అక్కడ కల్కి ఈవెంట్.. ఏపీ సర్కార్ కు బూస్టప్!

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ తో మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Update: 2024-06-11 11:09 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశాలతో పాటు ఇండియాలో కూడా ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ తో మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 27వ తేదీ ఎలా అయినా సినిమా చూడాలనేంతగా హైప్ క్రియేట్ అయింది. ఇక మేకర్స్ నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి. హాలీవుడ్ రేంజ్ లో మూవీని నాగ్ అశ్విన్ తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. మేకింగ్, గ్రాఫిక్స్, విజువల్స్, వెహికల్స్, వెపన్స్.. అలా అన్నీ కూడా వేరే లెవల్ లో ఉన్నాయి.

ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పైనే అందరి దృష్టి నెలకొంది. కొన్ని రోజుల క్రితం జరిగిన బుజ్జి రివీల్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసిన మేకర్స్.. ప్రీ రిలీజ్ వేడుకను ఇంకెంత వినూత్నంగా నిర్వహిస్తారోనని అంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఈవెంట్ కోసం అదిరిపోయే ప్లాన్ వేశారట నాగి. మూవీపై మరింత బజ్ పెంచే విధంగా నిర్వహించనున్నారని టాక్. అయితే ఈ వేడుక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరగనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతి పనులు మళ్లీ మొదలయ్యాయి. అక్కడ ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ జరుగుతోంది. చంద్రబాబు కూడా అమరావతే రాజధాని అని మరోసారి అనౌన్స్ చేశారు. దీంతో అక్కడే కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని నిర్మాత అశ్వనీదత్ ఆస్తకిగా ఉన్నారట. అంతే కాదు ఆ వేడుకకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నారని సమాచారం.

మరోవైపు, మొన్నటి జూన్ 2వ తేదీ నుంచి హైదరాబాద్.. కేవలం తెలంగాణ క్యాపిటల్ గా పరిగణనలోకి వచ్చింది. అంతకుముందు వరకు ఉమ్మడి రాజధానిగా ఉండేది. దీంతో ఏపీకి రాజధాని కూడా లేదని ట్రోల్స్, మీమ్స్ నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే ముందే చంద్రబాబు.. ఏపీ క్యాపిటల్ అమరావతిగా ప్రకటించారు. దీంతో ఇప్పుడు అక్కడ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే.. పాన్ ఇండియా లెవెల్ లో అందరి దృష్టి అమరావతిపై పడుతుంది. ఇది కొత్త ప్రభుత్వానికి మంచి బూస్టప్ అని చెప్పవచ్చు.

Tags:    

Similar News