వారసులు..వీళ్లరూటే సెపరేటు బాసూ!
ఇంతకీ వెండితెరపై ఎంట్రీ ఇవ్వకుండా అభిమానులతో పాటు సినీ లవర్స్‌ని అవాక్కయ్యేలా చేస్తున్నది ఎవరు? ఏమాకథ మనమూ ఓ లుక్కేద్దాం.
టాలీవుడ్‌లో స్టార్ హీరోలకు, వారి వారసులకు కొదవ లేదు. తరం మారుతున్న కొద్దీ కొత్త తరం ఉరకలేసే ఉత్సాహంతో రంగంలోకి దిగుతూనే ఉన్నారు. కొంత మంది వెండితెరని ఏలుతుంటే మరి కొంత మంది మాత్రం ఇప్పటికీ స్టార్‌లుగా నిలదొక్కుకోవడానికి శ్రమిస్తూనే ఉన్నారు. కొంత మంది వారసులు మాత్రం ఎప్పుడెప్పుడు అరంగేట్రం చేయాలా అని మీనమేషాలు లెక్కిస్తుంటే మూడవ తరం మాత్రం డిఫరెంట్ స్టైల్లో ఊహించని విధంగా సరికొత్త అడుగులు వేస్తూ మా రూటే సెపరేట్ అంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇందులో స్టార్ హీరోల తనయులు, గారలపట్టిలే ఉండటంతో అంతా అవాక్కవుతున్నారు. ఇంతకీ వెండితెరపై ఎంట్రీ ఇవ్వకుండా అభిమానులతో పాటు సినీ లవర్స్‌ని అవాక్కయ్యేలా చేస్తున్నది ఎవరు? ఏమాకథ మనమూ ఓ లుక్కేద్దాం.
బాలయ్య వారసుడి కోసం నిరీక్షణ...
టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో చిరంజీవి వారసుడు రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చేయడం..స్టార్ హీరోగా పేరు తెచ్చుకోవడం.. ఆర్ ఆర్ ఆర్'తో గ్లోబల్ స్టార్ అనిపించుకోవడం తెలిసిందే. చిరు తరువాత నాగార్జున వారసులు నాగచైతన్య, అఖిల్ అక్కినేని కూడా ఎంట్రీ ఇచ్చేసి హీరోలుగా స్టార్ డమ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు ఎంట్రీ ఇచ్చేసి ఏళ్లు గడుస్తున్నా నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ మాత్రం హీరోగా అరంగేట్రం చేసే వయసు వచ్చేసినా ఇప్పటికీ మీన మేషాలు లెక్కిస్తున్నాడు. అదిగో ఈ ఏడాది ఎంట్రీ ఉంటుంది అంటే..ఈ ఏడాది ఉంటుందని అంటూ బాలయ్య ఎప్పుడు అడిగినా ఒకే డైలాగ్ చెబుతూ నెట్టుకొస్తున్నాడు. మోక్షజ్ఞ మాత్రం హీరోగా ఎంట్రీ ఇవ్వడం లేదు. ఈ ఏడాదైనా తనని బాలయ్య హీరోగా పరిచయం చేస్తాడా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఏడాదైనా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.
గౌతమ్ నాట్ రెడీ..బట్ సితార రెడీ..
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడవ తరం వారసులు తెరపైకి రావాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ తండ్రి మహేష్ తరహాలోనే వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా ఎంట్రీ ఇస్తాడని, ఆ సమయం కోసం వేచి చూస్తుంటే గౌతమ్ మాత్రం అందుకు భిన్నంగా అడుగులు వేస్తున్నాడు. తండ్రిలా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు చేరువ అవుతాడనుకుంటే గౌతమ్ అలా చేయడం లేదు. అభిమానులకు దూరంగా ఉంటున్నాడు. కానీ తండ్రి చేస్తున్న సామాజిక కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొంటూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఎంబీ ఫౌండేషన్ ద్వారా మహేష్ చిన్నారులకు గుండె ఆపరేషన్‌లు చేయిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా గౌతమ్ ఎంబీ ఫౌండేషన్, ఆంధ్రా హాస్పిటల్స్, రెయిన్ బో హాస్పిటల్స్ వారితో కలిసి మహేష్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఆపరేషన్‌లు చేయించారు. వారిని పరామర్శించడానికి వెళ్లిన గౌతమ్ ఫొటోలని నమ్రత షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.
గౌతమ్ ఇలా భిన్నంగా అడుగులు వేస్తుంటే సితార మాత్రం తాను హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అంటూ డైరెక్ట్‌గా చెప్పేస్తోంది. కీలక బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఆశ్చర్యపరుస్తోంది.
మెగా ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన అకీరా..
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే దాదాపు పది మందికి పైగా హీరోలున్నారు. కొంత మంది స్టార్లుగా నిలబడితే మరి కొంత మంది ఇప్పుడిప్పుడే స్టార్‌లుగా ఎదుగుతున్నారు. చిరు, పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ వంటి హీరోలున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అందరి దృష్టి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారసుడు అకీరా నందన్‌పై పడింది. ఇప్పటికే హీరో మెటీరియల్ అనే స్థాయికి చేరుకున్న అకీరాని చూసిన అభిమానులు ఈ ఏడాది, లేదా వచ్చే ఏడాది అకీరా హీరోగా తెరంగేట్రం ఉంటుందని సంబరపడుతున్నారు. అయితే వారికి రేణూ దేశాయ్ షాక్ ఇచ్చింది. అకీరాకు నటనపై పెద్దగా ఆసక్తి లేదని, ఫొటోలు బయటికి రాగానే హీరో అంటూ ఊహాగానాలు మొదలు పెట్టకండి అంటూ చావు కబురు చల్లగా చెప్పేసింది. దీంతో అకీరా హీరోగా ఎంట్రీ ఇవ్వడా..డైరెక్టర్‌గానే వస్తాడా? అని మెగా అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీనిపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇస్తేగానీ అభిమానుల్లో ఉన్న భయాలు తొలిగే అవకాశం లేదు.
సడన్ షాక్ ఇచ్చిన దళపతి వారసుడు...
అందరి వారసుల తరహాలోనే తమిళ తంబీలు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ విజయ్ ఎప్పుడెప్పుడు హీరోగా అరంగేట్రం చేస్తాడా? అని గత రెండేళ్లుగా విజయ్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ జాక్సన్ విజయ్ మాత్రం హీరోగా ఎంట్రీ ఇవ్వడం లేదని, తాను దర్శకుడిగా పరిచయం కాబోతున్నానని స్పష్టం చేయడంతో దళపతి అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. జాక్సన్ విజయ్ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న భారీ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నానని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో విజయ్ అభిమానులు హీరోగా ఎంట్రీ ఇస్తానుకుంటే జాక్సన్ విజయ్ ఇలా చేశాడేంటీ? అని అవాక్కవుతున్నారు.