నాని కాంబో.. ఆ యువ దర్శకుడితో లేనట్లేనా?
ఇప్పటివరకు 100 కోట్ల క్లబ్‌ను టచ్ చేసిన నాని, ఇప్పుడు తన టార్గెట్‌ను నేరుగా 200 కోట్లకు పెట్టాడు.
నేచురల్ స్టార్ నాని తన మార్కెట్ రేంజ్ ను మెల్లమెల్లగా పెంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. 'దసరా', 'హాయ్ నాన్న', 'సరిపోదా శనివారం' వంటి వరుస హిట్స్‌తో నాని తన రేంజ్‌ను మల్టీపుల్‌గా పెంచుకున్నాడు. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్లు రాబట్టి, నేచురల్ స్టార్ మార్కెట్‌ను కొత్త లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఇప్పటివరకు 100 కోట్ల క్లబ్‌ను టచ్ చేసిన నాని, ఇప్పుడు తన టార్గెట్‌ను నేరుగా 200 కోట్లకు పెట్టాడు.
రాబోయే రోజుల్లో నాని కాంబినేషన్లను చూస్తుంటే ఈజీగా 300 కోట్ల మార్క్‌ను దాటుతాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా తగిలితే ఈ లెక్క మరింత పెరగడం ఖాయం. ప్రస్తుతం నాని ఎక్కువగా డిఫరెంట్ కాన్సెప్ట్‌లను చేసే దర్శకులవైపు దృష్టి పెట్టాడు. ఎమోషనల్, మాస్, పాన్ ఇండియా కాన్సెప్ట్‌లు కలిగిన సినిమాలను ఎంచుకుంటూ తన రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నాడు.
ప్రస్తుతం నాని ‘హిట్ 3’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. విశ్వక్ సేన్‌తో హిట్ ఫ్రాంచైజీ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఫ్రాంచైజీ నానికి వచ్చింది. ఇది నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ అని సమాచారం. ఈ సినిమా ద్వారా నాని పాన్ ఇండియా రేంజ్‌లో మరింత బలంగా నిలబడాలని ప్లాన్ చేస్తున్నాడు. అటు ‘హిట్ 3’ కంటెంట్ పరంగా, మేకింగ్ పరంగా పక్కా ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతుందనే టాక్ ఉంది.
ఇక నాని లైనప్‌లో మరో బిగ్ ప్రాజెక్ట్ ఉంది. ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, తమిళ దర్శకుడు సీబీ చక్రవర్తితోనూ ఒక సినిమా లైన్‌లో ఉంది. అయితే, నాని యువ దర్శకుడు సుజిత్‌తో కూడా ఒక సినిమాను ప్లాన్ చేశాడు. పవన్ కళ్యాణ్‌తో ‘OG’ పూర్తయిన తర్వాత సుజిత్ నాని కోసం ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రిపేర్ చేశాడు. కానీ బడ్జెట్ సమస్యల వల్ల ఈ ప్రాజెక్ట్ హోల్డ్‌లో పడినట్లు సమాచారం.
సుజిత్ చెప్పిన కాన్సెప్ట్ నానికి బాగా నచ్చిందట. అందుకే ఎలాగైనా ఆ సినిమా చేయాలని చాలా ఆసక్తి చూపించాడని సమాచారం. కానీ ఎందుకో ఫైనల్‌గా ఆ ప్రాజెక్ట్ సెట్టవ్వడం లేదు. ఇప్పుడు నాని లైనప్‌లో శేఖర్ కమ్ముల ఎంట్రీ ఇచ్చారు. కమ్ముల చెప్పిన స్టోరీ నానికి నచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ తో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘కుబేర’ పూర్తయిన తర్వాత నాని సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది.
ఇక సుజిత్ ప్రాజెక్ట్ భవిష్యత్తులో జరుగుతుందో లేదో గానీ, ఇప్పట్లో మాత్రం ఆ సినిమా ఉండకపోవడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే శేఖర్ కమ్ముల ‘కుబేర’ కోసం చాలా సమయం తీసుకుంటున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తవగానే నానితో సినిమా ప్రారంభించే అవకాశం ఉంది. నాని, కమ్ముల కాంబోకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రాబోతోందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.