జిగ్రా ట్రైలర్: తమ్ముడిని కాపాడేందుకు అక్క అడ్వెంచర్
రచయిత కం దర్శకుడు వాసన్ బాలా ఈ భారీ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు.
అక్కా - తమ్ముడు సెంటిమెంట్ కథలు కొంత తక్కువే. అన్నా చెల్లెళ్ల కథలు, తండ్రి కొడుకుల ఎమోషనల్ కథలు, అక్కా చెల్లెళ్ల కథలు చాలా తెరకెక్కినా కానీ భారతీయ సినిమాల్లో అక్కా తమ్ముడు సెంటిమెంట్ తో సినిమాలు తక్కువే. అక్క కోసం తమ్ముడు చేసే సాహసాలతో ఏవో కొన్ని సీన్లతోనే ఎక్కువగా సినిమాలొచ్చాయి. కానీ ఇప్పుడు తమ్ముడి కోసం అక్క త్యాగాలు, కష్టంలో ఉన్న సోదరుడిని కాపాడుకునేందుకు ప్రమాదకర విన్యాసాలకు పాల్పడే ఒక గొప్ప అక్క కథను తెరపైకి తెస్తున్నారు.
రచయిత కం దర్శకుడు వాసన్ బాలా ఈ భారీ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు. జిగ్రా ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రంలో సోదరుడైన వేదాంగ్ రైనాను రక్షించడానికి అలియా భట్ దేనికైనా సిద్ధమవుతుంది. ఈ చిత్రం సోదరుడితో తన సోదరి అనుబంధానికి సంబంధించిన కథతో తెరకెక్కింది. ఒక సోదరి తన తమ్ముడిని రక్షించుకోవడానికి ఎంత కష్టపడుతుందో ట్రైలర్ రివీల్ చేసింది. జిగ్రా అక్టోబర్ 11న థియేటర్లలోకి రానుంది.
మూడు నిమిషాల ట్రైలర్ ఆద్యంతం రక్తి కట్టిస్తోంది. అర్థరాత్రి ఫోన్ కాల్ రాగానే అలియా నిద్రలేవడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. తన సోదరుడు వేదాంగ్ రైనా తీవ్రమైన కష్టంలో ఇరుక్కున్నాడు. విదేశీ అధికారులు అతడిని అరెస్ట్ చేసి దేనికో తీవ్రంగా హింసిస్తున్నారు. తన సోదరుడు వేరే దేశంలో అరెస్టయ్యాడని తెలుసుకున్నప్పుడు ఆలియా ఎమోషనల్ అవుతుంది.. అక్కడి నుంచి ప్రతిదీ తన చేతుల్లోకి తీసుకుని అతడిని రక్షించాలని నిశ్చయించుకుంటుంది. ఆలియా పాత్ర తన సోదరుడిని రక్షించడానికి ఎలాంటి సాహసాలు చేసిందనేది మిగతా సినిమా. ఒక సన్నివేశంలో తన మణికట్టును కత్తితో కోసుకునేందుకు సిద్ధమవుతుంది. ఒక ఖైదీని ఇలాంటి వైద్య పరిస్థితుల్లో వారి కుటుంబాన్ని సందర్శించవచ్చా? అని ఆలియా అడుగుతుంది. ఈ సన్నివేశం తన సోదరుడిని ఎలాగైనా రక్షించాలనే తెగింపును హైలైట్ చేసింది. ట్రైలర్ ఆద్యంతం ఆలియా మ్యాజిక్ వర్కవుటైంది. ఈ చిత్రంలో సెన్సిటివ్ ఆలియా యాక్షన్ క్వీన్ గా మెప్పించబోతోందనేది అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్.
కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి ఆలియా స్వయంగా `జిగ్రా`ను నిర్మించింది. ఆలియా -వేదాంగ్‌తో పాటు ఈ క్రైమ్-థ్రిల్లర్‌లో మనోజ్ పహ్వా కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించారు.