ప్రమాద ఘంటికలు మోగిస్తున్న రోస్టింగ్‌ కల్చర్‌!

కొండ కోనల్లో ఉండేవారికి కూడా నేడు స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. వాటికి అంతే స్థాయిలో ఇంటర్నెట్‌ సౌకర్యం లభిస్తోంది.

Update: 2024-07-09 16:30 GMT

మనదేశంలో మారుమూల గ్రామాల్లో ప్రాథమిక సౌకర్యాలైన రోడ్లు, తాగునీరు, విద్యుత్‌ లైట్లు, పాఠశాల, ఆస్పత్రి వంటివి ఉన్నాయో, లేదో కానీ స్మార్ట్‌ ఫోన్లు, వాటికి అత్యంత వేగంతో కూడిన ఇంటర్నెట్‌ వసతులు మాత్రం ఉన్నాయి. కొండ కోనల్లో ఉండేవారికి కూడా నేడు స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. వాటికి అంతే స్థాయిలో ఇంటర్నెట్‌ సౌకర్యం లభిస్తోంది.

దీంతో అందరూ సోషల్‌ మీడియా మాధ్యమాలు.. ఫేస్‌ బుక్, ఇనస్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్, మోజో, షేర్‌ చాట్‌ వంటివాటిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోస్టింగ్‌ కల్చర్‌ విపరీతంగా పెరిగిపోతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఏదైనా రంగానికి చెందిన వ్యక్తి మంచి స్థాయిలోకి వస్తున్నా, అద్భుత విజయాలు సాధిస్తున్నా అలాంటివారిని టార్గెట్‌ గా చేసుకుని బూతులు, అసభ్య దూషణలతో కొందరు విరుచుకుపడుతున్నారు. ప్రత్యేకంగా మీమ్‌ ప్రజలు సృష్టించడం, అందులో వారిని వెటకారం చేయడం, బూతులు తిడుతూ కామెంట్లు పెట్టడం, అవమానించడం వంటివి చేస్తున్నారు.

ఇప్పుడు సినిమాలు.. ముఖ్యంగా ఓటీటీల్లో వస్తున్న కంటెంట్‌ పై ఎవరి నియంత్రణ ఉండటం లేదు. ఆయా సినిమాలు, వెబ్‌ సిరీసుల్లో బూతులు, అసభ్య సన్నివేశాలు యథేఛ్ఛగా ప్రసారమవుతున్నాయి. వీటిని చూసి యువత వక్రమార్గం పడుతోంది.

ఎవరైనా ఏ రంగంలో అయినా పాపులారిటీ సాధిస్తుంటే వారిని లక్ష్యంగా చేసుకుని.. వారి శారీరక లోపాలను ఎత్తిచూపుతూ కించపరుస్తున్నారు. సోషల్‌ మీడియా మాధ్యమాల్లో ఎక్కడ చూసినా అసభ్యకర కామెంట్లు, మీమ్స్‌ కనిపిస్తున్నాయి.

బాగా చదువుకున్నవారు, ఉన్నత కుటుంబాల నుంచి వచ్చినవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా రోస్టింగ్‌ కల్చర్‌ కు అలవాటుపడుతున్నారు. తమకు నచ్చనివారిని లక్ష్యంగా బూతుల దాడి చేస్తున్నారు. అసభ్యకర కామెంట్లతో చెలరేగుతున్నారు.

భారతదేశంలో రోస్టింగ్‌ అనేది.. ముంబై ఆధారిత కామెడీ కంపెనీ ఏఐబీ కంపెనీ ద్వారా ప్రధాన స్రవంతిలోకి వచ్చింది. తొలిసారి 2015లో యూట్యూబ్‌ లో దీన్ని విడుదల చేశారు. ఇది బాలీవుడ్‌ సెలబ్రిటీలు.. అర్జున్‌ కపూర్, రణవీర్‌ సింగ్, కరణ్‌ జోహార్‌ వంటి బాలీవుడ్‌ ప్రముఖులను ఉద్దేశించి ఉండటంతో త్వరగానే యువత దృష్టిని ఆకర్షించింది.

తర్వాత కాలంలో రోస్టింగ్‌ అనేది ఒక ప్రత్యేక హాస్య శైలిగా అంగీకరించబడింది. కంటెంట్‌ క్రియేటర్లు ఈ జానర్‌ లోకి వేగంగా వస్తున్నారు. ఒక పదేళ్ల బాలుడు అజేయ నగర్‌ .. ‘క్యారీమి నాటి’ పేరుతో విడుదల చేసిన ఐదు నిమిషాల వీడియో క్లిప్‌ వైరల్‌ అయ్యింది. 2021 నుంచి కంటెంట్‌ క్రియేటర్లు రోస్టింగ్‌ పైన వీడియోలు చేయడం ఎక్కువైంది.

అయితే ఇది కూడా అసహ్యకరమైన హాస్యమని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అయినప్పటికీ కంటెంట్‌ క్రియేటర్లు, మీమ్స్‌ పేజీలు రూపొందించేవారు వెనక్కి తగ్గడం లేదు.

Tags:    

Similar News