గాయని అరెస్ట్ వెనక కారణం తెలిస్తే షాక్
అయితే సదరు గాయని హిజాబ్ ధరించకుండా ఇలా లైవ్ లో పాట పాడటంతో ఆ దేశ చట్టాల ప్రకారం నేరం అని పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేసారు.
ఇరాన్ నియమనిబంధనల గురించి తెలిస్తే ఇతర ప్రపంచం షాక్ కి గురవుతుంది. ప్రముఖ ఇస్లామిక్ గాయకురాలు యూట్యూబ్ లో తాను చేసిన పనికి అరెస్ట్ అవ్వడం తీవ్ర సంచలనంగా మారింది. అంతగా సదరు గాయని ఏం తప్పు చేసింది? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
ఇటీవల ఇరాన్ కి చెందిన ప్రముఖ గాయని పరస్తు అహ్మదీ యూట్యూబ్‌లో వర్చువల్ కచేరీతో అహూతులను రంజింపజేసారు. మజాందరన్ ప్రావిన్స్ రాజధాని సారి సిటీలో పరస్తూ అహ్మదీ ఈ కచేరీ నిర్వహించగా కొద్దిసేపటికే పోలీసులు తనను అరెస్ట్ చేసారు. పరాస్టూ అహ్మదీ పోస్ట్ చేసిన వీడియో యూట్యూబ్‌లో 14 లక్షల (1.4 మిలియన్ల)కు పైగా వీక్షణలను సంపాదించింది.
యూట్యూబ్ కచేరీలో, పరస్టూ అహ్మదీ పొడవాటి నలుపు రంగు స్లీవ్‌లెస్ దుస్తులు ధరించి కనిపించారు. గాయనితో పాటు నలుగురు మేల్ కళాకారులు కూడా వేదికపై ఉన్నారు. అయితే సదరు గాయని హిజాబ్ ధరించకుండా ఇలా లైవ్ లో పాట పాడటంతో ఆ దేశ చట్టాల ప్రకారం నేరం అని పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే గాయని పరస్తూ అహ్మదీ తరపు న్యాయవాది మిలాద్ పనాహిపూర్ ఈ అరెస్టును నిరశించారు.
పరస్తూ అహ్మదీ మూడు రోజుల క్రితం యూట్యూబ్‌లో తన సంగీత కచేరీని పోస్ట్ చేసింది. ఈ వీడియో పరిచయం ఇలా ఉంది. ''నేను పరస్తూ, నేను ఇష్టపడే వ్యక్తుల కోసం పాడాలనుకునే అమ్మాయిని. ఇది నేను విస్మరించలేని హక్కు.. నేను అమితంగా ఇష్టపడే భూమి కోసం పాడుతున్నాను..'' అంటూ లైవ్ లో గానాలాపన చేసింది. ఈ ఆన్‌లైన్ కచేరీని దాదాపు 14లక్షల మందికి పైగా వీక్షించారు. అహ్మదీ బ్యాండ్‌లోని ఇద్దరు సంగీత విద్వాంసులు సోహీల్ ఫాగిహ్ నసిరి, ఎహ్సాన్ బీరాగ్దర్‌లను శనివారం టెహ్రాన్‌లో అరెస్టు చేసారు.
1979లో ఇరాన్‌లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తరువాత మహిళను మొదట పూర్తిగా పాడకుండా నిషేధించారు. తర్వాత మగవారి ముందు ఒంటరిగా పాడటం లేదా నృత్యం చేయకుండా నిషేధించారు. ఇరానియన్ మహిళా గాయకులు కోరస్‌లో భాగంగా మాత్రమే పురుష ప్రేక్షకుల కోసం ప్రదర్శన ఇవ్వగలరు.. కానీ స్త్రీలు మాత్రమే ఒక హాలులో పాడటానికి అనుమతి ఉంది. ఇరాన్ దైవపరిపాలనా క్రూరమైన చట్టాల ఆధారంగా మహిళలు బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ లేకుండా కనిపించడానికి అనుమతించరు. అయితే చాలా మంది ఇరానియన్ మహిళలు తాము కఠినమైన దుస్తుల కోడ్‌కు వ్యతిరేకమని చెప్పారు. ముఖ్యంగా తప్పనిసరి హెడ్‌స్కార్ఫ్ కి వ్యతిరేకంగా ఉన్నారు. హిజాబ్ ఇప్పుడు పూర్తిగా రాజకీయ రక్కసి కోరల్లో చిక్కుకుందన్న విమర్శలు ఉన్నాయి. నాలుగు దశాబ్ధాలుగా దేశంలోని మహిళల హక్కులు వివాదాస్పద అంశంగా ఉన్నాయి.