ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు హిట్.. సినిమా డిజాస్టర్

కానీ హరీష్ శంకర్ మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటారు.

Update: 2024-08-24 14:00 GMT

టాలీవుడ్లో చాలామంది స్టార్ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్లలో చాలామంది లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు. మీడియాకు, సోషల్ మీడియాకు దొరకరు. కానీ హరీష్ శంకర్ మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటారు. ఊరూ పేరూ లేని అనామకుడెవరో ఏదైనా కామెంట్ చేసినా స్పందిస్తుంటారు.కొన్నిసార్లు వాదనలు పెట్టుకుంటారు. వార్నింగ్‌లూ ఇస్తుంటారు.

తానో స్టార్ డైరెక్టర్ అనే బేషజం లేకుండా మామూలు వ్యక్తిలా సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అవ్వడం మంచిదే. కానీ సోషల్ మీడియాలో, మీడియాలో మరీ ఎక్కువ ఓపెన్ అయిపోతే.. ఈ క్రమంలో ఆత్మవిశ్వాసం కాస్తా అహంకారం లాగా ప్రొజెక్ట్ అయితే.. తన గురించి, సినిమా గురించి మరీ ఎక్కువ చెప్పుకుంటే ఏమవుతుందో చెప్పడానికి ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’ ఫలితమే రుజువు.

ఈ సినిమా గురించి రిలీజ్ ముంగిట హరీష్ శంకర్ మామూలుగా గొప్పలు చెప్పుకోలేదు. తానో బ్లాక్ బస్టర్ సినిమా తీశాననే కాన్ఫిడెన్స్‌ను ప్రదర్శించారు. అంతే కాక పాటల్లో హీరోయిన్ని ప్రెజెంట్ చేసిన విధానం.. స్టెప్స్ గురించి విమర్శలు చేసిన వారి మీద ఎదురు దాడి చేశారు. సినిమాకు సంబంధం లేని అంశాల మీద ప్రెస్ మీట్లలో, ఇంటర్వ్యూల్లో మాట్లాడారు . వాటి మీదే ఎక్కువ చర్చ జరిగేలా చేశారు.

ఈ క్రమంలో నెటిజన్లలో ఒక రకమైన నెగెటివిటీని తెచ్చుకున్నారు. అందరూ హరీష్ ఎలా దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న టైంలో ‘మిస్టర్ బచ్చన్’ రిలీజైంది. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో నెటిజెన్స్ రివ్యూలు గట్టి దెబ్బే కొట్టాయి. సినిమా గురించి హరీష్ చెప్పిన గొప్పలకు.. సినిమాలో కంటెంట్‌కు పొంతన లేకపోవడంతో నెటిజన్లు కూడా గట్టిగా ఈ చిత్రాన్ని టార్గెట్ చేశారు. దీంతో కనీసం ఓపెనింగ్స్ కూడా లేకపోయాయి.

రవితేజ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది ‘మిస్టర్ బచ్చన్’. ఇప్పుడు నిర్మాత విశ్వప్రసాదే స్వయంగా.. నెగెటివిటీ పెరిగి సినిమా దెబ్బ తిందని చెప్పకనే చెప్పేశారు. ఇంకా థియేటర్లలో సినిమా ఉండడం వల్ల తాను లోతుగా మాట్లాడలేకపోతున్నానని అన్నారు కానీ.. ఈ సినిమా వల్ల దారుణంగా నష్టపోయిన నేపథ్యంలో ఆయన అసహనం కూడా అర్థం చేసుకోదగ్గదే. మొత్తానికి ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ ముంగిట హరీష్ శంకర్ ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు సూపర్ హిట్ అయ్యాయి కానీ.. ఆయన చేసిన అతి వల్ల ‘మిస్టర్ బచ్చన్’ అనుకున్న దాని కంటే పెద్ద డిజాస్టర్ అయ్యాయనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది.

Tags:    

Similar News