క‌మ‌ల్‌హాస‌న్‌తో ఖుష్బూ న‌ట‌వార‌సురాలు?

మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమం నుండి ఒక ఉద్వేగభరితమైన స్నాప్‌షాట్‌ను న‌టి ఖుష్బూ షేర్ చేసారు.

Update: 2023-10-28 15:38 GMT

ఉల‌గ‌నాయ‌గ‌న్ కమల్ హాసన్-ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం 36 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి క‌లిసి ప‌ని చేస్తున్నారు. నాయ‌గ‌న్ (నాయ‌కుడు) త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు ఈ అరుదైన క‌ల‌యిక సాధ్య‌మ‌వుతోంది. ఇద్ద‌రు లెజెండ‌రీల క‌ల‌యిక‌గా దీనిని అభిమానులు చూస్తున్నారు. దీంతో ఇంకా సినిమా లాంచ్ కాకుండానే బోలెడంత హైప్ నెల‌కొంది. ఈ జ‌డీ ప్రాజెక్ట్ లాంచ్ ఈవెంట్ ఎంతో ఉత్కంఠ రేపుతోంది.

ఆస‌క్తిక‌రంగా ఈ సినిమాలో క‌థానాయిక‌గా నాటి మేటి క‌థానాయిక‌ ఖుష్బూ సుందర్ చిన్న కుమార్తె ఆనందిత సుందర్‌గా ధృవీకరించింది చిత్ర‌బృందం. 1987 క్లాసిక్ నాయకన్‌లో చివరిసారిగా కలిసి పనిచేసిన కమల్ హాసన్ -మణిరత్నం మరోసారి అలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేయాల‌నే భారీ ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఈ చిత్రం కమల్ హాసన్ కెరీర్ లో 234వ సినిమా. అందుకే దీని వర్కింగ్ టైటిల్ KH234 గా నిర్ణ‌యించారు. ఇలాంటి క్రేజీ సినిమాలో ఆఫ‌ర్ అందుకున్న ఖుష్బూ సుందర్ కుమార్తె ఆనందితకు నెటిజ‌నుల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవ‌కాశం త‌న జీవితంలో చాలా అరుదైన‌ది అంటూ అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు.

మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమం నుండి ఒక ఉద్వేగభరితమైన స్నాప్‌షాట్‌ను న‌టి ఖుష్బూ షేర్ చేసారు. దానితో పాటు భావోద్వేగపూరితమైన శీర్షికను జోడించారు. తాజా సోష‌ల్ మీడియా పోస్ట్‌లో తన కుమార్తె పరిశ్రమలోని ఇద్దరు గొప్ప దిగ్గజాలతో కలిసి నిలబడటం చూసి తల్లిగానే కాకుండా సినీ సోదర భావం ప‌రంగాను గర్వం క‌లిగిస్తోంద‌ని ఖుష్బూ అన్నారు.

ఈ పోస్ట్‌కు లైక్‌లు క్లిక్ లు హోరెత్తాయి. ఖుష్బూ అభిమానుల నుండి ఆనందిత‌కు చాలా మద్దతు ల‌భించింది. ఆనందిత కెరీర్‌లో ఈ ముఖ్యమైన మైలురాయిని ప్రశంసిస్తూ ఆప్యాయతతో కూడిన భావాలతో ఫ్యాన్స్ ప్ర‌శంస‌లు కురిపించారు.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కూడా విడుదల చేశారు. తాజా క‌థ‌నం ప్రకారం.. ఈ చిత్రం ప్ర‌చార వీడియో నవంబర్ 7 న విడుదల కానుంది. అది కూడా కమల్ హాసన్ పుట్టిన తేదీన ఇది ఫ్యాన్స్ కి స్పెష‌ల్ ట్రీట్ గా మార‌నుంది.

ఈ చిత్రాన్ని కమల్ హాసన్ కి చెందిన‌ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ -మణిరత్నం కి చెందిన‌ మద్రాస్ టాకీస్ అండ్ రెడ్ జెయింట్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఏఆర్ రెహమాన్. సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్. ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్. కాస్ట్యూమ్స్: ఏకా లఖాని. ఈ సినిమా పోస్టర్లను గోపి ప్రసన్న డిజైన్ చేశారు.

Tags:    

Similar News