ఒక‌టి కాదు..మ‌రో రెండు..మూడు `యానిమ‌ల్` తీయండి!

`యానిమల్‌ చిత్ర దర్శకుడిని నేను ఏమాత్రం విమర్శించడం లేదు. ప్రజాస్వామ్య దేశంలో నచ్చిన చిత్రాన్ని తెరకెక్కించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.

Update: 2024-03-18 05:53 GMT

`యానిమల్` ని ఆ స్టార్ రైట‌ర్ ఇంకా వెంటాడుతూనే ఉన్నారా? ముగిసిపోయిన స‌మ‌స్య‌ని మ‌ళ్లీ త‌ట్టి లేపుతున్నారా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తోంది. `యానిమ‌ల్` రిలీజ్ అనంత‌రం ద‌ర్శ‌కుడు సందీప్ వంగ‌...బాలీవుడ్ సీనియ‌ర్ ర‌చ‌యిత జావెద్ అక్త‌ర్ మ‌ధ్య వివాదం త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా అస‌భ్య‌క‌ర స‌న్నివేశాల్ని ఉద్దేశించి జావెద్ చేసిన వ్యాఖ్య‌ల‌కు అంతే ధీటుగాను సందీప్ స‌మాధానం ఇచ్చాడు. ఈ క‌థ అంతా జ‌రిగి నెల‌లు గ‌డుస్తోంది. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మ‌రోసారి జావెద్ అక్త‌ర్ యానిమ‌ల్ గురించి మాట్లాడారు.


`యానిమల్‌ చిత్ర దర్శకుడిని నేను ఏమాత్రం విమర్శించడం లేదు. ప్రజాస్వామ్య దేశంలో నచ్చిన చిత్రాన్ని తెరకెక్కించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఒక్కటి కాకపోతే మరో రెండు మూడు ‘యానిమల్‌’ చిత్రాలు చిత్రీకరించుకోమనండి. నా బాధ అంతా ప్రేక్షకుల గురించే. నేను చేసిన వ్యాఖ్యలపై అతడు మాట్లాడినందుకు ధన్యవాదాలు. 53 ఏళ్ల నా సినీ కెరీర్‌లో ఆయనకు ఎక్కడా అసభ్య సన్నివేశాలు కనిపించలేదు.. మాటలు వినిపించలేదు. అందుకే ఆయన నా తనయుడు ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మించిన `మిర్జాపూర్‌`ను ఉదాహరణగా చెబుతున్నాడు.

అందులో ఫర్హాన్‌ యాక్ట్‌ చేయలేదు. దానికి దర్శకత్వం వహించలేదు. వేరే వాళ్లతో కలిసి నిర్మించాడంతే` అని అన్నారు. దీంతో స‌మ‌సిపోయిన వివాదాన్ని మ‌ళ్లీ తెర‌పైకి తెచ్చిన‌ట్లు అవుతుంది. `యానిమ‌ల్` రిలీజ్ అనంత‌రం ఓ కార్యక్రమంలో పాల్గొన్న జావేద్‌ అక్తర్‌ ఆ చిత్రంపై విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి చిత్రాలు ప్రేక్షకులకు ఏం సందేశాలు ఇస్తున్నాయని ప్రశ్నించారు.

మ‌హిళ‌ల్ని తక్కువ చేసి చూపించే చిత్రాలు సూపర్‌ డూపర్‌ హిట్‌ అందుకోవడం నిజంగా ప్రమాద కరమన్నారు. దీంతో సందీప్ రెడ్డి ఆ వ్యాఖ్య‌ల్ని అంతే ధీటుగా ఖండించాడు. `మీర్జాపూర్` నిర్మించిన సమ‌యంలో ఇదే విష‌యాన్ని ఆయ‌న త‌న‌యుడు ప‌ర్హాన్ అక్త‌ర్ కి ఎందుకు చెప్ప‌లేదు? ఆ సిరీస్ లో చాలా అస‌భ్య పదాలున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ఆ సినిమా చూడ‌లేదు. ఆయ‌న కుమారుడు ఎలాంటి సినిమా తీసాడో ఎందుకు ప‌రిశీలించ‌లేద‌ని మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. మ‌రి జావెద్ తాజా వ్యాఖ్య‌లపై సందీప్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News