మంటల్లో దహనమైన సూపర్‌స్టార్ల వందల కోట్ల ఆస్తులు
లాస్ ఏంజిల్స్(అమెరికా) శివారులో భయంకరమైన అడవి మంటలు హోరుగాలికి ఎగసిపడుతూ భవనాలను మింగేస్తున్నాయి.
లాస్ ఏంజిల్స్(అమెరికా) శివారులో భయంకరమైన అడవి మంటలు హోరుగాలికి ఎగసిపడుతూ భవనాలను మింగేస్తున్నాయి. ప్రజల్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. పసిఫిక్ పాలిసేడ్స్ (అటవీ మంటల) నుంచి ఖరీదైన పొరుగు ప్రాంతం ప్రస్తుతం విధ్వంసకర రీతిలో భీతావహ స్థితిలోకి జారిపోయింది. వేలాదిగా ప్రజల ఇండ్లతో పాటు, ఖరీదైన సెలబ్రిటీ ఎన్‌క్లేవ్ లలో మంటలు చెలరేగడంతో అది తీవ్ర భయాందోళనలకు దారి తీసింది.
మంటల్లో ఆహుతైన భారీ భవంతుల్లో చాలామంది హాలీవుడ్ ఏ-లిస్టర్ లు ఉన్నారు. బెన్ అఫ్లెక్, క్రిస్ ప్రాట్, రీస్ విథర్‌స్పూన్, మైల్స్ టెల్లర్‌లకు చెందిన నివాసాలు సహా ఈ ప్రాంతంలోని 10 వేల గృహాలు అటవీ మంటల్లో చిక్కుకున్నాయి. ఎంటీవీ హిట్ షో `ది హిల్స్`లో కనిపించిన రియాలిటీ టీవీ జంట స్పెన్సర్ ప్రాట్ - హెడీ మోంటాగ్‌ల కు చెందిన ఇల్లు కూడా కాలిపోయిందని కథనాలొస్తున్నాయి. దంపతులు వారి ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నారు. కానీ జరిగిన నష్టంతో కుంగిపోయారు. నటుడు జేమ్స్ వుడ్స్ తాను ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నట్లు వెల్లడించడంతో పొరుగున ఉన్న తన ఇంటి వారి పరిస్థితిని, వారి నరకయాతనను చిత్రీకరించి వీడియోను రిలీజ్ చేసారు. ఎటు చూసినా దహనానికి సంబంధించిన ఫోటోలు వీడియోలతో వెబ్ ఇప్పుడు హీటెక్కిపోతోంది.
హాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. హరికేన్-ఫోర్స్ గాలులు ఈ ప్రాంతాన్ని దహించేసాయి. ఈ గాలులతో పాటు వ్యాపించిన భీకరమైన మంటల దాడికి చాలా మంది విపరీతంగా ఝడిసిపోయారు. ప్రజలు సెలబ్రిటీలు తమ ఇండ్లు, కార్లను ఉన్నచోటే వదిలేసి పరుగులంకించుకున్నారు. చాలా కార్లు రోడ్లపైనే నిలిచిపోయాయి.
అగ్నిమాపక సిబ్బంది బిఎమ్‌డబ్ల్యూలు, టెస్లాస్, మెర్సిడెస్ వంటి ఖరీదైన మోడళ్లు సహా డజన్ల కొద్దీ వాహనాలను రోడ్డుకు ఒకవైపుకు నెట్టడానికి బుల్‌డోజర్‌లను ఉపయోగించవలసి వచ్చింది. చాలా కార్లు ఈ గడబిడలో నలిగిపోయాయి. గందరగోళంలో కార్ల నుంచి అలారంలు మోతెక్కించాయి. వేగంగా వ్యాపిస్తున్న మంటల కారణంగా దాదాపు 30వేల మంది ప్రజలను ఖాళీ చేయమని అగ్నిమాపక సిబ్బంది ఆదేశించారు. శక్తివంతమైన గాలులు చాలా దూరం వరకు మంటలు వ్యాపించడంతో వందలాది భవనాలు తగలబడటమే గాక, తీవ్రంగా నేలమట్టమయ్యాయి.
లాస్ ఏంజిల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు మాట్లాడుతూ.. ప్రజల్లో గందరగోళం నెలకొంది. తరలింపునకు అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరణాలు లేదా గాయాల గురించి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతానికి ఇంకా ప్రమాదం నుండి బయటపడలేదు అని తెలిపారు. అంతేకాదు రాకాసి గాలులు ఇకపైనా పెరిగేందుకు ఆస్కారం ఉందన్న ఆందోళనలు అలానే ఉన్నాయి.