ఫిలింఛాంబర్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఫిలింఛాంబర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఫిలింఛాంబర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తాజాగా అందిన సమాచారం మేరకు.. ఛాంబర్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని చెబుతున్నారు. అయితే దీనిపై అధికారికంగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సినిమా నాలుగు సెక్టార్లను మానిటరింగ్ చేసే వ్యవస్థ ఫిలింఛాంబర్. స్టూడియోస్, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఛాంబర్ పరిధిలో వ్యవహారాలు చక్కబెడుతుంటారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన ఫిలింఛాంబర్ హైదరాబాద్ ఫిలింనగర్ లో ఉంది. ఈ ఫిలింఛాంబర్ భవంతిలో మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఆఫీస్, నిర్మాతల మండలి కార్యాలయం, ప్రివ్యూ థియేటర్, మీటింగ్ హాల్.. వగైరా వగైరా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. పరిశ్రమకు సంబంధించిన కీలక విషయాలను ఛాంబర్, నిర్మాతల మండలిలో చర్చిస్తుంటారు. ఛాంబర్ లో అగ్నిప్రమాదం వల్ల అక్కడ ఎలాంటి డ్యామేజ్ జరిగింది? అనేదానిపై ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు.
కొంతకాలంగా తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు అసాధారణంగా ఉండడంతో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఛాంబర్ లో కరెంట్ తీగల రాపిడి వల్ల షార్ట్ సర్క్యూట్ అయిందని చెబుతున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి కారణమేమిటన్నది మరింత స్పష్ఠత రావాల్సి ఉంది.