NTR - ANR సలహాలు స్ఫూర్తితోనే ఎదిగాను: చిరంజీవి
ముఖ్యంగా బీచ్ లో వరుసగా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి మెగా ఫ్యాన్స్ చేసిన సందడి అంతా ఇంతా కాదు.
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి బీచ్ సొగసుల విశాఖ నగరంలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని విశాఖ పరిసరాల్లో మెగాభిమానుల సందడి దృశ్యాలు వైరల్ గా మారాయి. విశాఖ బీచ్ సహా నగరంలోని పలు చోట్ల మెగాస్టార్ బ్యానర్లు, ఫ్లెక్సీలు విరివిగా కనిపించాయి. ముఖ్యంగా బీచ్ లో వరుసగా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి మెగా ఫ్యాన్స్ చేసిన సందడి అంతా ఇంతా కాదు.
అయితే చిరు సడెన్ గా విశాఖకు ఎందుకు విచ్చేశారు? అంటే దానికి కారణం లేకపోలేదు. ఈరోజు వైజాగ్‌లో లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్‌ఆర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నిర్వహించిన కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి లెజెండరీ నటులు ఎన్టీఆర్ - ఏఎన్ఆర్ గురించి గొప్పగా మాట్లాడారు. ఆనాటి సీనియర్ ఎన్టీఆర్ సలహా ఈ రోజు తనకు తన కుటుంబానికి సహాయపడిందని వెల్లడించాడు. తాను ఖరీదైన కార్లపై మక్కువ పెంచుకుని వాటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుంటే, ఆ డబ్బును భూములు కొనేందుకు పెట్టుబడి పెట్టమని ఎన్టీఆర్ తనకు సలహా ఇచ్చినట్టు తెలిపారు. చిరంజీవి మాట్లాడుతూ -``నేను తొలినాళ్లలో ఫ్యాన్సీ కార్ల పై మక్కువ పెంచుకున్నాను. రెక్కల తరహా డోర్లు ఉన్న టయోటా కారుపై నా దృష్టి ఉండేది. కానీ ఎన్టీఆర్ గారు ఈ అల్యూమినియం ఫాయిల్ వాహనాలపై పెట్టుబడి పెట్టవద్దని, భూములు విరివిగా కొనుక్కోమని సలహా ఇచ్చారు. నేను ఆ రోజు ఆయన మాటలను నమ్మి భూములు కొన్నాను. ఈ రోజు నాకు, నా కుటుంబానికి మద్దతు ఇస్తున్నవి ఇవే. ఆయన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను`` అన్నారు. ఏఎన్నార్ నుంచి తాను ఎలా స్ఫూర్తి పొందారో కూడా చిరంజీవి చాలా గొప్పగా మాట్లాడారు. ``ఎన్టీఆర్ పతాక స్థాయికి ఎదగడం చూసి ఏఎన్ఆర్ గారికి కాస్త ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేదని మనం వినే ఉంటాం. కానీ ఆయన ఇది తనను లోపలి నుండి కాల్చనివ్వలేదు. బదులుగా తనను తాను మెరుగుపరచుకోవడానికి ఈ భావోద్వేగాన్ని ఉపయోగించారు. ANRని చూసి బలహీనతను శక్తిగా ఎలా మార్చుకోవాలో నేర్చుకోవాలి`` అన్నారు.
మెగాస్టార్ జీవిత చరిత్ర ఆయన రాస్తున్నారు:
మెగాస్టార్ చిరంజీవి జీవితంపై ఇప్పటికే ఎన్నో పుస్తకాలు, సంకలనాలు వెలువడ్డాయి. సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు చిరంజీవిపై ఇప్పటికే ఎన్నో పుస్తకాలు రాసారు. మరో సీనియర్ జర్నలిస్టు వినాయకరావు చిరుపై పుస్తకాన్ని ప్రచురించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి జీవిత చరిత్రను రాసే పనిని సీనియర్ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కి వదిలేస్తున్నట్లు చిరు ప్రకటించారు. మెగాస్టార్ తన స్వీయ జీవిత చరిత్రపై పనిచేయడానికి తనకు సమయం లేదని, అందుకే యండమూరికి బాధ్యతను వదిలేశానని చెప్పారు. ఇదే వేదికపై ఎన్టీఆర్ -ఏఎన్నార్ గురించి చిరు వ్యాఖ్యలు అహూతులను రంజింపజేసాయి.