జైలు నుంచి బయటకు జానీ.. ఆ రెడ్ టవల్ ఎందుకు?

అయితే జానీ మాస్టర్.. రెడ్ కలర్ టవల్ వేసుకుని జైలు నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Update: 2024-10-25 17:28 GMT

అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఇటీవల బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. 36 రోజుల పాటు చంచల్ గూడ జైలులో ఆయన.. మధ్యంతర షరతులతో కూడిన బెయిల్ రావడం వల్ల శుక్రవారం కారాగారం నుంచి బయటకు వచ్చారు. తన సన్నిహితులతో కలిసి కారులో హైదరాబాద్ లోని తన ఇంటికి వెళ్లారు జానీ మాస్టర్.

అయితే జానీ మాస్టర్.. రెడ్ కలర్ టవల్ వేసుకుని జైలు నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు ఎర్రటి టవల్ ట్రేడ్ మార్క్ అన్న విషయం తెలిసిందే. దీంతో జానీ మాస్టర్.. జైలు నుంచి అలా బయటకు రావడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో జానీ మాస్టర్.. ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

వాస్తవానికి జానీ మాస్టర్.. జనసేన పార్టీకి చెందిన వారే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. నెల్లూరు జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానంలో ఆయన పోటీ చేస్తారంటూ అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. కానీ ఆయన పోటీ చేయలేదు. జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున మాత్రం ప్రచారం నిర్వహించారు. కానీ లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాక.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది జనసేన. ఇప్పుడు రెడ్ టవల్ వేసుకుని ఆయన జైలు నుంచి బయటకు రావడం చర్చనీయాంశమైంది.

జానీ మాస్టర్ తనపై లైంగికదాడికి పాల్పడినట్లు బాధితురాలు.. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ ను రాజేంద్రనగర్‌ ఎస్‌ వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్‌ తీసుకుని.. హైదరాబాద్‌ కు తీసుకువచ్చారు. ఆ తర్వాత ఇక్కడ కోర్టులో హాజరుపరచగా.. రిమాండ్ విధించింది. దీంతో జానీ మాస్టర్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.

అప్పటి నుంచి జైలులో ఉన్న ఆయనకు రీసెంట్ గా తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల వ్యక్తిగత బాండ్‌ తో పాటు మరో రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. జానీ మాస్టర్‌ గానీ, అతడి కుటుంబ సభ్యులు గానీ బాధితురాలి విషయంలో జోక్యం చేసుకోరాదని క్లారిటీగా చెప్పింది. సాక్షులను ఏ విధంగా కూడా ప్రభావితం చేయకూడదని తెలిపింది. సాక్ష్యాలను తారుమారు చేయరాదని, విచారణకు సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది.

Tags:    

Similar News