బ్రో.. గుంటూరు కారంపై పొలిటికల్ కంప
మంత్రి అంబటి రాంబాబు డైరెక్ట్ గానే త్రివిక్రమ్ కు ఛాలెంజ్ విసురుతూ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'బ్రో' సినిమా ప్రస్తుతం కాంట్రవర్సీగా మారుతోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ను ఇరాకటంలో పడేసేటట్టు కనిపిస్తోంది. ఆయన పొలిటికల్ గా టార్గెట్ అవుతున్నారు.
వైకాపా నేతలు, అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు డైరెక్ట్ గానే త్రివిక్రమ్ కు ఛాలెంజ్ విసురుతూ.. పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ పరిణామాలన్నీ సూపర్ స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం'పై ఎఫెక్ట్ చూపేలా కనిపిస్తోంది.
ఇప్పటికే 'గుంటూరు కారం' సినిమా.. కథలో మార్పులు, నటీనటులు సెట్ అవ్వకపోవడం, టెక్నిషియన్స్ ను మార్చడం.. సహా పలు కారణాలతో షూటింగ్ విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అసలీ సినిమా పూర్తి అవుతుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో 'బ్రో' సినిమా వల్ల చిక్కుల్లో పడ్డారు 'గుంటూరు కారం' డైరెక్టర్ త్రివిక్రమ్.
అసలే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఏపీలో ఎన్నకలకు మరో ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు టికెట్ రేట్లు పెంచమని మేకర్స్ ప్రభుత్వాన్ని అడగాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు త్రివిక్రమ్.. ఏపీ సర్కార్ మధ్య వివాదం ముదురోతంది.
మరి ఇలాంటి పరిస్థితుల్లో మహేశ్ బాబు సినిమాకు అదనపు టికెట్ రేట్లు కావాలని ప్రభుత్వం దగ్గరకు వెళ్లి ఏమని అడుగుతారు మేకర్స్. ఇది గురూజీ సినిమా అని చెప్పగానే.. సర్కార్ స్పందన ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
టికెట్ రేట్ల పరిస్థితి పక్కన పెడితే.. 'గుంటూరు కారం' పాజిటివ్ టాక్ వస్తే సేఫ్ అవుతుంది. కానీ ఏమైనా డివైడ్ టాక్ వచ్చినా.. తేడా కొట్టినా.. గురూజీని ఆటాడుకునేందుకు వైకాపా ఫ్యాన్స్ రెడీగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రాజకీయ పరంగా పవన్ స్పీచ్ లు, ఆలోచనా ధోరణి అంతా వెనక నుంచి త్రివిక్రమ్ నడిపిస్తున్నారని టాక్ కూడా బలంగా ఉంది. చూడాలి మరి ఇలాంటి పరిస్థితుల్లో 'గుంటూరు కారం'పై ప్రభావం ఎంత వరకు చూపుతుందో.