'గేమ్ ఛేంజర్' కోసం ఎన్టీఆర్ సాంగ్ రిఫరెన్స్..!
ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో థమన్ సాంగ్స్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా "గేమ్ ఛేంజర్". సంక్రాంతి కానుకగా రేపు థియేటర్లలో రాబోతున్న ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.థమన్ సంగీతం అందించారనే సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన పాటలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో థమన్ సాంగ్స్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు.
'గేమ్ ఛేంజర్' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా ''జరగండి జరగండి" అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2023 దీపావళి పండక్కే ఈ సాంగ్ ను రిలీజ్ చేయమని మేకర్స్ భావించారు కానీ, చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఆ తర్వాత రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా 2024 మార్చి 27న వదిలారు. అయితే అంతకంటే ముందుగానే ఈ పాట ఆన్ లైన్ లో లీకైంది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత అఫిషియల్ గా రిలీజ్ చేసిన పాట ఆకట్టుకుంది. అయితే 'జరగండి' పాట మంచి క్వాలిటీతో రావడానికి AI టెక్నాలజీ యూస్ చేసినట్లుగా థమన్ తెలిపారు.
ముందుగా హనుమాన్ అనే గాయకుడితో ఈ పాటను పాడించి, ఆ తర్వాత ఆర్టిషియ్ ఇంటెలిజెన్స్ సహాయంతో దలేర్ మెహేందీ పాడినట్లుగా క్రియేట్ చేశామని తమన్ చెప్పారు. దీని కోసం ఎన్టీఆర్ నటించిన 'బాద్ షా' సినిమా పాటలోని దలేర్ వాయిస్ ను రిఫరెన్స్ గా తీసుకున్నారట. ''జరగండి పాటకి AI వాడాల్సి వచ్చింది. ఎందుకంటే దలేర్ మెహేంది అంత హెవీగా పాడలేకపోయారు. సో 'బంతిపూల జానకి' పాట నుంచి ఆయన వాయిస్ శాంపిల్ తీసుకొని, హైదరాబాద్ సింగర్ హనుమాన్ తో పాడించి ఏఐ టెక్నాలజీ సాయంతో దలేర్ మెహేందీ వాయిస్ తో మ్యాచ్ చేశాం. అలా ఏఐతో చాలా మ్యాజిక్స్ జరుగుతాయి" అని థమన్ అన్నారు.
"ఫస్ట్ దలేర్ మెహందీతోనే సాంగ్ రికార్డ్ చేశాం. కానీ మేమనుకున్న రిథమ్ కు ఆ పంచ్ రాలేదు. AI వాడుతున్నామని ఆయనకు చెప్పి పేమెంట్ పంపించాం. మేము ఆ ప్రోటోకాల్‌ను, ఎథిక్స్ ను ఫాలో అయ్యాం. ఆల్రెడీ ఆయన 100 టేకులు పాడారు. ఎందుకనో 'జరగండి జరగండి' అనే పంచ్ రావడం లేదు. మళ్ళీ మళ్ళీ మేం డిల్లీకి వచ్చి పాడించడం కష్టం అవుతుంది అని ఆయనకు చెప్పి, డైరెక్టర్ ఇలా కావాలి అంటున్నారని చెప్పి ఏఐలో చేశాం" అని థమన్ చెప్పుకొచ్చారు.
ఏఐ టెక్నాలజీతో సృష్టిస్తున్న ఎన్నో అద్భుతాలు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సినిమా మేకింగ్ లో కృతిమ మేథస్సు చాలా బాగా ఉపయోగపడుతోంది. దీని సాయంతో చనిపోయిన నటీనటులను కూడా తిరిగి తెర మీదకి తీసుకొస్తున్నారు. వయసు మీద పడిన హీరోలను యంగ్ గా చూపిస్తున్నారు. సంగీతంలోనూ AI మాయాజాలం మొదలైంది. ప్రధాని మోదీ పాడినట్లుగా, ఆయన వాయిస్ తో ఎన్నో పాటలు వైరల్ అయ్యాయి. 'కీడా కోలా' సినిమాలో ఏకంగా దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినట్లు ఓ సాంగ్ ను క్రియేట్ చేసారు. అనుమతి తీసుకోకుండా చేశారంటూ దీనిపై కేసు వేశారు.. అది వేరే విషయం అనుకోండి. ఇక ఏఆర్ రెహమాన్ కూడా ఇలాంటి ప్రయోగమే చేశారు. ఇప్పుడు థమన్ సైతం 'జరగండి' పాట కోసం ఏఐని ఆశ్రయించారు.
ఇకపోతే 'గేమ్ ఛేంజర్' సినిమా మేకింగ్ కి రూ.300 కోట్లకు పైగానే బడ్జెట్ అయితే.. అందులో రూ.75 కోట్లు 5 పాటల చిత్రీకరణ కోసమే ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. 'జరగండి' పాట కోసం 70 అడుగుల భారీ హిల్ విలేజ్ సెట్ వేశారు. ప్రభుదేవా మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటను 13 రోజుల పాటు చిత్రీకరించారు. ఇందులో రామ్ చరణ్ - కియారా అద్వానీతో పాటుగా 600 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. వీరంతా కూడా జ్యూట్ (జనపనార)తో తయారు చేసిన ఎకో-ఫ్రెండ్లీ కాస్ట్యూమ్స్ ధరించడం విశేషం. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తీసిన ఈ సాంగ్ సినిమాలో హైలెట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతోంది.