మందేస్తే నేను మనిషిని కాదు!
ఈ నేపథ్యంలో తాజాగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
బాలీవుడ్ సంచలనం జావెద్ అక్తర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కొంత కాలంగా వివాదాల్లో అతిడి పేరు ముందు లైన్ లో కనిపిస్తుంది. సెలబ్రిటీ వివాదాల్లో వేళ్లు...కాళ్లు పేడుతూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఒకప్పుడు రైటర్ గా యమా బిజీగా ఉన్న జావెద్ ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయలేదు. గతేడాది కొన్ని సినిమాలకు పనిచేసారు. అప్పటి నుంచి మళ్లీ కొత్త ప్రాజెక్ట్ లేవి రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఎవరూ చెప్పుకోనివి జావెద్ ఎంతో ఓపెన్ గా షేర్ చేసారు. ' నేను తాగితే మనిషి లా ఉండలేను. రాక్షసుడిలా మారిపోతాను. మందులో ఏం కలుపుతారోగానీ. తాగగానే కోపం తన్నుకొచ్చేస్తుంది. ఆ మందు మత్తులో పడి పదేళ్లు కెరీర్ నే వదిలేసాను. తాగిన తర్వాత ప్రమాదకరంగా మారతాను. నాలో రాక్షసుడు బయటకు వస్తాడు. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు పూర్తిగా మందు మానేసాను.
1991 జులై 31న చివరి సారిగా తాగాను. అప్పటి నుంచి మళ్లీ మందు జోలికి వెళ్లలేదు. కానీ యుక్త వయసులో మందుకు బానిసై చాలా జీవితాన్నినాశనం చేసుకున్నాను. వృద్ధా చేసిన పదేళ్లలో ప్రెంచ్, పర్షియా వంటి భాషలు నేర్చుకోవడమో, సంగీతం నేర్చుకోవడమో చేసి ఉంటే బాగుండేది. ఏదైనా అనుభవం అయితేనే తెలిదయంటారు. కానీ ఆ అనుభవంలో చాలా జీవితాన్ని కోల్పోతామన్నది యువత గుర్తు పెట్టుకోవాలి.
ఇప్పుడు పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగింది. యువత చెడు అలవాట్లకు చాలా సులభంగా కనెక్ట్ అవుతున్నారు. రకరకరాల మత్తు పదార్దాలు అందుబాటులో ఉన్నాయి. వాటి జోలికెళ్లి బానిసలుగా మారొద్దు. జీవితం ఎంతో విలువైనది. బంగారు భవిష్యత్ ని నాశనం చేసుకోవద్దు ' అని హితవు పలికారు. జావెద్ అక్తర్ చివరిగా 'ది అర్చీస్', 'డుంకీ', ' కో గయే హమ్ కహన్' చిత్రాలకు పనిచేసారు.