#గుస‌గుస ఇళ‌య‌రాజాపై తిర‌గ‌బ‌డ్డారు!

ఇళయరాజా పంపిన లీగల్ నోటీసు తమకు ఇంకా అందలేదని మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలు ది న్యూస్ మినిట్‌తో చెప్పారు

Update: 2024-05-25 03:46 GMT

కమల్ హాసన్ నటించిన 'గుణ'లోని తన ఐకానిక్ పాట 'కన్మణి అన్బోడు కధలన్‌'ను అనుమ‌తి లేకుండా తమ చిత్రంలో ఉపయోగించుకున్నందుకు 'మంజుమ్మెల్ బాయ్స్' (మ‌ల‌యాళం) నిర్మాతలపై ఇసై జ్ఞాని ఇళయరాజా చట్టపరమైన చర్య తీసుకున్నారు. అయితే మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలు మాత్రం తమ సినిమాలో ఈ హిట్ సాంగ్‌ను ఉపయోగించుకునే హక్కును చట్టబద్ధంగా పొందామ‌ని పేర్కొంటూ కౌంటర్ ఇచ్చారు.

ఇళయరాజా పంపిన లీగల్ నోటీసు తమకు ఇంకా అందలేదని మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలు ది న్యూస్ మినిట్‌తో చెప్పారు. కానీ రెండు మ్యూజిక్ కంపెనీల నుంచి పాట రైట్స్ కొన్నామని స్పష్టం చేశారు. చిత్ర నిర్మాతలలో ఒకరైన షాన్ ఆంథోనీ వారితో మాట్లాడుతూ, ''ఒక సంస్థ తెలుగు వెర్షన్‌కు .. మరొకటి మిగిలిన భాషల హక్కులను కలిగి ఉన్నాయి. పాటను సొంతం చేసుకున్న సంగీత సంస్థల పిరమిడ్ అండ్ శ్రీదేవి సౌండ్స్ నుండి మేము హక్కులను పొందాము. వారు కేవలం తమిళ పాటకే కాకుండా మంజుమ్మెల్ బాయ్స్ విడుదల చేసిన అన్ని భాషల హక్కులను పొందామ‌ని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించిన సౌబిన్ షాహిర్ అతడి తండ్రి బాబు షాహిర్ చిదంబరం-దర్శకత్వం వ‌హించ‌డ‌మే కాకుండా నిర్మించారు.

ఇళయరాజా లీగల్ నోటీసు

ఈ వారం ప్రారంభంలో మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలకు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. అతడి న్యాయవాది శరవణన్ అన్నాదురై మీడియాతో మాట్లాడుతూ, ''అది నివాళి అయినా కాకపోయినా, మరొక చిత్రంలో ఎవరైనా మా పాటను ఉపయోగించినప్పుడు.. దానికి చట్టపరమైన విధానాలను అనుసరించాలి.. అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి'' అని పేర్కొన్నారు. ఇలాంటి వాటిని దోపిడీ మార్గంలో ఇతర వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంటే చట్టబద్ధంగా బాధ్యత వహించాలి. రచయిత లేదా సంగీత ద‌ర్శ‌కుడి నుండి అవసరమైన లేదా తగిన అనుమతి/లైసెన్స్‌ను పొందవలసి ఉంటుంది'' అని నోటీస్‌లో ఉంది.

పాట యజమాని ఇళయరాజా సమ్మతి లేకుండా లేదా రాయల్టీ లేదా లైసెన్స్ ఫీజు చెల్లించకుండా పాటను ఉపయోగించారు! అని న్యాయ‌వాది శరవణన్ తెలిపారు. సినిమాలో పాటను ఉపయోగించడం కొనసాగించడానికి నిర్మాతలు సరైన అనుమతి పొందాలని లేదా నోటీసు అందిన 15 రోజుల్లోగా దాన్ని తీసివేయాలని నోటీసులో కోరారు. వారు అలా చేయడంలో విఫలమైతే, మేము కాపీరైట్ చట్టం 1957 కింద పరిహారం తీసుకుంటాము అని శరవణన్ చెప్పారు.

ర‌జ‌నీకాంత్ పై ఇళయరాజా న్యాయ పోరాటం

ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెర‌కెక్కించిన కూలీ సినిమా నిర్మాతలకు ఇళయరాజా నోటీసులు కూడా జారీ చేశారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో, రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన 1983 తమిళ చిత్రం 'తంగ మగన్‌'లోని 'వా వ పక్కం వా' పాటలోని కొంత భాగాన్ని ఉపయోగించారు. అతడు ప్రైవేట్ రికార్డింగ్ కంపెనీ ఎకో రికార్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కూడా న్యాయ పోరాటంలో ఉన్నాడు. మద్రాసు హైకోర్టులో ప్ర‌స్తుతం ఇళ‌య‌రాజా స్వ‌ర‌ప‌రిచిన‌ 4500 పాటలపై హ‌క్కుల గురించి చ‌ర్చ సాగుతోంది.

Tags:    

Similar News