గేమ్ ఛేంజర్.. ఇండియన్ 2 ట్విస్ట్!
దిల్ రాజు కూడా శంకర్ సినిమాలతోనే డిస్ట్రిబ్యూటర్ గా ఒకప్పుడు చాలా మంచి లాభాలను అందుకున్నాడు.
దర్శకుడు శంకర్ తో ఒక సినిమా చేయాలి అని నిర్మాత దిల్ రాజు ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఆయన మంచి ఫామ్ లో ఉన్నప్పుడు అసలు గ్యాప్ దొరకలేదు. ఇక వరుస ప్లాప్స్ ఎదుర్కొన్న తర్వాత దిల్ రాజుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. దిల్ రాజు కూడా శంకర్ సినిమాలతోనే డిస్ట్రిబ్యూటర్ గా ఒకప్పుడు చాలా మంచి లాభాలను అందుకున్నాడు.
ఇక ఆయనతో సినిమాను నిర్మించాలని కోరిక ఇప్పటినుంచే ఉంది. అందుకే ఆయన బడ్జెట్ విషయంలో కాస్త కంగారు పెడతాడని తెలిసినప్పటికీ కూడా దిల్ రాజు రిస్క్ తీసుకుని గేమ్ ఛేంజర్ సినిమాను మొదలుపెట్టారు. అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువైనప్పటికీ కూడా రాజుగారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం సినిమా షూటింగ్ అయితే కొనసాగుతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ అసలు హ్యాపీగా లేరు.
ఇప్పటివరకు కేవలం రామ్ చరణ్ కు సంబంధించిన ఒకే ఒక్క పోస్టర్ను విడుదల చేశారు. అంతేకాకుండా ఇప్పటివరకు కనీసం ఒక టీజర్ కూడా విడుదల చేయకపోవడం మెగా అభిమానుల్లో కొంత అసంతృప్తిని అయితే కలిగిస్తోంది. అయితే సినిమా అప్డేట్ ఇవ్వడంలో ఎందుకు ఇలా చేస్తున్నారు అనే విషయంలో ఎవరికీ అర్థం కావడం లేదు.
కానీ చిత్ర యూనిట్ కి మాత్రం ఈ విషయంలో ఒక క్లారిటీతో అయితే ఉంది. ముఖ్యంగా దిల్ రాజు సినిమా అప్డేట్స్ ఇవ్వకుండా ఉండరు. కానీ సినిమా విడుదల ఎప్పుడు అవుతుంది అని విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత అసలు ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి ఆయన ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. మరో వైపు శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ కూడా దాదాపు తుది దశకు చేరుకున్న విషయం తెలిసిందే.
అయితే ఆ సినిమా వచ్చిన తరువాతనే గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇండియన్ 2 సినిమాను మొదట సంక్రాంతికి అనుకున్నారు. కానీ అప్పుడు వచ్చే అవకాశం కనిపించడం లేదు. అలాగే మార్చిలో కూడా అనుకున్నారు కానీ ప్లాన్ సెట్ అవ్వడం లేదు. ఇక ఇప్పుడు ఫైనల్ గా ఏప్రిల్ 28వ తేదీన సినిమాను తీసుకురావాలని అనుకుంటున్నారు.
అదే జరిగితే గేమ్ ఛేంజర్ సినిమా మాత్రం వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ కావచ్చు అని తెలుస్తోంది. అంటే దాదాపు మరో ఏడాది వరకు వెండితెరపై రామ్ చరణ్ ను చూసే అవకాశం ఉండదు. మరి ఈ విషయంలో దిల్ రాజు ఏదైనా క్లారిటీ ఇస్తారో చూడాలి.