కంపేర్ చేయడం తప్పే.. కానీ ఇంకాస్త బెస్ట్ ఇచ్చుంటే!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఆ సినిమాలోని పాటలకు ఏఆర్ రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ అందించి అదరహో అనిపించారు.
అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరేటి లుక్కు మీరిస్తే దడా.. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే.. ఈ రెండు పాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ అవుతూనే ఉంటాయి. రీల్స్ కూడా కనిపిస్తుంటాయి. మరి ఈ రెండు పాటలు ఏ సినిమాలోనివో తెలుసు కదా? దాదాపు 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడులోని ఆ పాటలతోపాటు టెలిఫోన్ ధ్వని, తెప్పరిల్లి పోయాక, మాయా మశ్చీంద్ర సాంగ్స్ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఆ సినిమాలోని పాటలకు ఏఆర్ రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ అందించి అదరహో అనిపించారు. ఇప్పుడు భారతీయుడు-2 మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. శంకరే సీక్వెల్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా.. వచ్చే నెలలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కానీ ఇప్పటికీ భారతీయుడు సీక్వెల్ పై అంతగా బజ్ క్రియేట్ అవ్వలేదు.
మేకర్స్.. ఇప్పటికే సినిమా నుంచి పలు పోస్టర్లను విడుదల చేశారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ బాణీలు కట్టిన భారతీయుడు-2 ఆల్బమ్ ను చెన్నైలో గ్రాండ్ గా వేడుక నిర్వహించి మరీ రిలీజ్ చేశారు. కానీ నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదు. చాలామంది సాంగ్స్ బాగోలేదని కామెంట్లు పెడుతున్నారు. రెహమాన్ అందించిన మ్యూజిక్ తో కంపేర్ చేస్తున్నారు. భారతీయుడులోని అన్ని పాటలు కూడా బాగున్నాయని చెబుతున్నారు.
అప్పట్లో మ్యూజిక్ ఫీల్డ్ లో డేటీఎస్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆ సమయంలో రెహమాన్ సంగీతం అందించిన భారతీయుడు సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు వేరే లెవల్ లో రెస్పాన్స్ వచ్చింది. ఆడియో క్యాసెట్లు కొనుగోలు చేసి అరిగిపోయే వరకు సంగీత ప్రియులు విన్నారు. ఇప్పటికీ స్పాటిఫై వంటి యాప్స్ లో వింటూనే ఉన్నారు. దీంతో అంతా రెహమాన్, అనిరుధ్ కంపోజిషన్లు పక్కపక్కన పెట్టి పోలుస్తున్నారు.
ఇండస్ట్రీలో ఏ ఇద్దరి వర్క్ ను కూడా కంపేర్ చేసి చూడడం కరెక్ట్ కాదు. కానీ ఇండియన్-2 విషయంలో అనిరుధ్ నుంచి బెస్ట్ అవుట్ పుట్ ను ఆశించారు ఫ్యాన్స్. కానీ తమ అంచనాలకు తగ్గట్టు పాటలు లేవని అంటున్నారు. అయితే అనేక సాంగ్స్ తో అనిరుధ్ ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ ను వేరే లెవల్ లో అలరించారు. కానీ భారతీయుడు-2 సినిమా విషయంలో ఇంకాస్త బెస్ట్ గా ట్రై చేయాల్సింది. మరి జులై 12వ తేదీన ఆ మూవీ రిలీజ్ అయ్యాక ఏం అవుతుందో చూడాలి.