'హనుమాన్' అడ్వాంటేజ్ తో ఆ సినిమాలకి మరింత ప్లస్!
ఈ క్రమంలోనే థియేటర్ దగ్గరికి వెళ్లి హనుమాన్ టికెట్ల కోసం క్యూ కడుతుంటే చివరికి టికెట్లు దొరకకపోవడంతో అందుబాటులో ఉన్న మరో సినిమాకి వెళ్లడం జరుగుతుంది.
మన తెలుగు సినిమాలకు అతి పెద్ద సీజన్ సంక్రాంతి అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రతి సంక్రాంతికి స్టార్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటారు. సాధారణంగా సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఎప్పుడో ఒకసారి కంటెంట్ మీద నమ్మకం ఉంటే మాత్రమే చిన్న సినిమాని రిలీజ్ చేస్తూ ఉంటారు నిర్మాతలు. ఈసారి కూడా అలాగే జరిగింది. ఈ సంక్రాంతికి మొత్తం నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే అందులో మూడు పెద్ద సినిమాలు, ఒక చిన్న సినిమా.
ఆ సినిమా పేరే 'హనుమాన్'. కాస్టింగ్, బడ్జెట్ పరంగా ఇది చిన్న సినిమానే అయినప్పటికీ రిలీజ్ అయిన తర్వాత సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మారతం పడుతున్నారు. దీంతో స్టార్ హీరోల సినిమాలను వెనక్కి నెట్టి హనుమాన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు పెద్ద సినిమాకి టికెట్లు దొరక్కపోతే ఆడియన్స్ చిన్న సినిమా వైపుకి మొగ్గుచూపుతారు.
అలా చాలాసార్లు చిన్న సినిమాలకి బాగా కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో దీనికి రివర్స్ ట్రెండ్ నడుస్తుంది. చిన్న సినిమా అయిన హనుమాన్ ని పెద్ద సినిమాలు వినియోగించుకుంటున్నాయి. హనుమాన్ మూవీకి సరిపడా థియేటర్స్ దొరకపోవడంతో జనాలకు టికెట్లు దొరకడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీల్లో డబుల్ స్క్రీన్స్ ఇచ్చిన హౌస్ ఫుల్స్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేకర్స్ కూడా నెమ్మదిగా స్కీన్స్ పెంచుతున్నా అవి సరిపోవడం లేదు.
ఇది కాస్త పెద్ద సినిమాలకు అడ్వాంటేజ్ అవుతుంది. ఫెస్టివల్ టైం లో కచ్చితంగా సినిమా చూడాలి అనేది మన తెలుగు ప్రేక్షకులకు అలవాటైపోయింది. ఈ క్రమంలోనే థియేటర్ దగ్గరికి వెళ్లి హనుమాన్ టికెట్ల కోసం క్యూ కడుతుంటే చివరికి టికెట్లు దొరకకపోవడంతో అందుబాటులో ఉన్న మరో సినిమాకి వెళ్లడం జరుగుతుంది. ఆ రకంగా శుక్ర, శనివారాల్లో మహేష్ 'గుంటూరు కారం'కి థియేటర్స్ లో మంచి ఆక్యుఫెన్సీ కనబడింది.
ఇక ఆదివారం రిలీజ్ అయిన 'నా సామిరంగ' మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఇక నుంచి హనుమాన్ తర్వాత ఈ సినిమాని సెకండ్ ఛాయిస్ గా తీసుకుంటున్నారు ఆడియన్స్. ఈ క్రమంలోనే మార్నింగ్ కాస్త డల్ గా షో మొదలైనప్పటికీ మ్యాట్నీల నుంచి ఒక్కసారిగా పుంజుకుంది. ఇక ఈవినింగ్, నైట్ షోస్ హౌస్ ఫుల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తంగా హనుమాన్ ఓవర్ ఫ్లోస్ గుంటూరు కారం, నా సామి రంగ సినిమాలకి బాగా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.