ఉప ముఖ్యమంత్రి గారి సినిమా పుకార్లపై క్లారిటీ..!
హరి హర వీరమల్లు రెండు పార్ట్ లుగా విడుదల అవ్వబోతుండగా, ఓజీ మరియు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా ఆయన చేస్తున్న సినిమాల జాబితాలో ఉన్నాయి
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు మూడు సినిమాలను ప్రారంభించాడు. హరి హర వీరమల్లు రెండు పార్ట్ లుగా విడుదల అవ్వబోతుండగా, ఓజీ మరియు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా ఆయన చేస్తున్న సినిమాల జాబితాలో ఉన్నాయి.
ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా మొదటి పార్ట్ షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. పవన్ షూటింగ్ కు జాయిన్ అయితే పది నుంచి పదిహేను రోజుల్లో పూర్తి చేస్తారట. ఇక ఓజీ సినిమా కూడా చాలా షూట్ పూర్తి అయ్యింది కనుక త్వరలోనే సినిమా పునః ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతోంది.
ఎటొచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ గురించే పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ వారం రోజులు కూడా షూట్ కి డేట్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న కారణంగా ఉస్తాద్ భగత్ సింగ్ ను పక్కన పెట్టడం మంచిది అనే నిర్ణయానికి పవన్ వచ్చాడు అనేది గత రెండు రోజులుగా వస్తున్న పుకారు.
తాజాగా ఆ పుకారు పై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించాడు. సినిమా స్టార్ట్ అవ్వదు అనే రూమర్స్ వచ్చినప్పుడే పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంకా వస్తూ ఉన్న రూమర్స్ ని కనీసం చదివే టైమ్ కూడా లేదు అన్నాడు. హరీష్ ట్వీట్ తో సినిమా క్యాన్సల్ అవ్వలేదు అంటూ క్లారిటీ వచ్చింది.
రెండు మూడు నెలల తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి షూటింగ్ కు జాయిన్ అవుతాను అంటూ తాజాగా పిఠాపురం లో జరిగిన సభలో ప్రకటించాడు. ఇప్పుడు వెంటనే ఓజీ అంటూ షూట్ కి వెళ్తే క్యాజీ అని మీరే అంటారు. అందుకే పరిపాలన కాస్త గాడిలో పడ్డ తర్వాత వారానికి రెండు మూడు రోజులు షూట్ కి హాజరు అవుతాను అన్నాడు. కనుక ఇప్పటికే ప్రారంభం అయిన మూడు సినిమాలు కాస్త ఆలస్యంగా అయినా ప్రేక్షకుల ముందుకు రావడం కన్ఫర్మ్.