదల చేశాడు.

రవి బస్రూర్‌ ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ నిరాశ పరిచారు. దాంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌లో ఒకింత ఆందోళన వ్యక్తం అయ్యింది. ఎట్టకేలకు రవి తన స్థాయికి తగ్గ బీజీఎంతో వచ్చాడు. తాజాగా కన్నడంలో వచ్చిన మార్కో సినిమాకు రవి బస్రూర్‌ సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా సినిమాకు ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ అదిరి పోయింది. అద్భుతమైన సంగీతం సినిమా స్థాయిని రెండు మూడు రెట్లు పెంచింది అంటూ రివ్యూలు వచ్చాయి. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాల్లో, హీరో విలన్‌ల ఎలివేషన్‌ సీన్స్‌లో వచ్చే బీజీఎంకి ప్రేక్షకులు సీటు అంచున కూర్చోవాల్సిందే. ఆ స్థాయిలో అద్భుతమైన సంగీతాన్ని అందించిన రవి వర్క్‌కి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ నీల్‌ తీయబోతున్న సినిమాలోనూ ఇలాంటి అద్భుతమైన బీజీఎంను అందించాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్‌ వంటి మాస్ హీరోకు యాక్షన్‌ సన్నివేశాల్లో రవి బస్రూర్‌ నుంచి అలాంటి సంగీతం పడితే కచ్చితంగా మరో రేంజ్‌లో సినిమా ఉండటం ఖాయం. ప్రశాంత్‌ నీల్ మరోసారి కేజీఎఫ్‌, సలార్‌ వంటి భారీ యాక్షన్‌ సినిమాను ఎన్టీఆర్‌ తో తీయాలి, రవి బస్రూర్‌ నుంచి అలాంటి అద్భుతమైన సంగీతం రావాలి అంటూ ఫ్యాన్స్‌ బలంగా కోరుకుంటున్నారు. నెట్టింట ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ప్రస్తుతం రవి బస్రూర్‌ బీజీఎం బిట్స్‌ను షేర్‌ చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబో మూవీ కోసం వారంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News