పూజా హెగ్డే ఎక్కువగా ఊహించుకుంటుందా..!

టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే మూడు సంవత్సరాలుగా ఒక్క తెలుగు సినిమాలోనూ నటించలేదు.;

Update: 2025-03-25 07:12 GMT

టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే మూడు సంవత్సరాలుగా ఒక్క తెలుగు సినిమాలోనూ నటించలేదు. ఈమె చివరిగా 'ఆచార్య'లో గెస్ట్‌ రోల్‌లో కనిపించగా, ఎఫ్ 3 లో ఐటెం సాంగ్‌లో కనిపించింది. హీరోయిన్‌గా నటించి దాదాపు ఐదేళ్లు అవుతుంది. టాలీవుడ్‌కి పూజా హెగ్డే దాదాపుగా దూరం అయినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా దక్కిన స్టార్‌డంతో కోలీవుడ్‌, బాలీవుడ్‌లోనూ పూజా హెగ్డే ఆఫర్లు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్‌లో మూడు సినిమాలు, హిందీలో రెండు సినిమాలను చేస్తుంది. నటిగా ప్రస్తుతం ఫుల్‌ బిజీగా ఉన్నా టాలీవుడ్‌లో నటించడం లేదనే అసంతృప్తి ఫ్యాన్స్‌లో ఉంది.

హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో పూజా హెగ్డే గురించి కొందరు కావాలని, డబ్బులు ఖర్చు చేసి మరీ తప్పుడు ప్రచారం చేశారట. ఈ విషయాన్ని స్వయంగా పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ.. నా ఎదుగుదలను తట్టుకోలేక కొందరు నాపై తప్పుడు ప్రచారం చేయించారు. సోషల్‌ మీడియాలో నాపై ట్రోల్స్ చేయించారు. అందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు నాకు తెలిసింది. నాపై వారు చేసిన ట్రోలింగ్‌కు చాలా బాదేసింది. ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక క్షోభను అనుభవించారు. నా తల్లిదండ్రుల బాధ చూడలేక ట్రోలింగ్‌ ఆపమని విజ్ఞప్తి చేస్తే డబ్బులు డిమాండ్ చేశారని పూజా షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.

నేను ఎవరికీ చెడు చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అయినా ఎందుకు కోట్లు ఖర్చు చేసి మరీ నాపై ట్రోలింగ్‌ చేయించారు అనేది అర్థం కాలేదని పూజా హెగ్డే ఆవేదన వ్యక్తం చేసింది. తనపై వస్తున్న ట్రోల్స్‌ను పట్టించుకోకుండా కెరీర్‌పై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నాను. తన గురించి జరిగిన తప్పుడు ప్రచారం గురించిన నిజానిజాలు తప్పకుండా బయటకు వస్తాయనే నమ్మకంను పూజా హెగ్డే వ్యక్తం చేసింది. తనను కోట్ల రూపాయలు ఖర్చు చేసి ట్రోల్‌ చేయిస్తున్నారు అంటూ పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు షాకింగ్‌గా ఉన్నాయని, అయినా ఆమెను ట్రోల్‌ చేయించాల్సిన అవసరం ఎవరికి ఉందంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో పూజా హెగ్డే ఎక్కువ ఊహించుకుంటుందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి ఏదో ఒక సమయంలో ట్రోల్స్ తప్పవు. అందరు హీరోయిన్స్‌ ఏదో ఒక సమయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. కనుక పూజా హెగ్డే ను కావాలని ఖర్చు చేసి ట్రోల్‌ చేసి ఉండక పోవచ్చు అనేది కొందరి అభిప్రాయం.

ఎవరు ఎంత ట్రోల్‌ చేసినా, కెరీర్ ఖతం అయిందని భావించినా బుట్ట బొమ్మ పూజా హెగ్డే తిరిగి పుంజుకుంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో సూర్యకు జోడీగా నటిస్తున్న రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. రజనీకాంత్‌ కూలీ సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించబోతుంది. ఇక విజయ్ చివరి సినిమా జన నాయగన్‌ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవలే కాంచన 4 సినిమాలోనూ రాఘవ లారెన్స్‌కు జోడీగా నటించే అవకాశం ను సొంతం చేసుకుంది.

కోలీవుడ్‌లోనే ఈ నాలుగు సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతుంది. మరో వైపు హిందీలో ఈమె ఇటీవల దేవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయినా చేతిలో మరో రెండు హిందీ సినిమాలు ఉన్నాయి. కోలీవుడ్‌లో చేస్తున్న సినిమాలు హిట్ అయితే కచ్చితంగా టాలీవుడ్‌లో మళ్లీ ఆఫర్లు దక్కించుకోవడం ఖాయం అని కొందరు అంటున్నారు. మరి పూజా హెగ్డే టాలీవుడ్‌లో తిరిగి బిజీ అయ్యేనా అనేది కాలమే నిర్ణయించాలి.

Tags:    

Similar News