'గుంటూరు కారం'... ఆంధ్ర, తెలంగాణ పొలిటికల్ టచ్
'గుంటూరు కారం' చిత్రం లో పొలిటికల్ టచ్ కూడా ఉండబోతుందని తెలిసింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న సినిమా 'గుంటూరు కారం'. ప్రస్తుతం ఈ సినిమా ఎన్నో కష్టాల ను ఎదుర్కొంటూ షూటింగ్ జరుపుకుంటోంది. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఇందులో మహేశ్ పాత్ర కూడా మాస్ గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజైన పోస్టర్ ను చూస్తే అర్థమవుతోంది. అయితే ఇప్పుడీ చిత్రం లో పొలిటికల్ టచ్ కూడా ఉండబోతుందని తెలిసింది.
తాజాగా ఓ కొత్త పోస్టర్ నెట్టింట్లో దర్శనమిచ్చింది. ఇందులో ఓ ఫ్లెక్సీ కనపడుతోంది. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నారు. 'ప్రజాబంధు జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వైర వెంకట స్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు. జనదళం పార్టీ యువజన నాయకులు నిజమాబాద్ జిల్లా' అని అందులో రాసి ఉంది. అంటే ప్రకాశ్ రాజ్.. శ్రీ వైర వెంకట స్వామి అనే పొలిటికల్ లీడర్‌గా కనిపిస్తారని అర్థమవుతోంది.
అయితే ఈ సినిమా టైటిల్ 'గంటూరు కారం' కావడం వల్ల.. కేవలం ఆ నగరం చుట్టూ పక్కల జరిగే కథగా ఇది రూపొందుతుందని అంతా అనుకున్నారు. కానీ తాజా పోస్టర్ లో నిజమాబాద్ జిల్లా అని రాయడం కూడా.. మరో విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఈ చిత్రం లో రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్ కాస్త ఉండబోతుందని తెలుస్తుంది.
ఇకపోతే గతం లోనే ఈ చిత్రం పొలిటికల్ నేపథ్యంలో ఉండొచ్చని ప్రచారం సాగింది. అప్పట్లో ఈ సినిమా టైటిల్ గురించి పెద్ద చర్చే సాగింది. 'అమరావతికి అటు ఇటు' అనే టైటిల్ బాగా వైరల్ అయింది. అసలే ఏపీ రాజకీయాల్లో రాజధాని విషయమై అమరావతి పేరు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అందకే ఈ టైటిల్ వల్ల ఎటువంటి కాంట్రవర్సీ రాకూడదని.. దాన్ని పక్కనపెట్టి 'గుంటూరు కారం' వైపు మొగ్గు చూపారు మేకర్స్.
కాగా, ఈ గుంటూరు కారం.. మహేశ్ బాబు -త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ గా రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన వీడియోలు, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ సినిమా లో కథానాయికలుగా మొదట పూజా హెగ్డే, శ్రీలీల ను తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్డే తప్పుకోగా.. శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయింది. రెండో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఎంపికైనట్లు.. ఆమెనే స్వయంగా ఇటీవలే తెలిపింది.