నిర్మాత విశ్వప్రసాద్ కు అమెరికాలో ఘన సత్కారం
సినిమాల పరంగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా పవన్ తో గుడ్ రిలేషన్ ఉంది.
టాలీవుడ్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ.. వరుస సినిమాలను నిర్మిస్తూ దూసుకుపోతోంది. మిస్టర్ బచ్చన్, స్వాగ్, రాజా సాబ్, మిరాయ్ తోపాటు మరెన్నో చిత్రాలను రూపొందిస్తోంది. అగ్ర నిర్మాణ సంస్థగా సత్తా చాటుతోంది. అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓనర్ టీజీ విశ్వప్రసాద్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మంచి బాండింగ్ ఉన్న విషయం తెలిసిందే. సినిమాల పరంగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా పవన్ తో గుడ్ రిలేషన్ ఉంది.
అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి.. సినీ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ చేస్తున్న వారిలో విశ్వ ప్రసాద్ కూడా ఒకరు. వెనకుండి బాగా సపోర్ట్ చేశారు. 2018లో పవన్ జనసేన పార్టీ తరఫున మానిఫెస్టో విడుదల చేసిన నాటి నుంచి ఈరోజు వరకు మద్దతు పలుకుతూనే ఉన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో జనసేన ప్రవాస గర్జన పేరుతో అమెరికాలో పవన్ కు మద్దతుగా ప్రచారం చేశారు. అలా ఎన్నికల్లో పవన్ భారీ విజయం సాధించడం వెనుక కీలక పాత్ర పోషించిన వారిలో ఆయన కూడా ఒకరు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చాక.. తాజాగా తొలిసారి అమెరికాలోని సియాటిల్ కు వెళ్లారు విశ్వప్రసాద్. దీంతో ఆయనను విమానాశ్రయంలో జనసేన మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత శ్రీదేవి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనను సత్కరించారు. ఈ వేడుకలో జన సైనికులతో పాటు తెలుగుదేశం మద్దతుదారులు కూడా పాల్గొన్నారు.
అయితే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విశ్వ ప్రసాద్ మాట్లాడారు. పటిష్టమైన సమన్వయం వల్లే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి విజయం సాధించిందని తెలిపారు. తెలుగుదేశం, జనసేన మద్దతుదారులు ఇదే స్ఫూర్తితో, ఆత్మీయతతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు విశ్వప్రసాద్. ప్రస్తుతం విశ్వప్రసాద్ సత్కారానికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సియాటిల్ లో జరిగిన ఈ వేడుకలో జనసేన మద్దతుదారులు సుంకరి శ్రీరామ్, శ్రీకాంత్ మొగరాల, సుహాగ్ గండికోట, వినోద్ పర్ణ, రామ్ కొట్టి, తెలుగుదేశం మద్దతుదారులు మనోజ్ లింగ, రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. అయితే ఏపీలో కూటమి విజయం సాధించాక.. సినీ పరిశ్రమకు చెందిన అనేక మందిని పిలిచి ఓపెన్ గా సంబరాలు నిర్వహించారు విశ్వప్రసాద్. జనసేన విజయానికి పాటుపడ్డ పలువురిని సత్కరించారు.