ఫ్లాప్ హీరో సంపదలు రజనీ- బన్ని కంటే 3 రెట్లు!
హిందీ నటుడు వివేక్ ఒబెరాయ్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన , ఖరీదైన వాహనాల్లో ఒకటైన రోల్స్ రాయిస్ కల్లినన్‌ను కొనుగోలు చేసినప్పుడు మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చాడు.
సూపర్ స్టార్ రజనీకాంత్ నికర ఆస్తుల విలువ సుమారు 415 కోట్లు... రణబీర్ కపూర్ నికర ఆస్తి విలువ 350 కోట్లు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నికర ఆస్తుల విలువ 460 కోట్లు.. అయితే వీళ్లందరి కంటే మూడు రెట్లు అధిక సంపదలతో ఆశ్చర్యపరుస్తున్నాడు వివేక్ ఒబెరాయ్. ఈ హిందీ నటుడిని చాలా కాలం పాటు పరిశ్రమ అనధికారికంగా బహిష్కరించింది. అడపాదడపా మాత్రమే అతడు వెండితెరపై కనిపించాడు. కొన్ని హిట్లు మాత్రమే ఉన్నాయి. కానీ అతడు 1200 కోట్ల ఆస్తులతో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సొంతం చేసుకున్నారు.
హిందీ నటుడు వివేక్ ఒబెరాయ్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన , ఖరీదైన వాహనాల్లో ఒకటైన రోల్స్ రాయిస్ కల్లినన్‌ను కొనుగోలు చేసినప్పుడు మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చాడు. దీని ధర సుమారు రూ.12 కోట్లు. ఈ కొనుగోలు చాలా మందిని ఆశ్చర్యపరిచింది. వివేక్ కి సినిమాల్లేకపోయినా అతడికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేసారు. కానీ అతడు కేవలం సినిమాలతోనే కాదు.. వ్యాపార మార్గాల్లోను ఆర్జిస్తున్నాడనేది అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అతను గత రెండు దశాబ్దాలుగా నిర్మించిన వ్యాపార సామ్రాజ్యం గురించి కొద్దిమందికి వివరాలు తెలుసు.
2002లో వివేక్ ఒబెరాయ్ 'కంపెనీ' అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పుడు అతడు ఇండస్ట్రీలో మరో పెద్ద స్టార్ గా ఎదగడం ఖాయమని భావించారు. సాథియా, మస్తీ, ఓంకార వంటి హిట్‌లు రైజింగ్ స్టార్‌గా అతడి స్థానాన్ని పదిలం చేసాయి. అయినప్పటికీ అతడి వ్యక్తిగత జీవితం వేగంగా అతడి వృత్తిపరమైన విజయాలను కప్పివేసింది.
ఐశ్వర్యరాయ్‌తో లవ్ రిలేషన్ .. సల్మాన్ ఖాన్‌తో బహిరంగ ఫైటింగ్.. అతడి కెరీర్‌ని కీలక మలుపు తిప్పాయి. వివేక్ కి కాలక్రమేణా బాక్సాఫీస్ విజయాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ నుంచి అతడిని 'బహిష్కరించార'ని గుసగుసలు వినిపించాయి. అతడికి దక్కిన పాత్రలు కెరీర్ ప్రారంభానికి తగ్గ రేంజులో లేవు.
కానీ వివేక్ చాలా పట్టుదలతో సౌత్ లో ప్రయత్నించాడు. అదే సమయంలో 'రక్త చరిత్ర'(తెలుగు), లూసిఫర్ (మలయాళం) వంటి చిత్రాలతో ప్రాంతీయ సినిమాల్లో అవకాశాలను పొందాడు. ఇన్‌సైడ్ ఎడ్జ్ వంటి వెబ్ సిరీస్‌తో తిరిగి ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు. అయినప్పటికీ అతని స్టార్ రేంజుకు తగ్గట్టు తిరిగి కంబ్యాక్ కలేకపోయాడు. కెరీర్ పట్టాలు తప్పినప్పటి నుండి పూర్తిగా కోలుకోలేకపోయాడు.
అయితే వివేక్ ఒబెరాయ్ చాలా మేధావి. అతడు స్వతహాగా బిజినెస్‌మేన్. నటుడు కాక ముందే వ్యాపారంలో నిష్ణాతుడు. డబ్బును ఎలా పదింతలు చేయాలో తెలిసిన నిబద్ధత కలిగినవాడు. అందుకే అతడు నిశ్శబ్దంగా ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని తీర్చిదిద్దాడు. అది ఇప్పుడు భారతదేశంలోని అత్యంత సంపన్న నటులలో ఒకడిగా అతడిని ఉంచింది. ది స్టేట్స్‌మన్ కథనం ప్రకారం.. అతడి నికర ఆస్తుల విలువ రూ.1200 కోట్లు.
వివేక్ నికర సంపద బాలీవుడ్ దిగ్గజ హీరో రణబీర్ కపూర్.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి ప్రముఖుల ఆస్తులను అధిగమించింది. ఒబెరాయ్ సంపద కేవలం అతడి నటనా వృత్తి నుంచి మాత్రమే వచ్చినది కాదు. అతడి వ్యూహాత్మక పెట్టుబడులు, వ్యవస్థాపక వెంచర్ల ఫలితంగా ఇంతటి సామ్రాజ్యం ఏర్పడింది.
వివేక్ తన 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు? అన్నది అందరినీ ఆశ్చర్యపరిచే ప్రశ్న. అతడి ఆర్థిక విజయం వెనక కెరీర్ ప్రారంభంలోనే వినోద పరిశ్రమ వెలుపల పెట్టుబడి ఎలా పెట్టాలి? అనే అతడి దూరదృష్టి వల్ల సాధ్యమైంది. అతడి సంపద ప్రధానంగా రెండు భారీ వ్యాపారాల ద్వారా వస్తోంది. దీనికి తోడు వివేక్ UAEలోని రస్ అల్ ఖైమాలోని అల్ మార్జన్ ద్వీపంలో ఉన్న రూ.2,300 కోట్ల రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అయిన ఆక్వా ఆర్క్ వ్యవస్థాపకుడు. అతడు విద్య, ఆవిష్కరణలపై దృష్టి సారించే స్వర్నిమ్ విశ్వవిద్యాలయానికి సహ వ్యవస్థాపకుడు కూడా. వివేక్ పోర్ట్‌ఫోలియో అనేక స్టార్టప్‌లలో ఉంది. ఏంజెల్ ఇన్వెస్టర్‌గా వెంచర్ క్యాపిటల్‌లోకి విస్తరించింది. అతడి ఆదాయ మార్గాలు ఎంతో వైవిధ్యమైనవి.
వివేక్ కి నటనా రంగం కంటే వ్యాపార విజయం ఆర్థిక భద్రతను ఇచ్చింది. ఇది స్వీయ నిబంధనలపై నటనను కొనసాగించడానికి అతడిని అనుమతించింది. ''నటన నా అభిరుచి.. వ్యాపారమే ఆదాయానికి దోహదపడుతుంది. ఇది నా అభిరుచిని పూర్తిగా కొనసాగించగలిగే స్థాయికి నన్ను తెచ్చింది. నేను ఆనందించని పనిని చేయమని అడిగితే లాబీకి నమస్కరిస్తాను.. ఏదైనా చేయమని బలవంతం చేయలేదు ఎవరూ!'' అని వివేక్ పేర్కొన్నారు.
అతడు ఆర్థిక స్వాతంత్య్రం ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. అందుకే నేను ప్రజలకు వారి ఆర్థిక స్వాతంత్య్రాన్ని నిర్మించుకోవాలని చెబుతూనే ఉన్నాను... డబ్బు మీ స్వేచ్ఛను కొనుగోలు చేయగలదు. ఇది శాంతి -భద్రత భావాన్ని సృష్టించగలదు.. అని కూడా వివేక్ వ్యాఖ్యానించాడు.
వ్యాపార సామ్రాజ్యం అభివృద్ధి చెందుతున్న క్రమంలోనే వివేక్ ఒబెరాయ్ నటనపై తన అభిరుచిని కొనసాగించాడు. అతడు చివరిసారిగా రోహిత్ శెట్టి 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'లో కనిపించాడు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. ఇది శెట్టి కాప్ యూనివర్స్ సిరీస్‌లో భాగం. 2022లో విడుదలైన తెలుగు చిత్రం ఖుదీరామ్ బోస్‌లోను నటించాడు.