'హిడింబ' మూవీ రివ్యూ

ఈ సినిమా ట్రైలర్ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. సోషల్ మీడియాలో అదొక సెన్సేషన్ అయింది.

Update: 2023-07-20 10:11 GMT

'హిడింబ' మూవీ రివ్యూ

నటీనటులు: అశ్విన్ బాబు-నందిత శ్వేత-మకరంద్ దేశ్ పాండే-రఘు కుంచె-సంజయ్ స్వరూప్-శ్రీనివాసరెడ్డి-శుభలేఖ సుధాకర్-రాజీవ్ కనకాల-సిజ్జు తదితరులు

సంగీతం: వికాస్ బడిస

ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్

మాటలు: కళ్యాణ చక్రవర్తి

నిర్మాతలు: గంగపట్నం శ్రీధర్

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అనీల్ కన్నెగంటి

చిన్న సినిమాల హవా నడుస్తున్న ప్రస్తుత సమయంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మరో చిన్న చిత్రం 'హిడింబ'. ఈ సినిమా ట్రైలర్ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. సోషల్ మీడియాలో అదొక సెన్సేషన్ అయింది. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'హిడింబ' సినిమాగానూ ప్రేక్షకులను అంతే ఆశ్చర్యపరిచిందేమో చూద్దాం పదండి.


Full View


కథ:

హైదరాబాద్ సిటీలో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతుండగా.. ఆ కేసును పరిష్కరించలేక పోలీసాఫీసర్ అభయ్ (అశ్విన్ బాబు) ఇబ్బంది పడుతుంటాడు. అదే సమయంలో ఒకప్పుడు తనతో కలిసి పని చేసి తర్వాత ఐపీఎస్ అయిన అతడి మాజీ గర్ల్ ఫ్రెండ్ ఆద్య (నందిత శ్వేత) ఆధ్వర్యంలో స్పెషల్ టీంను ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. ఇద్దరూ కలిసి ఈ సీరియల్ కిడ్నాపుల కేసు పై దృష్టిపెడతారు. బోయా అనే క్రిమినల్ ఈ పని చేస్తున్నాడని అనుమానంతో అతణ్ని పట్టుకుంటారు. తన అధీనంలో ఉన్న అమ్మాయిలందరినీ రక్షిస్తారు. అంతటితో కేసు క్లోజ్ అయిందని అనుకుంటే.. అతను కిడ్నాప్ చేసిన అమ్మాయిలకు.. పోలీసులు పరిశోధిస్తున్న కేసుకు సంబంధం లేదని తేలుతుంది. అంతే కాక బోయ దొరికాక కూడా అమ్మాయిల కిడ్నాప్ ఆగవు. దీంతో ఆద్య-అభయ్ కలిసి మళ్లీ పరిశోధన మొదలుపెడతారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగు చూస్తాయి.. ఆ విషయాలేంటి.. ఇంతకీ ఈ కిడ్నాపుల వెనుక ఉన్నదెవరు.. అతణ్ని పట్టుకున్నారా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

థ్రిల్లర్ మూవీ అంటే.. సినిమా ఆద్యంతం ఒక మిస్టరీ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేయాలి.. ఎన్నో ప్రశ్నలు సంధించాలి.. కథ ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరగాలి.. ప్రేక్షకులు ఊహించని స్థాయిలో మేజర్ ట్విస్ట్ ఉండాలి.. ఒక కొత్త కాన్సెప్ట్ ఏదైనా ప్రేక్షకులకు పరిచయం చేయాలి.. 'హిడింబ' ఈ లక్షణాలన్నీ ఉన్న సినిమానే. ఫెయిల్యూర్లే అయినా సరే.. ఇంతకుముందు అసాధ్యుడు.. మిస్టర్ నూకయ్య.. రన్ లాంటి వైవిధ్యమైన సినిమాలే తీసిన అనీల్ కన్నెగంటి.. ఈసారి చాలా టైం తీసుకుని.. ఎంతో కసరత్తు చేసి ఒక వైవిధ్యమైన కథను చాలా 'రా'గా తెర పై ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నించాడు. ఏదో కొత్తగా చూపించాలన్న తన ప్రయత్నాన్ని కచ్చితంగా అభినందించాల్సిందే. కాకపోతే పేపర్ మీద చదివితే వావ్ అనిపించేలా ఉన్న ఈ కథను.. తెరమీద ఆశించినంత పకడ్బందీగా చూపించలేకపోయాడు అనీల్. ఇంకొంచెం బిగి ఉండాల్సిందనిపిస్తుంది. దీనికి తోడు కథలోని కోర్ పాయింట్.. సామాన్య ప్రేక్షకులు జీర్ణించుకోలేనిదిగా ఉండటం కూడా ప్రతికూలత. తెరపై అదంతా చూసి తట్టుకోవడం అందరి వల్లా కాకపోవచ్చు. కానీ ఇందులోని రానెస్.. ఓవర్ ద టాప్ నరేషన్ ను కాస్త తట్టుకోగలిగితే కథ.. బ్యాక్ డ్రాప్.. ట్విస్టుల కోసం 'హిడింబ' ఒకసారి చూడదగ్గ సినిమానే.

అశ్విన్ బాబు లాంటి పెద్దగా పేరు లేని హీరో.. ఫ్లాప్ డైరెక్టర్ అని ముద్ర వేయించుకున్న అనీల్ కన్నెగంటి కలిసి చేసిన 'హిడింబ' సినిమాను మామూలుగా అయితే ప్రేక్షకులు అసలు పట్టించుకోకూడదు. కానీ 'హిడింబ' చూడాలని చాలామందిలో కోరిక పుట్టేలా చేసింది ట్రైలర్. అందులో బాగా హైలైట్ అయింది విచిత్ర అవతారాల్లోని మనుషులు.. వాళ్ల విన్యాసాలే. 'హిడింబ' కథ కూడా వాళ్లకు సంబంధించిందే. ఇండియాకు స్వాతంత్ర్యం రావడానికి పూర్వపు రోజుల్లో ఒక దీవిలో ఉన్న హిడింబ అనే తెగ.. మనుషులను ఆహారంగా తినే వాళ్ల క్రూరత్వాన్ని నేపథ్యంగా చేసుకుని అనీల్ కన్నెగంటి చాలా ఆసక్తికరంగా ఈ కథను రాసుకున్నాడు. సినిమాలో ఆ నేపథ్యాన్ని చూపిస్తూ కథను నడిపిస్తున్నంతసేపు ప్రేక్షకులు స్క్రీన్లకు అతుక్కుపోతారు. ఇందులో చూపించిన చాలా సన్నివేశాలు చూసి ఒళ్లు గగుర్పొడుస్తుంది. కానీ తెరపై అంత హింసు.. ఆ క్రూరత్వాన్ని చూసి తట్టుకోవాలంటే మాత్రం గుండెల్ని రాయి చేసుకోవాల్సిందే. కథలో ఈ హిడింబ తెగ గురించిన ప్రస్తావన వచ్చిన దగ్గర్నుంచి చివరి వరకు సినిమా ఆసక్తికరంగా నడుస్తుంది. ప్రేక్షకులను భయపెడుతూ.. వాళ్లలో క్యూరియాసిటీని పెంచుతూ నడుస్తుంది 'హిడింబ'. ప్రి క్లైమాక్సులో ట్విస్టు సినిమాకు మేజర్ హైలైట్. థ్రిల్లర్లు బాగా అలవాటు పడ్డ ప్రేక్షకులు కొందరు ఈ ట్విస్టును గెస్ చేసేయొచ్చు కానీ.. చాలామంది దానికి షాక్ అవ్వకుండా ఉండలేరు. పతాక సన్నివేశాలు కూడా ఆసక్తికరంగానే అనిపిస్తాయి.

ఐతే 'హిడింబ'ను మొదలుపెట్టిన తీరు.. ప్రి ఇంటర్వెల్ వరకు నడిపించిన విధానం మాత్రం ఆసక్తికరంగా అనిపించదు. వరుసగా అమ్మాయిలు కిడ్నాప్ అవ్వడం.. దాన్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసే తీరు.. ఇదంతా సాధారణంగా అనిపిస్తుంది. కాలా బండా అనే ఏరియాకు సంబంధించిన ఎపిసోడ్ ఒకటి మధ్యలో వచ్చి పోతుంది. దాని చుట్టూ సన్నివేశాలు ఓవర్ ద టాప్ అనిపిస్తాయి. మధ్యలో హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ చికాకు పెడుతుంది. అశ్విన్ బాబు-నందితల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదు. వారి జంటే సరిగా అనిపించదు. హీరో పాత్రను ప్రెజెంట్ చేసిన విధానం కూడా బాగా లేదు. ఫైట్లు సహా అన్నీ అనీల్ ఓవర్ ద టాప్ స్టయిల్లో డీల్ చేయడం.. సౌండ్ డిజైన్ అదీ చికాకు పెట్టేలా ఉండటం మైనస్ అయ్యాయి. నిడవి తక్కువే అయినా కూడా ప్రథమార్ధం కొంచెం సాగతీతగా కూడా అనిపిస్తుంది. ఐతే కథ కొత్త మలుపు తీసుకుని హిడింబ తెగ వైపు దృష్టి మళ్లే దగ్గర్నుంచి సినిమా ఆసక్తి రేపుతుంది. చివరి వరకు ఆ టెంపో కొనసాగింది. మలయాళ సినిమాల తరహాలో ఈ థ్రిల్లర్ కథను హడావుడి లేకుండా.. వల్గారిటీ.. వయొలెన్స్ కొంచెం తగ్గించి విషయ ప్రధానంగా నడిపించి ఉంటే తెలుగులో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటిగా నిలిచేది. కాన్సెప్ట్ వరకు అయితే 'హిడింబ' మంచి ప్రయత్నం. డిఫరెంట్ థ్రిల్లర్స్ చూడాలనుకుంటే 'హిడింబ'పై ఓ లుక్కేయొచ్చు.

నటీనటులు:

అశ్విన్ బాబు తన పాత్రకు అవసరమైన వయొలెంట్ లుక్ తో కనిపించడానికి బాగానే కష్టపడ్డాడు. కానీ నటన పరంగా తన బలహీనతలను అధిగమించలేకపోయాడు. మొదట్లో సాధారణంగా అనిపించి.. తర్వాత చాలా ప్రాధాన్యం తెచ్చుకునే ఈ పాత్రకు అశ్విన్ ఓ మోస్తరుగా న్యాయం చేశాడు. పతాక సన్నివేశాల్లో అతడి నటన కొంచెం హద్దులు దాటినట్లు అనిపిస్తుంది. నందిత శ్వేత ఆద్య పాత్రకు న్యాయం చేసింది. తన గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఆమె గ్లామరస్ గా కనిపించింది. లిప్ లాక్.. ఇంటిమేట్ సీన్లలో కూడా నటించి ఆశ్చర్యపరిచింది. నటన పరంగా ఆమెకు వంకలు పెట్టడానికేమీ లేదు. మకరంద్ దేశ్ పాండే పెర్ఫామెన్స్ అదిరిపోయింది. ఇలాంటి పాత్రకు ఆయనకంటే బాగా ఎవరూ న్యాయం చేయలేరనిపిస్తుంది. సంజయ్ స్వరూప్.. రఘు కుంచె.. శ్రీనివాసరెడ్డి సహాయ పాత్రల్లో ఓకే అనిపించారు. సిజ్జు.. రాజీవ్ కనకాల మెప్పించారు.

సాంకేతిక వర్గం:

'హిడింబ'లో టెక్నీషియన్స్ కష్టం కనిపిస్తుంది. వాళ్లు ప్రతిభ చాటుకునే అవకాశం కల్పించిందీ సినిమా. పాటలకు పెద్దగా ప్రధాన్యం లేని ఈ సినిమాలో వికాస్ బడిస నేపథ్య సంగీతంతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రేక్షకులను సినిమాలో ఇన్వాల్వ్ చేయించడంలో ఆర్ఆర్ ముఖ్య పాత్ర పోషించింది. కానీ కొన్ని చోట్ల ఆర్ఆర్ విషయంలో క్రియేటివిటీ హద్దులు దాటిపోయింది. ఈ సౌండ్లేంటి బాబోయ్ అనిపిస్తుంది. సౌండ్ డిజైన్ బాగుంది. రాజశేఖర్ ఛాయాగ్రహణంలో వైవిధ్యం ఉంది. ఒక డిఫరెంట్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగించాడు. యాక్షన్ సీన్లు.. హిడింబల నేపథ్యాన్ని చూపించిన సన్నివేశాలు.. కేరళ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్లో విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు ప్రశంసనీయ స్థాయిలో ఉన్నాయి. చిన్న సినిమా అయినా బాగా ఖర్చు పెట్టారు. దర్శకుడు అనీల్ కన్నెగంటి విషయం ఉన్నవాడే అని 'హిడింబ' రుజువు చేస్తుంది. తెలుగులో ఇంత వరకు చూడని నేపథ్యంలో అతను వైవిధ్యమైన కథను రాసుకున్నాడు. అతను చాలా కసరత్తు చేసిన విషయం తెరపై కనిపిస్తుంది. స్క్రిప్టు వరకు అతడికి మంచి మార్కులు పడతాయి. కాకపోతే ఓవర్ ద టాప్ స్టయిల్లో కాకుండా కొంచెం కామ్ గా ఈ కథను నరేట్ చేయాల్సింది. వయొలెన్స్.. వల్గారిటీ మోతాదు తగ్గించాల్సింది.

చివరగా: హిడింబ.. కొత్త కథలో మెరుపలు మరకలు

రేటింగ్-2.5/5



Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater

Tags:    

Similar News