'హనుమాన్' మూవీ రివ్యూ
నటీనటులు: తేజ సజ్జ - అమృత అయ్యర్ - వినయ్ రాయ్ - వరలక్ష్మి శరత్ కుమార్ - గెటప్ శీను - వెన్నెల కిషోర్- సముద్రఖని తదితరులు
సంగీతం: హరి గౌర - అనుదీప్ దేవ్ - కృష్ణ సౌరభ్
ఛాయాగ్రహణం: శివేంద్ర దాశరథి
కథ - స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్ విల్
నిర్మాత: కె.నిరంజన్ రెడ్డి
రచన- దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
ఈసారి సంక్రాంతి సందడి తెర తీసిన సినిమా హనుమాన్. పేరుకు ఇది చిన్న సినిమా కానీ ప్రేక్షకుల్లో దీనిపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను హనుమాన్ ఎంత మేర అందుకుందో చూద్దాం పదండి.
కథ:
అంజనాద్రి అనే ఊరిలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు హనుమంతు (తేజ సజ్జ). అతడికి అమృత (అమృత అయ్యర్) అంటే చిన్నప్పట్నుంచీ ఇష్టం. తమ ఊరిని గుప్పెట్లో పెట్టుకున్న పాలెగాళ్లకు ఎదురు వెళ్లడంతో బందుపొట్లను పంపి ఆమెని చంపాలని చూస్తారు. వాళ్ళ నుండి ను కాపాడే ప్రయత్నంలో చావు బతుకుల మధ్య సముద్రంలో పడిపోతాడు హనుమంతు. అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడి వచ్చాక హనుమంతు ఒక్కసారిగా అంతులేని శక్తిమంతుడిగా మారతాడు. అతడికి ఆ శక్తి ఎలా వచ్చింది.. ఆ శక్తిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఓ దుష్టుడితో హనుమంతు పోరాడి ఎలా గెలిచాడు అన్నది మిగతా కథ.
కథనం- విశ్లేషణ:
గత ఏడాది ప్రభాస్ ప్రధాన పాత్రలో ఆదిపురుష్ సినిమా వచ్చింది. హీరోగా ప్రభాస్ స్థాయి ఏంటో చెప్పాల్సిన పనిలేదు. తొలి రోజు థియేటర్లలో రాముడిగా తన పరిచయ సన్నివేశం తెరపై కనిపించినపుడు ఆడిటోరియాలు దద్దరిల్లడం మామూలే. కానీ అదే సినిమాలో ఒక అర గంట గడిచాక మనకు అస్సలు పరిచయం లేని ఓ నటుడు కనిపించినప్పుడు కూడా థియేటర్ అదే స్థాయిలో హోరెత్తిపోయింది. అందుకు కారణం ఆ నటుడు కాదు.. అతను పోషించిన పాత్ర. ఈ క్యారెక్టర్ హనుమంతుడిది అని ఈపాటికి అర్థం అయిపోయి ఉంటుంది. పిల్లలు, పెద్దలు అని తేడా లేదు.. హనుమంతుడు అనగానే ముఖాల్లో చిరునవ్వు పులుముకుంటుంది. ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఆ రూపం.. దాని సమ్మోహన శక్తి అలాంటివి మరి. మన పౌరాణికాల్లో ఆ పాత్రను ఎంతో గొప్పగా వాడుకున్నారు కానీ తర్వాత తర్వాత ఆ పాత్ర కనుమరుగై పోయింది. అయితే హాలీవుడ్ సినిమాలో సూపర్ హీరోలను చూసి గూస్ బంప్స్ తెచ్చుకునే మన ప్రేక్షకులకు.. అంతకు మించి పూనకాలు తెప్పించగల పాత్ర హనుమంతుడిది అని తర్వాతి తరం దర్శకులు ఎవరు గుర్తించలేకపోయారు. అయితే ఇప్పుడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ మర్మాన్ని గుర్తించాడు. హనుమంతుడి పాత్రను అద్భుతంగా వాడుకొని మనదైన సూపర్ హీరో సినిమాను అందించాడు. ఈ పక్కా లోకల్ సూపర్ హీరో సినిమాకు యూనివర్సల్ అప్పీల్ ఉండడం.. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కడం విశేషం. కథ సగటు సూపర్ హీరో సినిమాల తరహాలోనే ఉన్నప్పటికీ.. వినోదాత్మక కథనం, మ్యాజికల్ మూమెంట్స్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
ఇండియన్ సినిమాలో సూపర్ హీరో సినిమాలు చాలా తక్కువ. క్రిష్ లాంటి కొన్ని చిత్రాలు మాత్రమే పకడ్బందీగా రూపొంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఆ సినిమా కూడా పూర్తిగా మన నేటివిటీతో కనిపించదు. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల స్ఫూర్తి, అనుకరణ కనిపిస్తుంది అందులో. అయితే స్టాండర్డ్స్ పరంగా అంతర్జాతీయ స్థాయికి దగ్గరగా ఉంటూనే.. పక్కాగా మన నేటివిటీతో సూపర్ హీరో సినిమాగా హనుమాన్ ను చెప్పవచ్చు. అందుకు కారణం హనుమంతుడి చుట్టూ కథను నడపడమే. కొన్ని సినిమాలు ట్రైలర్లో వావ్ అనిపించి.. తెరమీద తుస్సుమనిపిస్తుంటాయి. హనుమాన్ అలాంటి సినిమా కాదు. ట్రైలర్లో వావ్ అనిపించిన మూమెంట్స్.. వాటి చుట్టూ బిల్డ్ చేసిన సన్నివేశాలతో తెరమీద మరింత ఆకర్షణంగా తయారయ్యాయి. ఉదాహరణకు హనుమంతుడి భారీ రూపం.. మనుషుల్ని కొడితే ఎగిరి ఆ భారీ హనుమంటుడి ముందు గాలిలోకి ఎగిరే దృశ్యం.. హీరో హెలికాప్టర్ ను చెట్టు వేరుతో లాగి పడేసే లాంటి సన్నివేశాలు.. పైపై మెరుగులు ఏమి కావు. తెరమీద అవి విజువల్ ట్రీట్ అనిపించేలా.. వాటిని చూస్తూ గూస్ బంప్స్ తెచ్చుకునే డిజైన్ చేసిన విధానం హనుమాన్ మూవీ లో మేజర్ హైలైట్. హనుమంతుడి ప్రస్తావన వచ్చినా.. ఆ రూపాన్ని చూపించినా.. తన ప్రభావం తెరపై కనిపించినా.. ఒక రకమైన ఉద్వేగం తెచ్చుకునేలా ఆయా సన్నివేశాలను దర్శకుడు ప్రశాంత్ వర్మ తీర్చిదిద్దాడు. కొన్ని దశాబ్దాల పాటు ఇలాంటి అద్భుతమైన క్యారెక్టర్ ను ఎందుకు మన దర్శకులు వాడుకోలేదు అని ఆశ్చర్యపోయేలా చేశాడు ప్రశాంత్.
హనుమాన్ లో ముందుగా విలన్ని పరిచయం చేశాక.. ఆరంభ సన్నివేశాల్లోనే హనుమంతుడి భారీ రూపాన్ని.. దాని చుట్టూ ఒక అందమైన ప్రపంచాన్ని చూపించి ప్రేక్షకులకు మంచి మూడ్ సెట్ చేస్తాడు ప్రశాంత్ వర్మ. తర్వాత హీరో పరిచయ సన్నివేశాలు.. అంజనాద్రి గ్రామంలో వ్యవహారాలతో కథనం కొంచెం నెమ్మదిస్తుంది. కానీ మరి ఆలస్యం చేయకుండా కథను మలుపు తిప్పేశాడు దర్శకుడు. హీరో హనుమంతుడి తాలూకు అద్భుత శక్తిని చేజిక్కించుకున్నాక వచ్చే ఫాంటసీ సన్నివేశాలు మంచి వినోదం పంచుతాయి. ఇక్కడి నుంచి కథనం చకచకా సాగిపోతుంది. హీరో తన శక్తిని చూపించే యాక్షన్ ఘట్టాలు గమ్మత్తుగా అనిపిస్తాయి. విజువల్ ట్రీట్ అనిపించేలా తీర్చిదిద్దిన ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా మంచి కిక్ ఇస్తుంది.
మంచి మలుపులతో, వినోదంతో, విజువల్ మాయాజాలంతో ఆకట్టుకునే ప్రథమార్ధం తర్వాత ద్వితీయార్ధం మీద మీద చాలా అంచనాలు పెట్టుకుంటాం. కానీ ఆ అంచనాలకు తగ్గట్లు రెండో అర్ధం సాగదు. విలన్ పాత్ర కొంచెం గజిబిజిగా సాగడం.. హీరో అక్క పాత్రతో బలవంతపు ఎమోషనల్ డ్రామాను నడిపించడం.. కొన్ని రొటీన్ సన్నివేశాలు సినిమా గ్రాఫ్ ను కొంచెం తగ్గిస్తాయి. కానీ సినిమా పూర్తిగా బోర్ కొట్టే పరిస్థితి అయితే ఉండదు. మధ్య మధ్యలో మెరుపులు వచ్చి ప్రేక్షకుల ఉత్సాహాన్ని నిలబెడతాయి. చివరి అరగంటలో హనుమాన్ మళ్లీ పతాక స్థాయిని అందుకుంటుంది. హనుమాన్ పాత్ర గొప్పతనాన్ని చాటుతూ.. దాని ప్రభావంతో సాగే క్లైమాక్స్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను మరో లోకంలో విహరింపచేస్తాయి. అంతకుముందు ఉన్న కొంత అసంతృప్తిని క్లైమాక్స్ భర్తీ చేస్తుంది. పతాక సన్నివేశాల్లో భారీతనానికి ఆశ్చర్యపోతాం. మనం చూస్తున్నది ఒక చిన్న సినిమా అన్న భావనే ఏ కోశానా కలగదు. ఒక విజువల్ వండర్ చూసిన అనుభూతితో ప్రేక్షకుల కడుపు నింపి పంపిస్తుంది హనుమాన్. పిల్లలకు మరింతగా నచ్చే ఈ సినిమా పెద్దలనూ సంతృప్తి పరుస్తుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి నేటివ్ సూపర్ హీరో సినిమా హనుమాన్.
నటీనటులు:
హీరోగా ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ ఇంకా బాల నటుడు ఛాయలు పోని తేజ సజ్జను సూపర్ హీరో పాత్రలో చూసి అలవాటు పడటానికి కొంచెం సమయం పడుతుంది. కానీ అలవాటు పడ్డాక మాత్రం అతనితో సులువుగానే ప్రయాణం సాగిస్తాం. తేజ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ తో ముడిపడ్డ సినిమాలో లేని ప్రపంచాన్ని ఊహించుకొని నటించడంలో తన ప్రతిభ చూపించాడు నటించడంలో తన ప్రతిభను చూపించాడు. అమృత అయ్యర్ హీరోయిన్ లాగా కాకుండా మామూలు అమ్మాయిలా కనిపించింది. కథలో తన పాత్రకు ప్రాధాన్యం తక్కువే. తన నటన బాగానే సాగింది. వరలక్ష్మీ శరత్ కుమార్ తన శైలికి భిన్నంగా పాజిటివ్ పాత్రలో కనిపించింది. తన నటన ఓకే. విలన్ పాత్రలో వినయ్ రాయ్ పెర్ఫామెన్స్ సినిమాలో మేజర్ హైలైట్. ఆ పాత్రకు ఒక వెయిట్ తెచ్చాడు. సముద్రఖని, వెన్నెల కిషోర్, గెటప్ శీను వీళ్లంతా తమ తమ పాత్రలో బాగానే నటించారు.
సాంకేతిక వర్గం:
హనుమాన్ చిత్రంలో సాంకేతిక విభాగాలన్నీ అదరగొట్టాయి. ఒక పెద్ద బడ్జెట్ సినిమా స్థాయిలో ఔట్ పుట్ కనిపించింది. హరి గౌర.. అనుదీప్ దేవ్.. కృష్ణ సౌరభ్.. ఈ ముగ్గురు కలిసి అందించిన సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ అయింది. పాటలన్నీ కూడా సినిమాలు డ్రైవ్ చేయడంలో కీలకపాత్ర పోషించాయి. ముఖ్యంగా కొన్ని పాటలు, నేపథ్య సంగీతం ఒక డివైన్ ఫీలింగ్ కలిగిస్తాయి. ఈ మధ్య ఈ తరహా సినిమా అన్నది సంబంధం లేకుండా యాక్షన్ ఘట్టాలు అనగానే బ్యాగ్రౌండ్ స్కోర్లో శ్లోకాలు, మంత్రోక్షారణలతో హోరెత్తించేయడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ హనుమాన్ కు మాత్రం ఆ తరహా స్కోర్ బాగా సూట్ అయింది. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. విజువల్స్ బాగున్నాయి. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమా స్థాయికి చాలా గొప్పగా అనిపిస్తాయి. పరిమిత బడ్జెట్లోనే మంచి అవుట్ పుట్ రాబట్టగలిగారు టెక్నీషియన్స్. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక చిన్న స్థాయి విజువల్ వండర్ అందించాడు. అతడికి మంచి విజన్ ఉంది. దర్శకుడిగా తన పనితనం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. రైటింగ్ పరంగా సాధారణంగా అనిపించినా ప్రెజెంటేషన్లో ప్రశాంత్ మార్కులు కొట్టేశాడు. నటీనటులతో పాటు టెక్నీషియన్ల నుంచి మంచి అవుట్ పుట్ రాబట్టుకోవడంలో ప్రశాంత్ ప్రతిభ కనిపిస్తుంది.
చివరగా: హనుమాన్.. విజయ విన్యాసం
రేటింగ్: 3.25/5