ఇద్దరు హీరోయిన్లతో రిలేషన్‌లో స్టార్ డైరెక్టర్
భార్య ఉండగా హీరోయిన్లతో సంబంధాలు పెట్టుకున్న దర్శకుల గురించి చాలా కథనలొచ్చాయి
భార్య ఉండగా హీరోయిన్లతో సంబంధాలు పెట్టుకున్న దర్శకుల గురించి చాలా కథనలొచ్చాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత విక్రమ్ భట్ తన హీరోయిన్లతో అత్యంత సన్నిహితంగా మెలిగేవాడని, వారితో రొమాంటిక్ సంబంధం కొనసాగించాడని చాలా పుకార్లు ఉన్నాయి. తాజా ఇంటర్వ్యూలో అతడు దీనిపై స్పందించాడు. నాటి మేటి కథానాయికలు అమీషా పటేల్, సుస్మితా సేన్‌లతో తన గత శృంగార సంబంధాల గురించి భట్ క్లియర్ కట్ గా ఓపెనయ్యాడు.
2000లలో బాలీవుడ్ నటీమణులు అమీషా పటేల్, సుస్మితా సేన్‌లతో సంబంధంలో ఉన్నాడని విక్రమ్ పై అప్పటి మీడియా ప్రచారం చేసింది. అంతేకాదు.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో అతడి సంబంధమే తన భార్య అదితి నుండి విడాకులు తీసుకోవడానికి కారణమని కూడా ఊహాగానాలు సాగాయి. అందుకే ఇప్పుడు ..విక్రమ్ భట్ తన గత సంబంధాల గురించి మాట్లాడుతూ.. సుస్మితా సేన్ - అమీషా పటేల్‌తో తనకున్న సంబంధానికి తాను చింతించనని సిద్ధార్థ్ కన్నన్‌తో ఇంటర్వ్యూలో చెప్పాడు. "నేను నా జీవితంలో దేనికీ పశ్చాత్తాపపడను.. ఒక విషయం కాదు.. ఒక తప్పు కాదు... నేను తప్పులు చేసాను.. చాలా తప్పులు చేసాను కానీ నేను వాటి నుండి నేర్చుకున్నాను. బహుశా ఇంకా చాలా నేర్చుకోవడం మిగిలి ఉండవచ్చు.. కానీ ఇది నా ఏకైక ప్రయాణం'' అని వ్యాఖ్యానించాడు. క్షమాపణలు చెప్పాలి అంటూ సుస్మితా సేన్, అమీషా పటేల్ ఇద్దరికీ ఫోన్లు చేశానని విక్రమ్ భట్ వెల్లడించాడు. ఇద్దరు నటీమణులతో తన సంబంధాల గురించి మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే తనకు మాత్రమే సంబంధాలున్నాయని అనడం సరికాదని అతడు పేర్కొన్నాడు.
విక్రమ్ భట్ జీవితం ఆధారంగా 'ఆంఖేన్' సినిమా తెరకెక్కించారా? అన్న ప్రశ్నకు... తన 2006 చిత్రం ఆంఖేన్ కొంతవరకు తన జీవితం ఆధారంగా రూపొందించానని.. తన చిన్ననాటి ప్రియురాలు అదితిని వివాహం చేసుకున్నప్పుడు సుస్మితా సేన్‌తో తన సంబంధానికి 'సెమీ-ఫిక్షన్' వెర్షన్ కథగా అల్లానని వెల్లడించాడు. ఆంఖేన్ సినిమా చేసినందుకు భార్య అదితి అతడితో గొడవపడలేదా? బాధపడలేదా? అని అడిగినప్పుడు భట్ ఇలా అన్నాడు. ''నేను తెరపై పాత్రలతో ఎవరినైనా నిందించాను అంటే..అది నన్ను నేనే.. నేను సుస్మితను లేదా నా మాజీ భార్యను నిందించలేదు. అలాంటప్పుడు ఎవరైనా ఎందుకు బాధపడతారు? నన్ను నేను కొట్టుకునే హక్కు నాకు ఉంది'' అని భట్ అన్నారు.