జూహీ చావ్లా త‌ర్వాత సంప‌న్న న‌టి ఆస్తుల విలువ‌?

సుమారు 4600కోట్ల రూపాయ‌ల నిక‌ర సంప‌ద‌ల‌తో జూహీ చావ్లా దేశంలోనే నంబ‌ర్ వ‌న్ ధ‌నికురాలిగా అగ్ర‌ప‌థాన నిలిచారు.

Update: 2024-12-20 21:30 GMT

భార‌త‌దేశంలో ట్రెండింగ్‌లో ఉన్న టాప్‌10 క‌థానాయిక‌ల్లో ఎవ‌రూ అత్యంత సంప‌న్న నాయిక‌ల జాబితాలో లేరు. ప్రియాంక చోప్రా, దీపిక ప‌దుకొనే, కంగ‌న ర‌నౌత్, క‌త్రిన కైఫ్‌, క‌రీనా క‌పూర్, ఆలియా భ‌ట్ లాంటి స్టార్లు ఎంట‌ర్ ప్రెన్యూర్స్ గా త‌మ ఆస్తి ఐశ్వ‌ర్యాల‌ను పెంచుకుంటున్నా.. వీళ్లెవ‌రూ త‌న‌ను ట‌చ్ చేయ‌లేని స్థాయికి ఎదిగారు వెట‌ర‌న్ హీరోయిన్ జూహీ చావ్లా. సుమారు 4600కోట్ల రూపాయ‌ల నిక‌ర సంప‌ద‌ల‌తో జూహీ చావ్లా దేశంలోనే నంబ‌ర్ వ‌న్ ధ‌నికురాలిగా అగ్ర‌ప‌థాన నిలిచారు.

అయితే జూహీ చావ్లా త‌ర్వాత అత్యంత ధ‌నికురాలైన భారతీయ న‌టీమ‌ణి ఎవ‌రు? అంటే.. దానికి స‌మాధానం ఉంది. హురున్ రిచ్ లిస్ట్ 2024 ప్రకారం.. జూహీచావ్లా రూ. 4600 కోట్ల నికర ఆస్తుల‌తో నంబ‌ర్ వ‌న్ గా నిల‌వ‌గా, త‌న వ్యాపార భాగస్వామి షారుఖ్ ఖాన్ దేశంలోనే అత్యంత ధ‌నిక హీరోగా జాబితాలో నంబ‌ర్ వ‌న్ మేల్ స్టార్ గా ఉన్నారు.

జూహీ చావ్లా తర్వాత రెండో స్థానంలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఉన్నారు. దాదాపు రూ. 850 కోట్ల (100 మిలియ‌న్ డాల‌ర్లు) నిక‌ర ఆస్తుల‌తో ఐష్ దేశంలోనే నం.2 ధ‌నికురాలు. ఒక్కో సినిమాకి దాదాపు 12కోట్లు అందుకుంటున్న ఐశ్వ‌ర్యారాయ్ ఇటీవ‌ల పొన్నియ‌న్ సెల్వ‌న్ కోసం 30 కోట్ల ప్యాకేజీ అందుకున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. రియ‌ల్ ఎస్టేట్ స‌హా ప‌లు వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెట్టిన ఐశ్వ‌ర్యారాయ్ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ద్వారాను భారీగా ఆర్జిస్తున్నారు. అలాగే భర్త అభిషేక్ బచ్చన్ నికర ఆస్తుల‌ విలువ ఐశ్వ‌ర్యారాయ్ కంటే చాలా త‌క్కువ‌. అత‌డి ఆస్తుల నిక‌ర‌ విలువ 280కోట్లుగా ఉంద‌ని టైమ్స్ ఆఫ్ ఇండియా త‌న క‌థ‌నంలో పేర్కొంది. అభిషేక్ త‌న తండ్రి అమితాబ్ బ‌చ్చ‌న్ తో క‌లిసి రియ‌ల్ ఎస్టేట్ లో పెట్టుబ‌డులు పెడుతున్నారు.

ఐశ్వ‌ర్యారాయ్ కి దేశ విదేశాల్లో ఖ‌రీదైన ఆస్తులున్నాయి. దుబాయ్‌లోని హై ఎండ్ శాంక్చురీ ఫాల్స్‌లో విలాసవంతమైన అపార్ట్ మెంట్ ఐష్ సొంతం. దీని విలువ రూ. 15 కోట్లు. ఈ ఇంటిలో ప్రైవేట్ పూల్, జిమ్, డిజైనర్ కిచెన్ వంటి అధునాత‌న సౌకర్యాలు ఉన్నాయి. 2015లో ముంబై బాంద్రాలో 21 కోట్ల రూపాయల విలువైన 5బిహెచ్‌కే బంగ్లాను ఐష్‌ కొనుగోలు చేసారు. రోల్స్ రాయిస్ ఘోస్ట్ (రూ. 6.95 కోట్లు), ఆడి ఎ8ఎల్ (రూ. 1.34 కోట్లు), మెర్సిడెస్-బెంజ్ ఎస్500 (రూ. 1.98 కోట్లు), లెక్సస్ ఎల్‌ఎక్స్ 570 (రూ. 2.84 కోట్లు) సహా ఖ‌రీదైన కార్లు ఐష్ సొంతం.

మ‌రోవైపు నికర ఆస్తుల్లో జూహీచావ్లా, ఐశ్వ‌ర్యారాయ్ త‌ర్వాతి స్థానం ప్రియాంక చోప్రాకు ద‌క్కింది. గ్లోబ‌ల్ స్టార్ గా ఎదిగిన పీసీ రూ. 650 కోట్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నారు. భార‌త‌దేశంలో అత్య‌ధిక పారితోషికం అందుకునే స్టార్ గా ప్రియాంక చోప్రా రికార్డుల‌కెక్కారు. పీసీ ఒక్కో సినిమాకి 30కోట్లు డిమాండ్ చేస్తుంది. అలియా భట్ , దీపికా పదుకొణె సంప‌న్న న‌టీమ‌ణుల్లో టాప్ 5 లో ఉన్నారు. వీరంతా పారితోషికాల‌తో పాటు బ్రాండ్ ప‌బ్లిసిటీతోను భారీగా ఆర్జిస్తున్నారు. సొంతంగా ప‌లు వ్యాపారాల్ని నిర్వ‌హిస్తున్నార‌ని హురూన్ సంస్థ వెల్ల‌డించింది.

Tags:    

Similar News